Breaking News

మనుస్మృతి దహనం – అంబేద్కర్

మనుస్మృతి దహనం – అంబేద్కర్

14650129_1155858224484907_441161868788674257_n

1927 డిసెంబర్ 25 వ తేదీన ముంబాయికి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న మహద్ అనే చిన్న పట్టణంలో డా. బి. ఆర్. అంబేద్కర్ ‘మనుస్మృతి’ గ్రంథాన్ని బహిరంగంగా తగులబెట్టారు. అప్పటినుంచీ దళితులు, అంబేద్కరైట్లు ఆ రోజును ‘మనుస్మృతి దహన్ దివస్’ (Manusmriti Burning Day) గా పాటిస్తూ ఏటా అదేరోజు ‘మనుస్మృతి’ ని తగులబెడుతూ వస్తున్నారు. బ్రాహ్మణీయ సంస్కృతికి మూలమైన మనువాదానికి వ్యతిరేకంగా అంబేద్కర్ నేతృత్వంలో మొదలైన దళిత ఉద్యమంలో ఈ ఘటనను ఒక మైలురాయిగా భావిస్తారు. నేలలో అరడుగు లోతు, నలువైపులా అడుగున్నర పొడవు ( అడుగున్నర చౌకం) ఉండే విధంగా గొయ్యి తీసి దానిని గంధపు చెక్క ముక్కలతో నింపి ‘మనుస్మృతి’ గ్రంథాన్ని దానిపై ఉంచి హిందువులు నిర్వహించే అంత్యేష్టి లాగే ఆ క్రతువును నిర్వహించడం జరిగింది. ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహించిన ఈ దహన కార్యక్రమాన్ని ఐదారుగురు బౌద్ధ సాధువులు పర్యవేక్షించారు. ఆరోజు ఆ ప్రదేశంలో ‘ఇదే మనుస్మృతి దహన భూమి’, ‘అంటరానితనాన్ని రూపుమాపండి’, ‘బ్రాహ్మణీయ సంస్కృతిని పాతిపెట్టండి’ వంటి నినాదాలతో ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు.

ఈ ఘటనకుగల నేపథ్యం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఇలా ‘మనుస్మృతి’ ని తగలబెట్టడానికి ముందు మహద్ లోని ఒక ఊర చెరువు నుంచి దళితులను తాగు నీరు తీసుకోకుండా అగ్రవర్ణ హిందువులు అడ్డుకోవడంతో ఆ పట్టణంలో 1927 మార్చి 20వ తేదీన అంబేద్కర్ నేతృత్వంలో ఒక గొప్ప సత్యాగ్రహం జరిగింది. అంతకుముందు ఆ పట్టణంలో హిందువులు నడిచే వీధులపైన అంటరానివారయిన కారణంగా దళితులు నడిచేందుకు కూడా వీల్లేదని అగ్రవర్ణాలవారు నిషేధం విధించారు. ఆ చిన్న పట్టణంలోని అగ్రవర్ణాలైన బ్రాహ్మణులు, వ్రాయసకారుల (Writers)లోని రెండు శాఖలైన కాయస్థ ప్రభువులు, పటానే ప్రభువులు తమ మధ్యగల పాత విభేదాలను విస్మరించి ఒక్కటై దళితులకు వ్యతిరేకంగా మరింత సంఘటితం అయ్యారు. ప్రభుత్వం నిర్మించి, నిర్వహించే అన్ని ప్రదేశాలకూ దళితులు నిరభ్యంతరంగా వెళ్లవచ్చునని, మునిసిపల్ రోడ్లపై అందరూ నడవ వచ్చుననీ, చెరువులోనుంచి నీరు తెచ్చుకోవచ్చుననీ అప్పటి బొంబాయి ప్రావిన్సు శాసన మండలి 1923 లో తీర్మానం చేసింది. ఆ తరువాత మహద్ మునిసిపల్ కౌన్సిల్ కూడా శాసన మండలి తరహాలో 1924 లో మరో తీర్మానం చేసింది. అయితే అక్కడి అగ్రవర్ణాల నిరసన కారణంగా ఈ తీర్మానాలేవీ అమలుకు నోచుకోలేదు. దీంతో అంబేద్కర్ ‘బహిష్కృత హితకారిణీ సభ’ పేరిట మొదటి అంటరానివారి మహాసభను 1927 మార్చి 19-20 తేదీలలో మహద్ లోనే నిర్వహించారు. వెయ్యి మందికి పైగా ప్రతినిధులు ఆ సభకు హాజరయ్యారు. సభానంతరం వారంతా ఊరేగింపుగా వెళ్లి అదే ఊర చెరువు నుంచి మంచినీటిని తాగారు. అదేరోజు అంబేద్కర్, ఆయన అనుచరులు అక్కడి హిందూ దేవాలయంలోకి ప్రవేశించనున్నారనే పుకార్లు వ్యాపించడంతో ఆ పట్టణంలో పెద్ద ఎత్తున దొమ్మీలు జరిగాయి. దళితులు ఆ చెరువు నుండి నీరు తీసుకుని తాగడంతో అది అపవిత్రమైపోయిందని భావించిన సవర్ణ హిందువులు చెరువు నీటిని శుభ్రపరిచి, ఆ చెరువుకు ప్రక్షాళన పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 1927 డిసెంబర్ 26-27 తేదీలలో మహద్ లో అంబేద్కర్ అంటరానివారి రెండవ మహాసభ జరపాలని నిశ్చయించారు. ఆ మహాసభ సందర్భంగా దళితులు సత్యాగ్రహం నిర్వహించి, సామూహికంగా తిరిగి ఆ చెరువు నీరు తాగే ప్రయత్నం చేస్తారని శంకించిన
సవర్ణ హిందువులు ఈసారి ఆ చెరువు అగ్రవర్ణాల వారి ప్రైవేటు ఆస్తి అనీ, అది ఊరుమ్మడి ఆస్తి కాదనీ, కనుక దానికి శాసన మండలి, మునిసిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానాలు వర్తించవని బొంబాయి హైకోర్టులో ముందుగానే ఒక పిటిషన్ వేశారు. ఇక అది న్యాయస్థానం పరిశీలనలోనున్న ఒక వివాదాస్పదమైన అంశమైనందున (sub judice) ఈ సారి దళితులు ఆ చెరువునుంచి మంచినీరు తాగడం ద్వారా కాక తమ సత్యాగ్రహాన్ని మరో విధంగా వ్యక్తీకరించాలని అంబేద్కర్ భావించారు. అప్పుడే ఆయనకు ‘మనుస్మృతి దహనం’ అనే ఆలోచన వచ్చింది. ఇందుకోసం ఆయన బొంబాయి నుంచి నేరుగా రోడ్డు మార్గాన కాక, సముద్రమార్గాన దశగాం పోర్ట్ మీదుగా పద్మావతి అనే బోటులో మహాసభ ముందురోజైన డిసెంబర్ 25 వ తేదీ సాయంత్రానికే మహద్ పట్టణానికి చేరుకోవడం జరిగింది. అమానవీయమైన అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న బ్రాహ్మణాధిక్య సమాజం పట్ల, బ్రాహ్మణీయ సంస్కృతికి మూలమైన మనువాదం పట్ల తనకు గల నిరసనభావాన్ని తెలిపేటందుకు అంబేద్కర్ ఈ ‘మనుస్మృతి దహన’ కార్యక్రమాన్ని కేవలం లాంఛనప్రాయం (symbolic)గానే చేపట్టినా అనంతరకాలంలో అది సమాజంలో దీర్ఘకాలిక విభేదాలకు, అక్కడి అగ్రవర్ణాల ప్రజలు అంబేద్కర్ ను, దళితులను మరింత తీవ్రంగా ద్వేషించడానికీ దారితీసింది. ఉదాహరణకు అంబేద్కర్ స్వరాష్ట్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోని మరాట్వాడా యూనివర్సిటీ పేరును అంబేద్కర్ యూనివర్సిటీగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం 1978 లోనే నిర్ణయం తీసుకున్నా, దానికి వ్యతిరేకంగా 16 సంవత్సరాలపాటు పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగి, పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమై, పలువురు ప్రాణాలు కోల్పోయాకమాత్రమే నామాంతరీకరణ 1994 లో కానీ సాకారం కాలేదు. ప్రస్తుతం ఆ యూనివర్సిటీ పేరు డా. బి. ఆర్. అంబేద్కర్ మరాట్వాడా విశ్వవిద్యాలయం. ఆయన స్వరాష్ట్రమైన మహారాష్ట్రలో అంబేద్కర్ జన్మదినం ఏప్రిల్ 14 సెలవు దినం కాకున్నా, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాల క్రితమే అంబేద్కర్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడమే కాక, హైదరాబాద్ లో నెలకొల్పిన దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని పేరు పెట్టి ఆ మహానేతను మనం గౌరవించుకున్నాం.

ఇక ఆ సంగతి అలా ఉంచి నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ఆ రోజున రాజ్యాంగ నిర్మాత బి. ఆర్. అంబేద్కర్ సేవలను ఆకాశానికెత్తే ప్రభుత్వ పెద్దలు డిసెంబర్ 25 వ తేదీన ‘మనుస్మృతి దహన్ దివస్’ ను కూడా పాటించి, దాని సందేశాన్ని అందరికీ వివరించాలని కొందరు అభ్యుదయవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సాటి మానవుడిని మానవుడిగా చూడని అమానవీయ సిద్ధాంతాలకు మూలమైన గ్రంథం కనుకనే అంబేద్కర్ దాని దహనానికి పూనుకున్నారనీ, ఆయన అనుయాయులు ఏటా అంకితభావంతో ఆ దినాన్ని పాటిస్తూ అంబేద్కర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారనీ అంబేద్కరైట్లు పేర్కొంటున్నారు. పురుషాధిక్య సమాజానికి మూలస్తంభం వంటి ‘మనుస్మృతి’ స్త్రీలకు అత్యంత అథమ స్థానాన్నిచ్చిందనీ, వారిని నమ్మదగని వ్యక్తులుగానూ, మోసపూరితమైనవారిగానూ, పురుషులను చెడగొట్టేవారిగానూ చిత్రించిన ‘మనుస్మృతి’ ని స్త్రీలు చదివితే తప్పక ఏవగించుకు తీరతారనీ, అందుకే ‘మనుస్మృతి’ దహనం సమర్థనీయమైనదేనని వారు వాదిస్తారు. అలాగే వ్యక్తిగతంగా తమకు బ్రాహ్మణుల మీద ఎలాంటి వ్యతిరేకతా లేకున్నా, వర్ణ వివక్షకు, అంటరాని తనానికీ మూలమైన బ్రాహ్మణీయ సంస్కృతిని మాత్రం తాము ద్వేషించకుండా ఉండలేమనీ వారు పేర్కొంటున్నారు.

ఇక చివరిగా ‘మనుస్మృతి’ ఎంత దారుణమైన నియమాలను సమాజంపై రుద్దిన గ్రంథం అయినప్పటికీ, దానిని చదవడం ద్వారానే కదా – ఆనాటి సమాజం ఎంతటి వివక్షాపూరితంగా ఉండేదనే విషయం మనం గ్రహించగలిగింది ? ఈనాడు ఆ యా అంశాలను విమర్శిస్తున్నదీనూ ? మనువాదం తలకెక్కించుకున్నవారి ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలిగానీ, ఏడాదికి ఒక ‘మనుస్మృతి’ ప్రతిని తగులబెట్టినంతమాత్రాన ఒరిగేదేమీ ఉండదని నా అభిప్రాయం. పైపెచ్చు ఈనాటి సమాజానికి పనికిరాని, హానికరమైన ఎన్నో విషయాలు ‘మనుస్మృతి’ లో ఉన్నవనేది సత్యమే అయినా, అక్కడక్కడా నేటికి కూడా పనికొచ్చే కొన్ని ఆరోగ్య, ఆహార నియమాల వంటివీ దానిలో ఉన్నాయి. జోస్యులూ, మౌహూర్తికులూ, సాముద్రికులూ ఎలా ప్రజలను మోసం చేస్తూ ఉంటారో ఆనాడే మనువు తన గ్రంథం ద్వారా అందరినీ హెచ్చరించడం కూడా గమనార్హం. కనుక ఆ గ్రంథాన్ని ఆనాటి స్థితిగతులు తెలుసుకునే ఒక ఉపకరణంగానే మనం భావించాలి. గతితార్కిక దృష్టితో చూస్తే ప్రతి గ్రంథంలోనూ ఏవో కొన్ని పనికొచ్చే అంశాలు తప్పక ఉంటాయి. ఏదీ పూర్తిగా తిరస్కరించదగినది కాదు. పాతదంతా పనికొచ్చేది కాదు. అలాగని పాతదంతా చెత్తా కాదు. కొత్తదంతా గొప్పదీ కాదు. గతకాలానికి సంబంధించిన పనికొచ్చే అంశాలు ఏవైనా ఉంటే వాటిని స్వీకరిస్తూ, పనికిరానివి వదిలేస్తూ మనం ముందుకుసాగాల్సి ఉంటుంది. ఇక్కడ సంప్రదాయవాదులు కూడా ఆలోచించాల్సిన విషయం మరొకటి ఉంది. ‘మను స్మృతి’ ని ఏకమొత్తంగా ఉన్నదున్నట్లు వెనకేసుకొచ్చే ప్రయత్నం ఎవరు చేసినా అది అర్థరహితమేనని వారు గ్రహించాలి. వారి నమ్మకం ప్రకారమే మనుస్మృతి ఎప్పుడో కృతయుగానికి సంబంధించిన నియమావళి. సంప్రదాయవాదుల విశ్వాసం ప్రకారం చూసినా కలియుగంలో వర్తించేది ‘పరాశర స్మృతి’ కానీ ‘మనుస్మృతి’ కాదు. ‘పరాశరస్మృతి’ మొదటి అధ్యాయంలోనే కృతయుగానికి తగినది ‘మనుస్మృతి’ అనీ, త్రేతాయుగానికి ‘గౌతమ స్మృతి’ అనీ, ద్వాపరయుగానికి ‘శంఖ లిఖిత స్మృతి’ అనీ, కలియుగానికి ‘పరాశర స్మృతి’ వర్తిస్తుందనీ పేర్కొనబడిందని గమనించగోరతాను. (‘పరాశర స్మృతి’ 1-24).

‘మనుస్మృతి’ ని తగులబెట్టడం అన్నప్పుడు నాకొక విషయం గుర్తుకొస్తున్నది. తెలుగు నేలపై క్రీస్తుకు పూర్వం నుంచే బౌద్ధం విలసిల్లింది. ప్రత్యేకించి పల్లవ భోగ్య ( గుంటూరు జిల్లాలోని పలనాడు ప్రాంతం) బౌద్ధానికి పట్టుగొమ్మ. బౌద్ధులు స్థానిక ప్రజల భాషలలోనే ధర్మ ప్రచారం కావించినందున తప్పనిసరిగా తెలుగులో ప్రాచీన బౌద్ధ గ్రంథాలు ఉండే ఉండాలి. అయితే ఈనాడు అవి ఒక్కటీ లభ్యం కావడం లేదు. బహుశా అవన్నీ తెలుగు నేలపై బౌద్ధం వెనుకపట్టు పట్టాక మతేతరులచేత ధ్వంసం చేయబడి ఉంటాయని చరిత్రకారుల భావన. తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించుకునే క్రమంలో ప్రాచీనతకు ఆధారాలు చూపాల్సిన సందర్భంలో ప్రాచీన తెలుగు సాహిత్య ఆధారాలు లభించని లోటు భాషాభిమానులనూ, భాషోద్యమకారులనూ తీవ్రంగా బాధించింది. కాబట్టి సాహిత్యాన్ని తగులబెట్టడం ఎవరు ఏ ఉద్దేశంతో చేసినా సమర్థనీయం మాత్రం కాదు. మనువాదాన్ని ఎండగడదాం. వివక్షాపూరిత సమాజాన్ని ద్వేషిద్దాం. మన ఆధునిక సమాజంలోని అన్నిరకాల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడదాం. అంబేద్కర్ కి అదే మనమిచ్చే నిజమైన నివాళి.
— మీ.. రవీంద్రనాథ్.

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *