Breaking News

అటుక మామిడి

అటుక మామిడి

కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డా డి ఆర్ కె ప్రసాద్ గారు ఇటీవల కొన్ని ఫోటోలు నాకు వాట్స్ యాప్ లో పంపి తమ ప్రాంతంలో విస్తారంగా కనిపించే ఆ ఫోటోలలోని అటుకమామిడి మొక్క గురించి వివరాలు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టమని కోరారు. మిత్రులందరికీ ఉపయోగకరంగా ఉండగలదని నేను ఈ టపా రూపంలో ఆ మొక్క విశేషాలను ముఖపుస్తక మిత్రులందరితో పంచుకుంటున్నాను.

‘అటుక మామిడి’ లేక ‘అటిక మామిడి’ లేక ‘గుడ్ల మల్లి’ అనే మొక్క మన ప్రాంతం అంతటా ఏడాది పొడవునా లభించే మొక్క. సంస్కృతంలో దీనిని ‘పునర్నవా’ అంటారు. ఆంగ్లంలో దీనిని ‘ది స్ప్రెడింగ్ హాగ్ వీడ్’ ( The Spreading Hogweed’ ) అంటారు. నిక్టాజినేసీ ( Nyctaginaceae ) కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం బోర్ హేవియా డిఫ్యూజా ( Boerhaavia diffusa ).

ఈ మొక్క మన ప్రాంతం అంతటా రహదారుల పక్కన, పెరటి దొడ్లలో, తోటలలో, పొలాల్లో కలుపుమొక్కగా పెరుగుతుంది.

ఈ మొక్క నేలను అంటుకుని చుట్టూ వ్యాపిస్తుంది. వేళ్ళు నేలలో బాగా లోతుకు వ్యాపిస్తాయి. ఆకులు ప్రతి కణుపు దగ్గర రెండు చొప్పున ఎదురెదురుగా ఉంటాయి. ఆకులు దాదాపు గుండ్రంగా ఐదు సెంటీమీటర్ల పొడవు కలిగిఉంటాయి. ఆకుల కాడలు పొడవుగా ఉంటాయి. వాటి పైభాగం నున్నగా ఆకుపచ్చగానూ, కింది భాగం తెల్లగానూ ఉంటుంది. కాండం రక్త వర్ణంలో కణుపుల దగ్గర ఉబ్బి ఉంటుంది. ప్రతి కణుపు దగ్గర, ఇంకా కొమ్మ చివర పుష్పాలు చిన్న చిన్న గుత్తులుగా వస్తాయి. అతి సన్నని వీటి పూలు ఎరుపు, తెలుపు రంగులలో ఉంటాయి. తెల్ల పూల రకాన్ని ‘శ్వేత పునర్నవా’ అంటే, ఎర్రపూల రకాన్ని ‘రక్త పునర్నవా’ అంటారు.కాయలు అండాకారంలో ఐదు ఈనెలతో నూగు కలిగి ఉంటాయి.

ఈ మొక్క మొత్తం పచ్చిది కానీ, ఎండుది కానీ మూత్రకారిగా పేరొందిన ‘ పునర్నవా’ అనే ఔషధానికి ప్రధానమైన వనరు. కాండం కంటే ఆకులు, పూలు, వేళ్ళు ఔషధపరంగా ప్రయోజనకరమైనవి. కొందరు గలిజేరు మొక్క ( Trianthema portulacastrum ) కు కూడా ఇవే లక్షణాలు ఉన్నందున అటుక మామిడిని ‘ఎర్ర గలిజేరు’ అనే పేరుతో కూడా వ్యవహరిస్తున్నారు. వీటి ఔషధ విలువలలో సారూప్యత ఉన్నప్పటికీ, తదుపరి శాస్త్ర పరిశోధనలు గలిజేరులో ఉండే ఔషధం ‘ వర్షభూ’ అనీ, అటుకమామిడిలో ఉండేది ‘పునర్నవా’ అనీ – ఈ రెండూ వేర్వేరని తేల్చాయి.

‘పునర్నవా’ పాండురోగాన్నీ, రక్త పిత్తాన్నీ,వాపులనూ, వ్రణాలనూ, శ్లేష్మాన్నీ పోగొట్టి మూత్రం జారీచేస్తుంది. మూత్రపిండాల వాపుకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. పొట్టలోని కణుతులు, గడ్డలు, పేగు కాన్సర్ మొదలైన వాటికి అటుకమామిడి బాగా పనిచేస్తుంది. కడుపులోని బాక్టీరియా వంటి సూక్ష్మక్రిములను నశింపజేయడమే కాక అటుకమామిడి గుండెకు బలాన్నిచ్ఛే టానిక్ లాగానూ పనిచేస్తుంది. సరిగా ఎదగని పిల్లలలో ఎదుగుదల పెంపొందడానికి పాలలో అటుకమామిడి ఆకుల రసం కలిపి పడతారు. ఆకుల రసాన్ని కంటి వ్యాధులలో లోషన్ గానూ ఉపయోగిస్తారు. ఆకుల రసం లోనికి తీసుకుంటే కండరాల నొప్పులు ఉపశమిస్తాయి. రక్త శుద్ధికి కూడా ఈ రసం దోహదం చేస్తుంది.

పల్లెటూళ్లలో అటుకమామిడిని ఆకుకూరగా ఉపయోగించడం నా బాల్యంలో నేను ఎరుగుదును. అటుకమామిడి ఆకుతో కూర,పప్పుకూర, పులుసుకూర వండుకుంటారు. ఖనిజ లవణాలు, సి – విటమిన్ పుష్కలంగా ఉన్నందున ఈ ఆకుకూర శ్రేష్ఠమైనది. గొఱ్ఱెలు, మేకలు ఈ మొక్కల్ని ఇష్టంగా తింటాయి. పాడి పశువులకు అటుక మామిడి మొక్కలు మేతగా తినిపిస్తే పాడి సంవృద్ధి అవుతుంది. అటుక మామిడి గింజలు పక్షుల మేత గానూ ఉపయోగపడతాయి.

— మీ.. రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *