ఈ ఫోటోలో కనిపించే తోకలేని కోతిని గిబ్బన్ ( Gibbon) అంటారు. ఇవి ఈశాన్య భారత దేశం, తూర్పు బాంగ్లాదేశ్, దక్షిణ చైనా, ఇండోనేషియా, సుమత్రా, జావా, బోర్నియో లోని అడవులలో నివసిస్తాయి. హైలోబాటిడే ( Hylobatidae) కుటుంబానికి చెందిన ఈ గిబ్బన్ లలో 4 ప్రజాతులు, 18 జాతులు ఉన్నాయి. కొమ్మలనుంచి చేతులతో ఊగుతూ వేళ్ళాడటం ( Brachiation) గిబ్బన్ ల ప్రత్యేక లక్షణం.
అలా ఊగుతూ ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదికి గిబ్బన్స్ అవలీలగా 50 అడుగుల దూరం వరకు కూడా ఒకే ఉదుటున ( Big Leap) దూకగలవు. ఎగరలేని స్తన్యదాల( Non- flying Mammals) లో గిబ్బన్స్ అత్యంత వేగవంతమైనవి. గిబ్బన్స్ లో పేర్కొన దగినవి – Siamang, Lar, White cheeked, White handed, Black crested, Hoolock గిబ్బన్లు. సాధారణంగా గిబ్బన్లు 6 నుంచి 12 కేజీల వరకూ బరువుంటాయి. జీవ పరిణామ క్రమంలో కోతులనుంచి తోకలేని కోతులు ( Apes) విడివడినప్పుడు ముందుగా గిబ్బన్లు రూపొందాయి. అందుకే వీటిని సాంకేతికంగా Lesser Apes లేక Small Apes అంటారు. తోకలేని కోతుల సముదాయానికి చెందిన చింపాంజీలు, ఒరాంగుటాన్ లు, గొరిల్లాలు, మానవులలో పరిమాణంలో ఇవే అత్యంత చిన్నవి. వీటి చర్మం మీది బొచ్చు ముదురు గోధుమవన్నె నుంచి లేత గోధుమవన్నె వరకు, నలుపు నుంచి తెలుపు వరకు పలు వన్నెలలో ఉంటుంది. అయితే పూర్తిగా తెల్లటి గిబ్బన్లు చాలా అరుదైనవి. గిబ్బన్స్ మనుషులతో చాలా కలుపుగోలుగా వ్యవహరిస్తాయి. వీటికి స్థానీయత చాలాఎక్కువ. దట్టమైన అడవులలో మగ, ఆడ గిబ్బన్ లు తమ ప్రాభవ పరిధిని నిర్ణయించుకుని, తమ తమ హద్దులలోనే జీవిస్తాయి. దాదాపుగా ఒక జంట జీవితాంతం కలిసే ఉంటాయి. చాలా అరుదుగా అవి తమ జీవిత భాగస్వామిని మారుస్తాయి. ఆడ, మగ గిబ్బన్ లు తమ భాగస్వామిని ఆకర్షించటం కోసం ఎలుగెత్తి పాడతాయి. ఆగ్నేయాసియాలోని దట్టమైన అడవులు ప్రతి ఉదయం గిబ్బన్ జంటల విరహ గీతాలతో మార్మోగిపోతుంటాయి. పొద్దెక్కే కొద్దీ అక్కడి అడవులమీది గాలి పొరలు సూర్యరశ్మికి వేడెక్కుతాయి.ఆ వేడి గాలిపొరలు గిబ్బన్స్ అరుపులకు సంబంధించిన శబ్ద తరంగాలను కిందికే తిప్పికొడతాయి. ఆ కారణంగాఆ అడవులలో పాటలవంటి వీటి అరుపులు 3 కిలో మీటర్ల వరకు కూడా స్పష్టంగా వినపడతాయి. ఈ అరుపులతో అవి తమ అధికార పరిధిని ప్రకటిస్తాయి. తమ భాగస్వామి ఉనికిని గుర్తించి, అక్కడికి చేరుకోగలుగుతాయి. 60 శాతం గిబ్బన్లు పళ్ళు తిని జీవిస్తాయి. చెట్ల ఆకులు, చిగుళ్లు, పూలు, క్రిమి కీటకాలను అవి తింటాయి. అరుదుగా అవి పక్షుల గుడ్లు కూడా తింటాయి. వీటిలో చాలా జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. కోతులు, కొండముచ్చులలాగా ఇవి మానవుల ఆహారాలను ధ్వంసం చేయవు. గిబ్బన్స్ చైనాలోని అడవులలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ప్రాచీన చైనీస్ సాహిత్యంలో గిబ్బన్ జూంజీ ( Junzi) అనే పేరుతో ప్రస్తావించబడింది.ఆ చైనీస్ పదానికి అర్థం ‘ బుద్ధిమంతుడైన పెద్ద మనిషి ‘ అని. మానవులతో మైత్రీపూర్వకంగా ఉండటం, మానవులు తినే ఆహారాలను ధ్వంసం చేయకపోవటం వంటి సుగుణాలు కలిగిన గిబ్బన్ ను అందుకే చైనీయులు అడవులలోని పెద్దమనిషి ( Gentleman of the Forest) అంటుంటారు. ఇదండీ అటవీ జంతువులలో
మర్యాదరామన్న అనదగిన ‘గిబ్బన్న’ కథ.
— మీ.. ముత్తేవి రవీంద్రనాథ్