ఉలవకట్టు ఇంటిపేరు ఇలా ….
తెనాలికి సమీపంలోని దుగ్గిరాల పరిసర గ్రామం కంఠంరాజు కొండూరుకు చెందిన మిత్రులు శాయికృష్ణ తమ ఇంటిపేరు ఉలవకట్టు అనీ, ఈ ఇంటిపేరు కలిగిన వారు ఆ గ్రామంలో తప్ప వేరెక్కడా లేరనీ, అదీ ఆ ఇంటి పేరు నాలుగు తరాలకు ముందు అసలు ఎక్కడా లేదనీ చెపుతూ వాళ్ళ ఇంటిపేరు గురించి నన్ను పరిశోధించి చెప్పమని కోరారు. ఈ విషయమై నా అభిప్రాయం తెలుపుతాను.
కంఠంరాజు కొండూరు, కంఠంనేని గూడెం వంటి గ్రామనామాల మూలరూపం కమఠం రాజు కొండూరు, కమఠం నాయని గూడెం అని గ్రహించాలి. కమఠం అంటే తాబేలు ( కూర్మం). మూలంలో కూర్మారాధక జైనులైన నేటి కమ్మవారిలోనే ఇలా కూర్మ రాజు, కమఠం నాయుడు వంటి పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. కమఠం రాజు అన్నా కూర్మరాజు అన్నా ఒకటే. కూర్మారాధక జైనులైన కమ్మవారి వలస గ్రామాలైన కూర్మమూరు పేరుగల గ్రామాలు కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలో ఒకటి( అది నేడు కుమ్మమూరుగా పిలువబడుతున్నది) దుగ్గిరాల సమీపంలో మరొకటి ( ఈ నిర్జన గ్రామాన్ని నేడు కొమ్మమూరు అంటున్నారు). జైన తీర్థంకరులలో రెండవవాడైన భగవాన్ బాహుబలి ( గోమఠేశ్వరుడి) ని ఇంద్ర, కూర్మ అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ కూర్మనాథునే కూర్మరాజు, కమఠం రాజు, కమఠేశ్వరుడు ( కమ్మటేశ్వరుడు) అనీ అంటారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉన్న కమ్మటేశ్వరుడి ఆలయం శివాలయంగామార్చబడిన ఒకనాటి జైన ఆలయం. కమఠంరాజు పేరిటఏర్పడిన గ్రామాన్నే నేడు కంఠంరాజు కొండూరు అంటున్నారు. పక్కనే ఉన్న పెనుమూలి లోనూ, కంఠంరాజు కొండూరు లోనూ తప్ప మా తెనాలి ప్రాంతంలో దాదాపుగా వేరెక్కడా కనిపించని కొన్ని ఇండ్లపేర్లు అక్కడ కనిపిస్తాయి. అక్కినేని, ఉలవకట్టు, గూడపాటి, సోమవరపు వంటి ఇండ్లపేర్లు తెనాలి ప్రాంతంలో దాదాపుగా వేరెక్కడా వినపడవు. ఈ రెండు గ్రామాల వారూ కృష్ణా జిల్లా నుంచి రెండు శతాబ్దాల క్రితం వలసవచ్చారంటారు పెద్దలు. ఇది నిజమే కావచ్చు. దీనికి ఉలవకట్టు అనే ఇంటిపేరు ను కూడా నేను ఒక ఆధారంగా భావిస్తున్నాను.
కందిపప్పు ఉడికించి ఒంచి తీసిన నీటితో కాచిన పప్పు నీళ్ళ చారును కందికట్టు అనీ, పెసర పప్పు నీళ్ళ చారును
పెసరకట్టు అనీ అన్నట్లే ఉలవలు ఉడికించిన నీళ్ళతో కాచిన చారును ఉలవకట్టు అంటారు. కృష్ణా జిల్లా అనాదిగా ఉలవచారు తయారీకి, వినియోగానికి ప్రసిద్ధి. మా గుంటూరోళ్ళకి ఇరవై పాతికేళ్లకు పూర్వం ఉలవచారు వాడకం పెద్దగా తెలియదు. కాని కృష్ణా జిల్లాలో భోజనాలలో అనాదిగా ఉలవకట్టు ఒక అభిమానపాత్రమైన అంశం. పప్పు, పచ్చి పులుసు వంటి ఇండ్లపేర్ల లాగానే ఉలవచారు మీదగా ఉలవకట్టు అనే ఇంటిపేరు ఏర్పడింది. కంఠంరాజు కొండూరు గ్రామానికి అలా కృష్ణా జిల్లా నుంచి వలస వచ్చినవారిలో ఉలవకట్టు ఇంటిపేరు కలిగిన వారు కూడా కొందరు ఉండటం సహజమే. ఆ ఇంటి పేరు కలిగినవారు చాలా కొద్ది మందే ఉన్నారు కనుక గతంలో వీరి ఇంటిపేరు వేరే అయివుంటుంది. ఉలవకట్టు కాయటంలో నైపుణ్యమున్న కారణంగానో లేక ఉలవకట్టు అంటే అతి ఇష్టమున్న కారణంగానో ప్రత్యేకించి కొన్ని కుటుంబాలకు
ఆ ఇంటిపేరు వచ్చి ఉంటుంది. వారి గోత్రాన్నిబట్టి వారి ఇంటిపేరు గతంలో ఏమై ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు.
— మీ..రవీంద్రనాథ్.