అవనిగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేకుండా అవినీతి మాత్రమే కనిపిస్తుందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. పంచాయతీ రోడ్లపై కానీ, ఆర్ అండ్ బి రోడ్లపై కానీ, జిల్క్ పరిషత్ రోడ్లపై కానీ చారెడు మట్టి వేయలేదని, నిరంతరం మట్టి, ఇసుక దోపిడీ మాత్రం యదేశ్చగా జరుగుతుందని అన్నారు. కొత్తగా సముద్రంలో దొరికే నల్ల ఇసుకను దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఇటువంటి తవ్వుకుంటూ పోతే పర్యావరణానికి హాని కలుగుతుందని కేంద్రప్రభుత్వం నిషేధించిందని, దివిసీమ ప్రాంతం కృష్ణా అభయారణ్యం ప్రాంతం కావడం వలన ఈ ప్రాంతంలో ఎటువంటి తవ్వకాలు జరుపకూడదని అన్నారు. గతంలో అటవీ ప్రాంతంలో ఉందని నాచుగుంట తదితర ప్రాంతాలలో ప్రజలు నడవడానికి కనీసం రోడ్డును కూడా అటవీశాఖ అధికారులు వేయనివ్వలేదని అన్నారు. కానీ నేడు అటవీ ప్రాంతంలో విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతుంటే అటవీశాఖ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అటవీశాఖ వైఫల్యం చెందిందా లేక అటవీశాఖ అవినీతిలో పాలుపంచుకుంటుందా అర్ధం కావడం లేదన్నారు. ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశీలించి, ఇటువంటి చర్యలు చేపడితే పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారని, కేంద్రప్రభుత్వం నిషేదించినా, ఇక్కడ టన్నుల కొద్దీ నల్ల ఇసుక తరలిస్తుంటే పట్టించుకోవాల్సిన అటవీ శాఖ, పోలీస్ శాఖ, రెవిన్యూ శాఖ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయం తెలిసి కూడా స్థానిక శాసనసభ్యులు కూడా పట్టించుకోవడం లేదంటే ఆయనకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉండేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అటవీశాఖ మేల్కొని ఇప్పటివరకు ఎంత లోతున, ఎన్ని టన్నులలో, ఎంతమేర తవ్వకాలు జరిపారో విచారించి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించి, వారి ద్వారా అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల అధ్యక్షులు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు