Breaking News

ఓటర్స్ లిస్ట్ భాగోతం

ఓటర్స్ లిస్ట్ భాగోతం

ఈ రోజు ఉదయం వార్తాపత్రికలలో ఓటర్ల నమోదు విషయమై వచ్చిన వార్త కొంచెం కలవరపాటు కలిగించింది. తక్షణం ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి. లేకపోతే తిరిగి నమోదు చేసుకోడానికి నాలుగురోజులే గడువుంది. ఈ నెల 15 వ తేదీ తరవాత ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ బంద్ అవుతుంది. ఈ నాలుగు రోజులూ కూడా ప్రతిరోజూ మీ ఓటు జాబితాలో ఉందో లేదో కూడా చెక్ చేసుకునే బాధ్యత మీదే. పోలింగు రోజున మీరు ఓటు వేయాలంటే మీ జేబులో ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే సరిపోదు.అధీకృత జాబితాలో మీ పేరు కూడా ఉండటం అవసరం. – ఇదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ గోపాలకృష్ణ ద్వివేదీ ప్రకటన సారాంశం.

వెంటనే నేను ఆ ప్రకటనలో విచారణకోసం ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ 1950 కి పలుమార్లు ఫోన్ చేశాను. ఎన్నిసార్లు చేసినా బిజీ . బిజీ అనే వస్తూ ఉండడంతో .విసుగుపుట్టి కంప్యూటర్ ఓపెన్ చేసి నేషనల్ ఓటర్ సర్వీసెస్ పోర్టల్ లోని ఎలెక్టోరల్ సెర్చ్ పేజీ తెరచి అందులో నా ఓటర్ ఐడి నంబర్ కొట్టి చూశాను. దానిలో EPIC నంబర్ ఉపయోగించి మాత్రమే కాక పేరు, తండ్రి పేరు, వయస్సు, లింగం, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం పేరు వంటివి నమోదుచేసి వెదికే అవకాశం కూడా ఇవ్వబడింది.
అయితే ఐడి నంబర్ కానీ ఇతర వివరాలు కానీ అన్నీ సక్రమంగా నమోదు చేసినప్పటికీ కింద కోడ్ అని ఉన్న చోట Capcha Text అన్న ఫీల్డ్ లో అక్కడ కోడ్ లో ఉన్న అక్షరాలు సక్రమంగా టైప్ చేసి సెర్చ్ బటన్ మీద నొక్కినప్పటికీ ఏ వివరాలూ రావడం లేదు. ఒకవేళ సర్వర్లు బిజీగా ఉండడం కారణంగా ఇలా అవుతున్నదేమో తెలియటం లేదు. కొద్దిపాటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళకే పరిస్థితి ఇంత అగమ్యగోచరంగా ఉంటే, నిరక్షరాస్యులు, అక్షరజ్ఞానం ఉండి కూడా తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేని ఇతర సామాన్య ప్రజల మాటేమిటి ? పది రోజుల క్రితం అంగన్ వాడీ కార్యకర్తలు మా ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసుకువెళ్లారు. వారి వద్ద ఉన్న అధీకృత జాబితాలో నా పేరు, నా శ్రీమతి రాజ్యలక్ష్మి పేరూ రెండూ సురక్షితంగా ఉన్నాయి. అయినా ఈరోజు పేపర్ లో వచ్చిన ప్రకటన చూశాక లిస్ట్ లో మన పేర్లు ఉన్నాయో లేదో ఈ నాలుగురోజులపాటు ప్రతిరోజూ సరిచూసుకునే బాధ్యత మనదే అని చదివిన తర్వాత నాలో ఆందోళన మరీ ఎక్కువైంది. మన ఓటు ఉంటుందా ఊడిపోతుందా అని ఓటర్లు ఆందోళన చెందడం స్వతంత్ర భారతదేశంలో మునుపెన్నడూ లేదు. మనకు తెలియకుండానే జాబితాలో నుంచి మన ఓటు ఎలా తొలగిస్తారు ? మన అభ్యంతరాలు రాతపూర్వకంగా ఒక నోటీసు ద్వారా ఇచ్చి, మన నుంచి రాతపూర్వక వివరణ పొందకుండా జాబితాలో ఉన్న పేర్లు తొలగించే అవకాశం ఉందా ? ఈ ఆధునిక సాంకేతిక యుగంలో ఏదైనా సాధ్యమేననే మాట నిజమేనా ? కాసేపట్లో మండల రెవిన్యూ కార్యాలయానికి వెళ్లి జాబితా సరిచూసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సరిగ్గా ఎన్నికలకు ముందు లక్షలాది ఓట్లు తొలగించగా
జనం పోలింగ్ రోజున అసంఖ్యకంగా బూత్ ల నుంచి తమ ఓట్లు గల్లంతు అయ్యాయని నిరాశగా వెనుదిరిగారు. కొందరు నిరసనలు చేపట్టారు. ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి జరిగినదానికి అందరికీ సారీ చెప్పి, ముందుగా జాబితా చూసుకోకపోవడం ఓటర్ల తప్పేనని ముక్తాయించడం విశేషం. ఓటరు గుర్తింపు కార్డునైతే భద్రంగా దాచుకోగలం. పోలింగు రోజున వెళ్లి ఓటు వేయగలం. ఇలా లిస్ట్ లోనుంచి మన ప్రమేయం లేకుండా పేర్లు తీసేస్తుంటే ఎప్పటికప్పుడు చూసుకుంటూ తిరిగి నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా ? మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యులు శ్రీ యడ్లపాటి వెంకట్రావు గారి ఓటు జాబితాలో లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి నిన్న ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఇక మీదట అభ్యర్థులు తమకు అనుకూలంగా దొంగ ఓట్లు నమోదు చేయించడం, తమకు ఓటు వేయరనే అనుమానం ఉన్న ఇతరుల ఓట్లు ముందుగానే తొలగించడం, పోలింగ్ రోజున తమవారి ఓట్లన్నీ భద్రంగా పోల్ చేయించుకోవడం మీదనే శ్రద్ధ పెడతారన్నమాట. ఇక ఎన్నికల వాగ్దానాలు, మానిఫెస్టోలు, ప్రచార ఆర్భాటాల మీద ఖర్చెందుకు ? శుద్ధ దండగ అనుకుంటారేమో వారు ! కాగలకార్యం గంధర్వులే తీర్చినట్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమే అంతా చేసేస్తుంటే ఇంకా ఈ ఎన్నికల హంగామా అంతా దేనికి ? మన ఓటు ఎప్పటిదాకా ఉంటుందో ? ఎప్పుడు ఊడుతుందో తెలియని అధునాతన, సాంకేతిక ప్రజాస్వామ్య యుగంలో మనమంతా ఉన్నందుకు మరి నవ్వాలో, ఏడవాలో నాకైతే అర్థం కావడంలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు ఓటర్ల పేర్లను తొలగించమని ఎక్కడో బిహార్ లో కూర్చుని ఎలక్ట్రానిక్ దరఖాస్తులు పెడుతున్నారంటే మనం ఏ దిశగా పురోగమిస్తున్నామనే అనుమానం కలుగుతున్నది. తెలంగాణ సరిహద్దు గ్రామాలలో తెలంగాణకు చెందిన ఓటర్లు పెద్దసంఖ్యలో నమోదు అవుతున్నారని, సరైన నివాస ఆధారాలు లేని వారిని తొలగిస్తున్నా మళ్ళీ మళ్ళీ కొత్త దరఖాస్తులు వస్తున్నాయనీ అధికారులు ప్రకటించడం కూడా ఆందోళన కలిగిస్తున్నది. ఎలాగైనా నెగ్గాలనుకునేవారు ఏమిచేసేందుకైనా వెనుకాడరేమో ?
ఇక త్వరగా ముగించి రెవిన్యూ కార్యాలయానికి వెళ్లి ఓటరు జాబితాలో మా పేర్లు ఉన్నాయో లేవో చూసుకుంటేనే గానీ నాకు ఇప్పటి ఈ ఆందోళన తగ్గదు. మేము ఒక వివాహ కార్యక్రమంకోసం ఈరోజు విశాఖ వెళుతున్నాం. నేటి నుంచి నాలుగురోజులపాటు ఇంట్లో ఉండము కనుక ఎవరైనా తనిఖీకి వస్తే మేము విశాఖలో ఉన్నామనీ, మా ఓటరు గుర్తింపు కార్డులు వారికి చూపి, నా ఫోన్ నంబర్ కి ఫోన్ చేయించమని మా ఇంట్లో కింద అద్దెకున్నవాళ్ళకి ఇచ్చి వెళదామనుకుంటున్నా. ఇక అంతకుమించి చేయగలిగిందేమీ లేదు.

— మీ..రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *