అస్సాంలో తురాయి చెట్లు



అస్సాంలో మేము ఏ పక్కకి వెళ్లినా తురాయి చెట్లు విరగబూసి కనిపించాయి. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సీజన్లో ఎర్రగా విరబూసివున్న తురాయి చెట్లు బాటలకిరువైపులా చక్కటి ఆకర్షణగా నిలుస్తాయి. తురాయి చెట్టునే కొందరు సీమ సుంకేశుల అనీ, కొందరు ఎర్ర తంగేడు అనీ అంటారు. గుల్ మొహర్ అనీ గోల్డ్ మొహర్ అనీ కూడా దీనిని పిలుస్తారు. లెగ్యూమినసీ కుటుంబానికి చెందిన వృక్షమిది. దీని శాస్త్రీయ నామం Delonix regia. దీనినే Poinciana regia అనే శాస్త్రీయ నామంతో కూడా వ్యవహరిస్తారు. ఈ చెట్టు పూరేకులు పంజాల వలె ఉండే కారణంగా దీనికి Delonix అనే పేరు వచ్చింది. Delos (స్పష్టంగా కనిపించే), Onux (పంజా) అనే రెండు గ్రీకు పదాల నుంచి ఈ పేరు ఏర్పడింది. ఆకర్షణీయమైన, మండే మంట వర్ణంలో ఉండే దీని ఎర్రని పూలను బట్టి దీనికి Flamboyant Flame Tree అనే పేరు కూడా ఏర్పడింది. నిండుగా పూచినప్పుడు ఈ చెట్టు రాజసం ఉట్టిపడేట్లు ఉండే కారణంగా దీనిపేరులో ‘regia’ (royal )అనే శబ్దం వచ్చి చేరింది.ఆ రాజసం (Royalty ) కారణంగానే ఈ వృక్షాన్ని అంగ్లంలో Royal Poinciana అనికూడా అంటారు. ఈ చెట్టు కాయలు రెండు అడుగుల పొడవుండే ఖడ్గాలలాగా ఉంటాయి.చిన్నప్పుడు వాటితో ‘యుద్ధాలు’ చేసే వాళ్ళం. ఈ వృక్షం కొమ్మలు బాగా పెళుసు. అంచేత ఈ చెట్లు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని గింజలు నాటితే మొక్కలు మొలుస్తాయి.



కొమ్మలు పాతిపెట్టినా తేలిగ్గానే బతుకుతాయి. ఈ వృక్షం వేళ్ళు నేలలోపలికి లోతుగా చొచ్చుకుపోకుండా, పైపైనే పెరుగుతాయి. అందుకే బలమైన గాలులు వీచినప్పుడు ఈ వృక్షాలు తట్టుకోలేక, వేళ్ళతో సహా పెకలింపబడి కూలిపోతాయి. దీని వేళ్ళు భూమిలోకి లోతుగా వెళ్లకుండా అడ్డంగా పెరిగే కారణంగా తోట మొక్కల పెరుగుదలను దీని వేళ్ళు నిరోధిస్తాయి. అందుకే టీ, కాఫీ వంటి తోటలలో ఇది నీడ మొక్కగా పెంచేందుకు పనికిరాదు.దీని కాయల గింజలలో ఉండే ఓ విధమైన జిగురును పరిశ్రమలలోనూ, చాకొలెట్ల వంటి వాటి తయారీలోనూ వినియోగిస్తారు. ఈ చెట్టు పూలు కొంచెం పుల్లదనం కలిగి ఉంటాయి. వీటిని కొన్ని ప్రాంతాలలో గిరిజనులు కూరగా వండుకుంటారట ! ఈ వృక్షానికి వైద్యపరమైన ప్రయోజనాలు ఏమీ ఉన్నట్లు లేదు.అయితే ఎర్ర తురాయి పూలకు విరిగిన ఎముకలు కట్టుకునేటట్లు చేయగల శక్తి ఉన్నదని ఓ నమ్మకం అనాదిగా ఉంది. అందుకే చిత్తూరు జిల్లా పుత్తూరులో విరిగిన ఎముకలకు పిండి కట్లు వేసే ‘పుత్తూరు రాజులు’ అనే సంప్రదాయ వైద్యులు తాము కట్లకు వాడే పదార్థాలలో ఎర్ర తురాయి పూలు, కోడిగుడ్లలోని తెల్లసొన కూడా కలిపి వాడతారట. తురాయి వృక్షాలలో పసుపు పచ్చటి పూలుపూసే రకం కూడా ఒకటి ఉంది. దాని శాస్త్రీయ నామం Delonix regia var. flavida. అయితే చిటికేశ్వరము లేక వాతనారాయణము లేక సుంకేశుల అనే పేర్లతో పిలువబడే తెల్ల తురాయి (Delonix elata) అనే ఇదే జాతి వృక్షం కూడా ఒకటి ఉంది. దీని ఆకుల రసం కీళ్లసవాయి, కడుపు ఉబ్బరం మొదలైన వ్యాధులకు పనిచేస్తుంది. పూచినప్పుడు తెల్లగా ఉండే చిటికేశ్వరము చెట్టు పూలు మరుసటి రోజుకు లేత పసుపువన్నెకు మారిపోతాయి.
అస్సామ్ లోని కాజీరంగా, కామరూప్ జిల్లా సువాల్ కూచి ప్రాంతాలలో నేను తీసిన విరబూసిన తురాయి వృక్షాల ఫోటోలను కొన్నింటిని ఈ టపాకు జతపరచాను.
— మీ.. రవీంద్రనాథ్.