Breaking News

డ్రాగన్ ఫ్రూట్ కథ

డ్రాగన్ ఫ్రూట్ కథ

70453362_3023180807752630_590495812073553920_n 71086304_3023172761086768_2436834568234336256_n 71446662_3023172604420117_4006927444597538816_n 71890793_3023179437752767_7271752594203082752_n
రెండు వారాల క్రితం తెనాలి మోర్ సూపర్ మార్కెట్ లో నాకోసం రాజ్యలక్ష్మి ఒక డ్రాగన్ ఫ్రూట్ కొనుక్కొచ్చింది. ఒక్క పండు ఖరీదు 70 రూపాయలు. అమెరికాలో రెండు పౌండ్ల బరువుండే పెద్ద డ్రాగన్ ఫ్రూట్ ఖరీదు 12 డాలర్ల వరకూ (అంటే మన కరెన్సీలో సుమారు 960 రూపాయల వరకూ) ఉంటుంది. అతి ఖరీదైన పళ్లలో ఇదొకటి. నేను పనామా దేశంలోని ఒక హోటల్ లో ఉదయపు అల్పాహారంలో భాగంగా పలు ఇతర పళ్లతో పాటు మొదటిసారిగా డ్రాగన్ ఫ్రూట్ రుచి చూశాను. పెద్ద రుచికరమైన పండేమీ కాదు. అలాగే కొనుక్కెళ్లటానికి, తినటానికి మధ్య గాప్ ఎక్కువగా ఉండే పళ్లలో ఇదొకటట. ఎలా ఉంటుందో చూద్దామని కొనుక్కెళ్లినా ఎవరూ దీనిని తొందరగా కోసి తినకపోవడానికి కారణం దీని రుచి, ప్రయోజనాల పట్ల జనాలకి ఇంకా పెద్దగా నమ్మకం ఏర్పడకపోవడమే కావచ్చు. నా పరిస్థితీ అదే అయింది. రెండువారాల క్రితం రాజ్యలక్ష్మి ఎంతో ప్రేమగా నాకోసం ఈ పండు కొనుక్కొచ్చినా, నాకు కూడా దానినసలు కోసి తిందామనే అనిపించక ఇన్నాళ్లూ అలా ఫ్రిజ్ లోనే ఉంచేశాను. ఇవాళ్టి ఉదయపు అల్పాహారంలో భాగంగా ఆ పండు కోసి తినటం జరిగింది. మళ్ళీ వెనకటి అనుభూతే. నాకైతే ఏమీ నచ్చలేదు. అసలే తీపంటే నాలిక కోసుకునేవాడిని నేను. ఇదేమో రవ్వ తీపిగా ఉండే పండు. ఎలా నచ్ఛుతుంది మరి ? పై పెచ్చు లోపల తెల్లటి గుజ్జులో నల్లగా సబ్జా గింజల పరిమాణంలో ఉండే అసంఖ్యాకమైన కరకరలాడే గింజలు తినేటప్పుడు అదోరకంగా అనిపిస్తాయి. తగినంత తియ్యగా ఉండవనే నాకు పేర్స్ (Pears), స్ట్రాబెర్రీస్ ( Strawberries) వంటి పళ్లంటే కూడా అంతగా ఇష్టం ఉండదు.
పిటాహాయా ( Pitahaya) అనే పేరుతో కూడా వ్యవహరించే ఈ డ్రాగన్ ఫ్రూట్ (Dragon Fruit) తొట్టతొలి జన్మస్థలం మధ్య అమెరికా దేశమైన మెక్సికో. మెక్సికన్ భాషలో ఈ పండును పిటాహాయా అంటారు. అక్కడే లభించే పుల్లటి గుజ్జు కలిగిన పిటాయా (Pitaya) అనే వేరొక పండ్ల రకమూ ఉంది. ప్రస్తుతం ఈ పండ్ల సాగు మెక్సికో లో, మధ్య అమెరికా దేశాలు, కరీబియన్ దీవులలో మాత్రమే కాక ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలలోని దాదాపు అన్ని ప్రాంతాలలో చేయబడుతున్నది. కొన్ని ప్రాంతాలలో ఈ పండును థాంగ్ ( Thang) అనీ, స్ట్రా బెర్రీ పేర్ (Strawberry Pear ) అనీ కూడా పిలుస్తారు. ఇప్పుడీ పండ్లు ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడుతున్నాయి. మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలలోనూ ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తున్నారు. మన నాగజెముడు, బ్రహ్మజెముడు ముళ్ల పొదల లాగే కాక్టేసీ ( Cactaceae) కుటుంబానికి చెందిన ముండ్ల పొదమొక్క పండ్లే ఇవి. పుల్లటి పండ్ల పిటాయా మొక్క శాస్త్రీయ నామం Stenocereus gummosus. కాగా ఈ తియ్యటి పిటాహాయా లేక డ్రాగన్ ఫ్రూట్ మొక్కలలో మూడు ఉపజాతులు
( species) ఉన్నాయి. వీటిని పండు పైని తోలు, పండు లోపలి గుజ్జు ఏ రంగులో ఉంటాయనే దానినిబట్టి ఇలా మూడు ఉపజాతులుగా విభజించారు. Hylocereus undatus ( లోపల గుజ్జు తెల్లగానూ, పై తోలు పింక్ రంగులోనూ ఉండే పండు. ఇది విస్తృతంగా లభించే సాధారణమైన డ్రాగన్ ఫ్రూట్), Hylocereus costaricensis ( ఎర్ర తోలు, ఎర్ర గుజ్జు కలిగిన పండు), Hylocereus megalanthus ( పసుపుపచ్చని తోలు, తెల్లటి గుజ్జు కలిగిన పండు). మనకు డ్రాగన్ ఫ్రూట్ పేరుతో విస్తారంగా లభించే పళ్ళు పైన తోలు ఎర్రగా, లోపలి గుజ్జు తెల్లగా ఉండేవి. వీటి శాస్త్రీయనామం హైలోసెరియస్ అన్ డేటస్ (Hylocereus undatus). హైలోసెరియస్ అనేది డ్రాగన్ ఫ్రూట్ కాక్టస్ మొక్క పేరు కాగా, ఆ ముండ్ల మొక్క ఆకులు అలలలాగా ఉండే కారణంగా ఆ మొక్కకు undatus ( Wavy ) అనే పేరు వచ్చింది.

ఈ డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ సి, విటమిన్ బి3 పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, మెగ్నీషియం కూడా చాలా ఎక్కువ. యాంటి – ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ పండ్లలో పీచు పదార్థమూ చాలా ఎక్కువైన కారణంగా, అది కూడా Dietary Fibre అయిన కారణంగా ఇది సహజసిద్ధమైన విరేచనకారిగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ పండ్లు శరీరం బరువును గణనీయంగా తగ్గిస్తాయి. ఆరోగ్యపరంగా ఇన్ని ప్రయోజనాలు కలిగిన పండ్లు కనుకనే వీటికి ఇంత డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ పళ్ళు బద్ధకాన్ని పెంచుతాయట. వీటితో తయారుచేసిన స్మూతీలు తాగితే ” లేజీ జా సిండ్రం” ( Lazy Jaw Syndrome) వచ్చే అవకాశం కూడా ఉందట.

మనం లోగడ చెప్పుకున్న సాగువారో కాక్టస్ (Saguaro cactus – Carnegiea gigantea) ఎక్కువగా ఉండే సోనోరన్ ఎడారి లోనే ఈ డ్రాగన్ ఫ్రూట్ కాక్టస్ మొక్కలు కూడా విస్తారంగా పెరుగుతాయి. ఈ సోనోరన్ ఎడారి అమెరికాలోని కాలిఫోర్నియా, అరిజోనా రాష్ట్రాలలోనూ, మెక్సికో దేశంలోనూ విస్తరించి ఉంది.

— మీ.. రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *