Breaking News

జులై 4 వ తేదీ భీమవరం రానున్నప్రధానమంత్రి మోదీ

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి?//- బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం నాడు విజయవాడ వచ్చారు.వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు.జులై 4 వ తేదీ నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ భీమవరం రానున్నారు.అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో భాగంగా ప్రధాని పర్యటన జరుగనుంది. అల్లూరి విగ్రహ ఆవిష్కరణ,ఏడాది పాటు జరిపే ఉత్సవాలకు శ్రీకారం చుట్టడం మొదలైనవి జరుగనున్నాయి.అల్లూరి గురించి ఆంధ్రప్రదేశ్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రావడం నిజంగా గొప్ప విషయం.ఆజాదీ కా అమృతోత్సవ్ లో భాగంగా అల్లూరి జయంతిని ప్రత్యేకంగా జరపడం ప్రశంసాపాత్రం. బ్రిటిష్ వారిని ఎదిరించి అల్లూరి చేసిన పోరాటంలో గిరిజనుల పాత్ర వెలకట్టలేనిది.వారి త్యాగం ఎన్నటికీ మరువలేనిది.ప్రధానమంత్రి పర్యటనలో,అల్లూరి ఉత్సవాల్లోగిరిజన పెద్దలను ఆహ్వానించి, గౌరవించడం సముచితం, సమున్నతం.బిజెపి వైపు ఆకర్షించబడుతున్నవారిలో గిరిజనులు ప్రధానంగా ఉన్నారు.ఈ సందర్భంలో ఇది గమనార్హం.ఇవ్వనీ ఇలా ఉండగా,తెలుగు రాష్ట్రాల్లో బిజెపిని బలోపేతం చేయాలని పార్టీ చూస్తోంది.ఈ దిశగా చేపట్టిన ప్రయత్నం ఇదే మొదటిది కాదు.ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయత్నం జరుగుతున్నా పార్టీ తీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ.. వైనంలోనే ఉంది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ప్రగతి ఏ మాత్రం చెప్పుకో తగినది కాదు.దానికి కారణాలు ఏంటో? పార్టీ పెద్దలకు,శ్రేణులకు తెలియనిది కాదు.పార్టీని బలోపేతం చేయడంలో సరియైన చర్యలు చేపట్టిన దాఖలాలు కూడా పెద్దలేవు.దేశ అధికారం వాజ్ పెయి చేతుల్లో ఉన్నప్పుడు,ఇప్పుడు మోదీ చేతుల్లో ఉన్నప్పుడు కూడా అదే తీరు.2014 ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే 2019లో పార్టీ మరింత చతికిలపడింది.దిద్దుబాటు చర్యలు కూడా ఎక్కడా కనిపించలేదు.రాష్ట్ర అధ్యక్షుడి మార్పు మాత్రం జరిగింది,ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరికి మంచి పదవులు వచ్చాయి. కొంతమందికి ప్రమోషన్స్ వచ్చాయి. స్పోక్స్ పర్సన్స్ కూడా మారిపోయారు.కొత్త గొంతులు వచ్చాయి.ఇవ్వేమీ పార్టీకి మేలుచేసినట్లు ఎక్కడా కనిపించడం లేదు.దేశాన్ని రక్షించడంలోబిజెపి ప్రభుత్వ పాత్ర,కేంద్రం అమలు చేస్తున్న పథకాలు,అభివృద్ధి,కార్యాచరణ మొదలైనవాటిని విస్తృతంగా ప్రజల్లోకి,కార్యకర్తల్లోకి,పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లండనిపార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తాజా విజయవాడ పర్యటనలో పిలుపునిచ్చారు.శక్తి కేంద్ర ప్రముఖులతో సమావేశాలు నిర్వహించిన క్రమంలో పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలనినడ్డా దిశానిర్దేశం చేశారు.ఆంధ్రప్రదేశ్ లో సుమారు 46వేల పోలింగ్ బూతులు ఉన్నాయి. వాటిని లక్ష్యంగా చేసుకొని పనిచేయండని ఆయన గట్టిగా చెప్పారు.2024 ఎన్నికల సమయానికి పార్టీ మరింతగా బలోపేతమవుతుందనే విశ్వాసంలో అధ్యక్షులవారు,ఇతర పెద్దలు ఉన్నారు.జులై లో ప్రధాని నరేంద్ర రాకతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఎంతో ఎదిగిపోతుందనే నమ్మకంలో కొందరు పార్టీ పెద్దలు ఉన్నారు.ఏ మేరకు ఫలితాలు వస్తాయో కాలంలో ఎలాగూ తేలుతుంది.క్షేత్ర స్థాయి నివేదికలు వేరుగా ఉన్నాయి.జనసేన – బిజెపి పొత్తు అంశం కూడా గందరగోళంగా ఉంది.వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా,అందరం కలిసి,వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దింపేద్దామని జనసేనాధినేతపవన్ కల్యాణ్ అంటున్నారు. టీడీపి,జనసేన,బిజెపి,ఇతర ప్రతిపక్షాలన్నీ కలిసి ఎన్నికల్లో నిలిస్తే? వైసీపీ అధికారాన్ని కోల్పోవడం తధ్యమని ఒక వర్గం బలంగా ప్రచారం చేస్తోంది. ఎవరెవరు కలిసినా..టిడిపి ఉన్న చోట బిజెపి ఉండే ప్రసక్తే లేదని మరికొందరు అంటున్నారు.ఎన్నికల వేళ మాత్రమే అసలు కథ తెలుస్తుంది.ఈలోపు ప్రతిపక్షాలన్నీ బలపడాల్సి ఉంది.ముఖ్యంగా బిజెపి ఎంతో కృషి చేయాల్సి ఉంది.ఎన్నికల్లోపు పార్టీ అధ్యక్షుడిని మారుస్తారని కొందరు,మార్చరని కొందరు అంటున్నారు.ఈ సంగతి అలా ఉంచుదాం.అధ్యక్షుడిగా తానేంటో నిరూపించుకోవాల్సిన బాధ్యత సోము వీర్రాజుపై ఉంది.ప్రత్యేక హోదాను ఇవ్వకపోవడం, వివిధ కేటాయింపుల్లో రాష్ట్రానికి పెద్దగా వనకూరింది ఏమీ లేకపోవడం,ప్రజాకర్షణ కలిగిన నాయకులు పార్టీలో పెద్దగా లేకపోవడం మొదలైన కారణాలతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలపడడం అంత ఆషామాషీ కాదు.త్యాగాల ఫలంగా తెచ్చుకున్నవిశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తామంటున్నారు! ఇటువంటివన్నీ పార్టీకి నష్టాన్ని కలిగించేవే.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత కాంగ్రెస్ కుదేలైపోయింది.ఆ ఖాళీని తమకు అనుకూలంగా మలుచుకోవడంలోనూ బిజెపి వెనకబడిపోయింది.సాక్షాత్తు ప్రధానమంత్రి’ప్రత్యేక హోదా’ కేటాయింపు గురించి మాటయిచ్చి తప్పారనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది.ఆ ప్రభావం 2019ఎన్నికల్లో బిజెపి పై పడింది.పార్టీకి ఘోర వైఫల్యం ఎదురైంది.2019 ఎన్నికల ఫలితాల తర్వాత దెబ్బతిన్న తెలుగుదేశం నుంచి బిజెపికి వలసలు ఎక్కువగా వెళతాయనే ప్రచారం జరిగింది. అదేమీ కార్యరూపం దాల్చలేదు.నేతల్లో,శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం పార్టీకి అగ్నిపరీక్ష. ఓటుబ్యాంక్ ను పెంచుకోవడం పెద్దపరీక్ష.బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ప్రతిపార్టీ చూస్తోంది.ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి ఇది ఆతి పెద్ద సవాల్.మొదటి నుంచీ,ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నిర్మాణానికి సరియైన చర్యలు తీసుకోకపోవడం పార్టీ చేసిన మొదటి తప్పు,ఆ తర్వాత కూడా పాఠాలు నేర్చుకోకపోవడంమరో పెద్దతప్పు,ఇలా తప్పులమీద తప్పులు చేసుకుంటూ వెళ్లిపోవడం ఇప్పుడు తలనొప్పిగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బాగుపడాలంటే చాలా ప్రక్షాళనలు జరగాలి.ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప!ప్రస్తుత వాతావరణంలో పార్టీ ఎదగడానికి చాలా సమయం పడుతుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు.ఏలుబడి ఎలా ఉన్నా?ఇప్పటికైనా మేలుకుంటే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *