Breaking News

శాంతిభద్రతల విచ్ఛిన్నమే వైసీపీ ధ్యేయం

మంగళగిరి

 జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

* ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది

* నిన్న కోనసీమ … నేడు విశాఖలో గొడవకు అదే కారణం

* వివాదాలు, ఘర్షణలకు సంబంధం లేని జనసేన నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు

* నేరమయ రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి

* వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ తోనే అభివృద్ధి సాధ్యం

* న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది

* రెచ్చగొట్టాలని చూసినా.. హుందాగా, సహనంగా రాజకీయాలు చేస్తాం

సంఘవిద్రోహ శక్తులు శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే ప్రభుత్వం దానిని బలంగా ఎదుర్కోవాలి… కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వమే శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తోందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. కొంతమంది ఉత్తరాంధ్ర వైసీపీ నాయకుల అవినీతి బాగోతం ఎక్కడ బయట పడుతుందో అనే భయంతో జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారని అన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జరిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని, ఆ దిశగా జనసేన అడుగులు వేస్తుందని చెప్పారు. సోమవారం సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శ్రీ కొణిదెల నాగబాబు గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “అధికార వైసీపీ పార్టీకి పోటీగా కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశం మాకు లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజే మేము చెప్పాం.. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం తప్ప.. వ్యక్తిగత దూషణలు ఉండవని. వైసీపీ గర్జన కార్యక్రమాన్ని ప్రకటించక ముందే విశాఖ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకొని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. అమరావతిపై ఎవరూ మాట్లాడకూడదు.. మూడు రాజధానులపై నోరెత్తకూడదు అంటే ఎలా? జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ. పార్టీకి కొన్ని స్టాండ్స్ ఉంటాయి. వైసీపీలా అధికారంలోకి రాక ముందు ఒక మాట… అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడం మాకు చేతకాదు. అంత దిగజారుడు ఆలోచన విధానం జనసేనకు ఎప్పడూ రాదు.

* వైసీపీ కోరుకుంటున్న హింసను ఇవ్వలేం

వైసీపీ నాయకుల్లో ఎక్కువ శాతం మంది నోటికి అడ్డు అదుపు ఉండదు. బూతులు తిడతారు.. దాడులు చేస్తారు. ఇంట్లో వాళ్లను లాగుతారు. రాజకీయం అంటే సామాన్యుడు భయపడే స్థాయికి రాజకీయాలను తీసుకెళ్తే తప్ప రాజకీయాలు మన అదుపులో ఉండవని వాళ్లు అపోహ పడుతున్నారు. వైసీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు… ఉడత ఊపులకు భయపడేవాడు ఎవడూ లేడు. వైసీపీ బ్యాచ్ ను తమిళనాడు వాళ్లు తరిమేశారు… తెలంగాణ నాయకులు వెళ్లగొట్టారు. అయినా మన రాజకీయ వ్యవస్థకు సిగ్గులేకపోతే ఎలా? కులాలు, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. మొన్నటికి మొన్న కోనసీమలో ఇదే ప్రయత్నం జరిగింది. వైసీపీ మనుషులే వాళ్ల మంత్రి ఇంటిని తగలబెట్టేశారు. మా వాళ్లు మీద తోసేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. దానిని తిప్పికొట్టాం. మూడు రాజధానులకు అనుకూలంగా పెట్టిన గర్జన ఫెయిల్ అవ్వడం… మా పార్టీ ర్యాలీ సక్సెస్ అవ్వడం ఓర్వలేక ఇలా డ్రామాలు అడుతున్నారు. మంత్రులు కాన్వాయ్ వెళ్తుంటే పోలీసులు బందోబస్తు ఎందుకు ఇవ్వలేదు? జన సైనికులను ఎందుకు కవ్వించారు? వాళ్ల ప్లాన్ లో భాగంగానే ఇదంతా

జరిగింది. రెచ్చగొడితే రెచ్చిపోతానని నన్ను కూడా ఒక ఐ.పి.ఎస్. అధికారి రెచ్చగొట్టాలని చూశారు. లా అండ్ అర్డర్ సమస్య వస్తే మూసేద్దాం అనుకున్నారు. రాష్ట్ర శేయస్సు కోరుకునే వాడిని నేను.. వైసీపీ కోరుకునే హింసను ఇవ్వలేం.

* వైసీపీ వాళ్ళు రాళ్ళు విసిరితే భావ స్వేచ్ఛ

వైసీపీ వాళ్లు రాళ్లు విసిరి అద్దాలు పగలుగొడితే వాళ్లది భావ స్వేచ్ఛ… మిగతా ఏ పార్టీలు నోరు విప్పినా వాళ్లపై హత్యాయత్నం కేసులు పెడతారు. నేను విశాఖ వస్తున్నానని చెప్పి 14 మంది ఒక కమిటీగా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే… వాళ్లపై సెక్షన్ 307 కింద కేసులు పెట్టారు. మరో 105 మందిపై కేసులు పెట్టారు. రూప అనే జన సైనికులరాలిని అక్రమంగా అరెస్టు చేశారు. రెండేళ్ల కూతురుతో ఇంట్లో ఉన్న ఆమెను బలవంతంగా లాక్కెళ్లి జైల్లో పెట్టారు. అసలు ఎయిర్ పోర్టు సంఘటనతో సంబంధం లేని వ్యక్తులపై అక్రమంగా కేసులు బనాయించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదని చెప్పిన వ్యక్తి కోసం… రాష్ట్రం మీద అపారమైన ప్రేమ ఉన్న మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. మా పార్టీ నాయకులను రక్షించుకోవడానికి బలంగా నిలబడతాం.

* నన్ను క్రిమినల్స్ పాలించకూడదని అనుకుంటాను

ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. స్థాయి అధికారులు క్రిమినల్స్ కు సలాం కొడుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు నా నాటికి దిగజారిపోతున్నాయి. దీనిని ఎక్కడో చోట ఎదుర్కొవాలి. నేను నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులతో పాలన చేయరాదు అనుకుంటాను. దాని కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఘటనతో సంబంధం లేని 14 మంది జనసేన నాయకులు ఈ రోజు ఇంకా జైల్లో ఉన్నారు. జైలు శాఖ అధికారులు మా నాయకులను కొట్టినట్లు మాకు తెలిసింది. మరికొంతమందిని మోకాళ్లపై నడిపించారని, బెల్ట్ తో కొట్టారని విన్నాను. ఈ రోజు మరో 54 మందిపై కేసులు పెట్టారు. మా నాయకులను ఇంతకుముందే కలిశాను. వాళ్లకు ఒకటే చెప్పాను. బలంగా నిలబడాలి… ఎదుర్కొవాలి… గొంతెత్తాలి… ఆ క్రమంలో జైలుకు వెళ్లాలి… దెబ్బలు తినాలి… ఎన్నికలకు వెళ్లాలి అని చెప్పాను. వాళ్లు కూడా బలంగా పోరాడదాం అని చెప్పారు.

* అవినీతి బయటపడుతుందనే జనవాణి అడ్డుకున్నారు

నోరుజారే వైసీపీ నాయకులకు మంగళగిరి నుంచి ఒకటే చెబుతున్నాను… మిమ్మల్ని మేము బలంగా ఎదుర్కొంటాం. ఏం చేసుకుంటారో చేసుకోండి. భవిష్యత్తులో ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు. భోగాపురం భూసేకరణ విషయంలో ఒక క్షత్రియ ఆడపడుచుతో వైసీపీ నాయకులు

అప్పట్లో కేసులు వేయించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆమె దగ్గర కూడా భూమి లాక్కోవాలని చూస్తున్నారు. దసపల్లా భూముల విషయంలో కూడా ప్రభుత్వం ఇలానే వ్యవహరించింది. రుషికొండ, విశాఖలో భూముల కబ్జాలపై జనసేన కార్పొరేటర్ శ్రీ మూర్తి యాదవ్ పోరాటం చేస్తున్నారని ఆయన మీద కూడా సెక్షన్ 307 కింద కేసులు పెట్టారు.

కులాల మధ్య కూడా గొడవలు పెడుతున్నారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. వైసీపీ అక్రమాలు ప్రశ్నించాడని దళిత డాక్టర్ పై పిచ్చడనే ముద్ర వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడికి శిరోముండనం చేశారు. రాజధాని రైతులు ఏపీ ప్రభుత్వానికి భూములు ఇచ్చి ఇప్పుడు నష్టపోతే… వారి పాదయాత్రను అడ్డుకుంటారంట..?

సైనికులకు ఇచ్చిన భూములను మంత్రి ధర్మాన గారు కొట్టేశారు. నిన్న జనవాణి జరగకపోయినా మా నాయకులు 300కు పైగా అర్జీలు స్వీకరించారు. అందులో మంత్రి ధర్మాన గారు, ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, విజయనగరంకు చెందిన ఒక నాయకుడు, అనకాపల్లికి చెందిన మరో నాయకుడు భూ కబ్జాలు, అవినీతిపైన ఎక్కువ అర్జీలు వచ్చాయి. వాళ్ల అవినీతి బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని భయంతో జనవాణిని అడ్డుకున్నారు.

* ప్రాథమిక హక్కుల భంగంపై హైకోర్టును ఆశ్రయిస్తాం

న్యాయ వ్యవస్థపై జనసేనకు పూర్తి విశ్వాసం ఉంది. నినాదాలు చేసే వారిపై ఐ.పి.సి. సెక్షన్ 307 ప్రకారం ఎందుకు కేసులు పెట్టారు… దానిని సెక్షన్ 326 కింద మార్చండి అని న్యాయ వ్యవస్థ చెప్పింది. మీడియా ముఖంగా మనస్ఫూర్తిగా న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

అలాగే వైసీపీ ప్రభుత్వం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోంది. మంత్రులకే హక్కులు ఉన్నట్లు… సామాన్యుడికి హక్కులు లేనట్లు వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. దానిపై కూడా న్యాయ వ్యవస్థ దృష్టిపెట్టాలని కోరుకుంటున్నాను. నాకు పోలీసులు అంటే గౌరవం ఉంది. నేను ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడినే. మేము పోలీసులతో యుద్ధం చేయడం లేదు. మేము సంఘ విద్రోహ శక్తులు అన్నట్లు విశాఖను పోలీస్ మయం చేశారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నోవాటెల్ హోటల్ లో గందరగోళం సృష్టించారు. ఎంతోమంది విదేశీ పర్యాటకులు అక్కడ ఉన్నారు. వారిని భయాందోళనకు గురి చేశారు. ఇలా అయితే పర్యాటక రంగం నాశనం కాదా? నా సినిమా విడుదలైనప్పుడే టికెట్ల రేట్లు తగ్గుతాయి? నా పర్యటన జరిగినప్పుడే శాంతి భద్రతల సమస్య వస్తుంది. నా పుట్టిన రోజు వచ్చినప్పుడే పర్యావరణంపై ప్రేమ పుట్టుకు వస్తుంది. ఇలాంటి నేరచరిత రాజకీయాలు వైసీపీ నైజం. దీనిని ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే జనసేన లక్ష్యం. అప్పుడే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుంది. దానికోసమే జనసేన ముందు ఉంటుంది. ప్రజలను చైతన్యం చేయడంలో మీడియా, జర్నలిస్టులు కూడా మాకు సహకరించాలి.

* ఇక్కడే తేల్చుకుంటాను

ప్రతి విషయాన్ని బీజేపీ పెద్దల వద్దకు తీసుకెళ్లి, చాడీలు చెప్పి సహాయం అడిగే వ్యక్తిని కాను. బీజేపీ పెద్దలు సైతం స్థానిక నాయకత్వమే బలంగా పోరాడాలని అని నమ్ముతారు. నేను కూడా వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నా.. నేను ఇక్కడే పోరాటం చేస్తాను. ఇక్కడే తేల్చుకుంటాను. మా ఆంధ్రప్రదేశ్ ను మా తెలుగు నేలను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు మేము ఢిల్లీ దాకా వెళ్లము ఇక్కడే తేల్చుకుంటాం. వైసీపీకి చెప్తున్నా ఇక్కడే తేల్చుకుంటాం’’ అని స్పష్టం చేశారు.

 *గర్జన ఫ్లాప్ అయిన కడుపు మంటతోనే కేసులు పెట్టారు : శ్రీ నాదెండ్ల మనోహర్ గారు*

రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “సామాన్యుడు గళం వినిపించడానికి ఏర్పాటు చేసిన వేదిక జనవాణి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నాలుగు విడతల కార్యక్రమంలో దాదాపు 3 వేలకు పైగా అర్జీలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం వివిధ ప్రభుత్వ శాఖలకు స్వయంగా లేఖలు రాశారు. ఐదో విడత విశాఖపట్నం వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు అడ్డుకోవాలని ప్రెస్ మీట్లు పెట్టి మరి క్యాడర్ కు పిలుపునిచ్చారు. వైసీపీ నాయకుల గర్జన కార్యక్రమం అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో … ఆ కడుపు మంటతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనను అడుగడుగునా అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఒక ఐ.పి.ఎస్. అధికారి శ్రీ పవన్ కళ్యాణ్ గారి బండి ఎక్కి మరి ర్యాలీ నిలిపివేయాలని చెప్పడం గతంలో ఎప్పుడూ చూడలేదు. ర్యాలీని నిలిపివేయాలని తాడేపల్లి ప్యాలస్ నుంచి నిమిషం, నిమిషం పోలీసులపై ఒత్తిడులు వచ్చాయి. వీధి దీపాలు ఆపేసి ఇబ్బంది పెట్టాలని చూశారు. ప్రజాస్వామ్యంలో అందరూ ముక్త కంఠంతో ఖండించించాల్సిన సందర్భం ఇది. ఐపీసీ

* సెక్షన్ 307 కింద 105 మందిపై కేసులు పెట్టారు

జనవాణి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని 15 తేదీ అర్థరాత్రి దాటినా తరువాత పోలీసులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బస చేసిన హోటల్ తలుపులు బాదడం మొదలుపెట్టారు. తెల్లవారుజామున 4 గంటల వరకు హడావుడి చేశారు. దాదాపు 600 నుంచి 700 మంది పోలీసులు హోటల్ ను మేం బస చేసిన హోటల్ అధీనంలోకి తీసుకొని జనసేన నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి తీసుకెళ్లా రు. సెక్షన్ 307 కింద 105 మందిపై కేసులు పెట్టారు. ఈ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులపై కేసులు నమోదు చేసి ఇళ్ల నుంచి తీసుకెళ్లారు.

చెత్తబుట్ట మూతను, కవర్లను మారణాయుధాలుగా ఉపయోగించారని కేసులు పెట్టారు. ఇంతకంటే దౌర్భగ్యం ఏమైనా ఉందా?

* వైసీపీకి లేని నిబంధనలు జనసేనకు ఎందుకు?

శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 500 మంది గుంపుగా మంత్రులపై దాడులకు పాల్పడ్డారని నోటీసుల్లో రాశారు. వైసీపీ నాయకులు చెప్పినట్లు దాడి మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం 4.40 నిమిషాలకు విమానాశ్రయం చేరుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో దాడి జరిగిందని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిని మార్చాలని చివర వరకు పోరాటం చేశాం. ఈ నెల 1వ తేదీ నుంచి పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్న కారణంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదు, డ్రోన్లు ఎగరవేయకూడదని పోలీసులు చెబుతున్నారు. మరి 15వ తేదీ వైసీపీ నాయకులు గర్జన ఎలా చేశారు? వారికి వర్తించని రూల్స్ కేవలం జనసేనకు మాత్రమే వర్తిస్తాయా? పర్యటనకు ముందు రుషికొండ అక్రమాలపై మాట్లాడాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ఈ సమాచారం లీక్ కావడంతో పర్యటనలో డ్రోన్లు కూడా ఉపయోగించకూడదని నిబంధన పెట్టారు. ఎయిర్ పోర్టుకు వెళ్లినప్పుడు కూడా కారు బయటకు వచ్చి నమస్కారాలు పెట్టకూడదని చెప్పారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడికి ఇలాంటి నిబంధనలు పెట్టడం రాజకీయ చరిత్రలో ఎక్కడా చూడలేదు. న్యాయశాఖపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మా పార్టీ న్యాయ నిపుణులు అహర్నిశలు కష్టపడి చాలా మంది నాయకులను బయటకు తీసుకొచ్చారు. వారికి మా ధన్యవాదాలు. మా నాయకులకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామ”న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *