Breaking News

జెట్ బిళ్లలు -దీపం బుడ్డి

జెట్ బిళ్లలు -దీపం బుడ్డి

వీధి లైట్లు కింద చదువుకున్నారని గొప్పగొప్పవాళ్ల జీవిత చరిత్రలు చదివి నేనెప్పుడూ ఆశ్చర్యానికి గురికాలేదు .. ఎందుకంటే నేను అలా చదువుకోవడానికి మా ఇంటి దగ్గరలో అసలు వీధి దీపాలే లేవు .. అసలు మా ఇల్లు ఉన్నచోట కరెంటే లేదు .. నేను కిరసనాయిల్ దీపం బుడ్డి కింద వెలుగులో చదువుకున్నానని గర్వంగానే ఫీల్ అవుతాను ..

బహుశా ఒక పాతికేళ్ల క్రిందటి సంగతి ఇది .. అప్పట్లో ఇంట్లో దోమల్ని తరిమికొట్టడానికి జెట్ కంపెనీ బిళ్లలు వాడేవాళ్లు .. నేనైతే దోమల బిళ్లలు అనేవాడిని .. అసలు పేరేంటో నాకు తెలీదు .. ఒక్కో బిళ్ల చాక్లెట్ మాదిరిగా సిల్వర్ కవర్ ప్యాక్ చేసి ఉండేది ..కరెంట్ ఉన్నవాళ్లు జెట్ కంపెనీ కి చెందిన ఎలక్ట్రిక్ మిషన్ లో ఆ బిళ్ల పెడితే వేడెక్కి అందులోంచి వచ్చే పొగ వల్ల దోమలు చచ్చిపోయేవి .. లేదా పారిపోయేవి .. అప్పటికి నాకు తెలిసి మస్కిటో కాయిల్స్ , లిక్విడ్స్ ఉండేవి కావు .. ఆ బిళ్ల మిషన్ లో పెట్టగానే మంచి వాసన కూడా వచ్చేది .. గుడివాడలో ఏ ఇంటిముందు చూసినా ఇలా వాడిపారేసిన బిళ్లలు రోడ్డు మీద కనిపించేవి ..

మా ఇంట్లో అప్పట్లో కరెంట్ లేదు .. ఇంట్లో వెలుగుకోసం దీపం బుడ్డి పెట్టేవాళ్లం .. కింద గుండ్రంగా స్టీల్ బాల్ లాంటిది ఉండేది .. అందులో కిరోసిన్ పోసి దానికి ఒత్తి పెట్టేవాళ్లం .. ఆ ఒత్తి పైన గాలి తగలకుండా గాజు బుడ్డి పెట్టి ఒత్తి వెలిగిస్తే రాత్రంతా బుడ్డి వెలిగి ఇంట్లో వెలుగు వచ్చేది ..పంట పొలాల మధ్యలో ఇల్లు ఉండటం వల్ల చలికాలం బాగా దోమలు ఉండేవి ..

జెట్ బిళ్లలు తెచ్చి దీపం బుడ్డి పైన సగం కవర్ అయ్యేలా పెట్టేవాళ్లం .. ఒత్తి వేడికి జెట్ బిళ్ల వేడెక్కి పొగ వచ్చేది .. ఆ పొగకి దోమలన్నీ పారిపోయేవి .. అల జెట్ బిళ్ల బుడ్డి పై పెట్టి పూరింట్లో బుడ్డి వెలుగులో చదువుకునేవాడిని .. మాది తాటాకుల ఇల్లు కావడం వల్ల మధ్యలో ఇల్లు మొత్తానికి నిట్టాడి ఉండేది .. అంటే మెయిన్ పిల్లర్ అన్నమాట .. ఇప్పుడు ఇంటికి పిల్లర్ వాడినట్టు అప్పట్లో ఎండిపోయిన తాటి చెట్టుని అలా మధ్యలో పాతి దానితో ఇల్లు నిర్మించేవాళ్లు .. దాన్నే నిట్టాడి అనేవాళ్లం .. దీపం బుడ్డిని ఆ నిట్టాడికి ఒక పక్క మేకు కొట్టి తగిలిస్తే ఇల్లంతా వెలుగు వచ్చేది .. రాత్రిపూట ఆ నిట్టాడికి ఆనుకుని రెండుకాళ్లు చాపుకుని బుడ్డి వెలుగులో జెట్ బిళ్ల రక్షణలో నా పదోతరగతి వరకూ చదివాను .. ఒక్కోసారి అలా చదువుతూనే నిట్టాడికి ఆనుకుని చదువుకుంటూ అలాగే వాలిపోయి నిద్రపోయేవాడిని ..

ఈ మధ్య ఏజెన్సీలో గిరిజన ప్రాంతాల్లోకి వెళ్లినపుడు అలాంటి దీపం బుడ్డిని చూశాను .. అలాగే అలాంటి దీపం బుడ్డిని ఇప్పుడు పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ లో అమ్ముతున్నారు .. ఆ బుడ్డిలో కొవ్వొత్తి పెట్టి ఇంట్లో అందం కోసం వాడుతున్నారు .. అప్పట్లో నాలాంటివాళ్లకు ఎంతోమందికి చదువుకోవడానికి వెలుగునిచ్చిన ఆ దీపం బుడ్డిలు ఇప్పుడు అలంకరణ వస్తువులు అయ్యాయి ..

అశోక్ వేములపల్లి

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *