తెలంగాణ
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి మండిపడ్డారు. ఎవరూ పట్టించుకోకున్నా ఇతర రాష్ట్రాల సీఎంల వద్ద కేసీఆర్ పడిగాపులు కాస్తున్నారని అన్నారు.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వద్ద అపాయింట్ మెంట్ కోసం కేసీఆర్ పడిగాపులు కాయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.మీడియాతో మాట్లాడిన ఈటల.రాష్ట్రంలో పరిపాలించడం చేతకాక సీఎం ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. 2018లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని వెళ్లిన కేసీఆర్ బొక్కబోర్ల పడ్డారని విమర్శించారు. తెలంగాణ రైతులను ఆదుకోని ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాల్లో చెక్కులు పంచడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. చట్టాలను మార్చి అప్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న సీఎంను కాగ్ తప్పు పట్టిందని రూ. 3 లక్షల 29 కోట్లకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని, ఉద్యోగులకు జీతాలు, సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వలేని స్థితిలోకి రాష్ట్రం దిగజారిపోయిందని ఇదంతా కేసీఆర్ అసమర్ధత వల్లే జరిగిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని మండిపడ్డారు. ఇష్టారీతిన అన్నింటిపైనా చార్జీలు పెంచి పేద, సామాన్య, మధ్య తరగతి వారిపై ఆర్థిక భారం మోపుతున్నారని మండిపడ్డారు.