Breaking News

వృక్షాల జిగుర్లు

వృక్షాల జిగుర్లు
 
ప్రకృతిసిద్ధమైన జిగుర్లు వృక్షాల లోని జీవ కణజాలం (Tissues) – ముఖ్యంగా ఆ కణాలలోని సెల్యూలోజ్( Cellulose) అనే పదార్ధం –యొక్క విచ్ఛిన్నం కారణంగా తయారౌతాయి. ఇలా కొన్ని వృక్షాలనుండి జిగుర్లు తయారయ్యే ప్రక్రియను గమ్మోసిస్ ( Gummosis) అంటారు. రసాయనికంగా చూస్తే ఈ జిగుర్లు అన్నీ గాలాక్టోజ్ ( Galactose), గ్జైలోజ్ ( Xylose), అరబినోజ్ ( Arabinose) వంటి చక్కెరల యాసిడ్ సాల్ట్స్ నుంచి ఉద్భవించిన పాలీ శాఖరైడ్స్
( Polysaccharides).
జిగురు అణువులలో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అయాన్ల కారణంగా అవి నీటి అణువులతో తేలిగ్గా జతకడతాయి. జిగుర్లు నీటిలో పూర్తిగా కరగటమో లేక నీటిని పీల్చుకుని ఉబ్బటమో జరిగేది అందుకే. అయితే ఈ జిగుర్లు ఆల్కహాల్ లోనూ, ఈథర్ లోనూ మాత్రం కరగవు.
వృక్షాల కాండాల నుంచి జిగుర్లు సహజంగా స్రవించడం జరుగుతుంది. అలాగే మనం వృక్షాల కాండాలను గాయపరచినప్పుడు ఆ చర్యలకు ప్రతిస్పందనగా వృక్షాలు ఆ గాయాల నుంచి జిగురులను స్రవిస్తాయి. సాధారణంగా ఉష్ణ ప్రాంతాలలోని బెట్ట నేలలలో పెరిగే కొన్ని జాతుల వృక్షాలు ఇలా జిగురులను స్రవిస్తాయి.
ప్రస్తుతం సెల్యులోజ్ ఆధారంగా కృత్రిమ సంశ్లేషిత జిగురుల
( Synthetic Gums ) ను వ్యాపార సరళిలోనూ ఉత్పత్తి చేస్తున్నారు.
ఈ జిగుర్లు ఎడ్ హెసివ్స్ తయారీలో, వస్త్రాల అద్దకం, ఫినిషింగ్ ప్రక్రియలో, పేపర్, పెయింట్స్ తయారీలో, చాకొలెట్స్, స్వీట్స్ తయారీలో వాడతారు. ఇక ఆహార పరిశ్రమలో సాస్ లు, సిరప్ లు, ఐస్ క్రీములు, సాఫ్ట్ డ్రింక్స్ తయారీలోనూ వీటిని ఉపయోగిస్తారు. ఔషధ పరిశ్రమలో మందుల పొడులను టాబ్లెట్స్ గా రూపొందించడంలోనూ, ఔషధ ద్రవాలను తయారు చేయడంలోనూ జిగుర్లు ఉపయోగిస్తారు. కొన్ని రకాల జిగుర్లు సుఖ విరేచనకారి ఔషధాలు
(Laxatives) గానూ, టూత్ పేస్ట్ ల తయారీలోనూ, పెట్రోలియం తవ్వకాలలోనూ ఉపయోగిస్తున్నారు.
వాణిజ్యపరంగా మూడు ముఖ్యమైన జిగుర్లు మనం ఉపయోగిస్తాం. అవి తుమ్మ జిగురు ( Arabic Gum or Gum Arabic ), Gum Tragacanth మరియు కరాయా గమ్ ( Karaya Gum).
గమ్ అరబిక్ జిగురు
తుమ్మ జాతికి చెందిన నల్ల తుమ్మ చెట్టు నుంచి స్రవించే తుమ్మ జిగురు మనందరికీ తెలిసినదే. ఈ వృక్షాన్ని శాస్త్రీయంగా Aacia nilotica లేక Acacia arabica మొదలైన పేర్లతో పిలుస్తారు. అయితే ఇదే తుమ్మ జాతికి చెందిన Acacia senegal అనే శాస్త్రీయ నామం కలిగిన, మైమోజేసీ (Mimosaceae) కుటుంబానికే చెందిన మరో తుమ్మ మొక్కకు స్రవించే జిగురు వాణిజ్యపరంగా ఎంతో విలువైనది. దానినే గమ్ అరబిక్ అంటారు. ఉత్తర ఆఫ్రికాలోని అత్యుష్ణ ప్రాంతాలలో ప్రత్యేకించి సూడాన్ దేశంలో ఈ వృక్షాలు విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలోని పంజాబ్, హరియాణా, రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతాలలోనూ ఈ వృక్షాలు పెరుగుతాయి. స్థానికంగా ప్రజలు ఈ వృక్షాలను ఖేర్, ఖోర్, కుమ్మత్ అని పలు పేర్లతో పిలుస్తారు. ఫిబ్రవరి – మే మాసాల మధ్యలో ఆ వృక్షాల కాయలు పక్వానికి వచ్చే సమయంలో వాటి కాండంపై గాట్లు పెట్టి, వాటినుంచి ఉద్గారంగా స్రవించే జిగురును సేకరిస్తారు. క్రీ. పూ. 2000 సంవత్సరం ప్రాంతాలనుండి ఈజిప్షియన్లు గమ్ అరబిక్ ను ఉపయోగించినట్లు, సూడాన్ తదితర ఆఫ్రికన్ దేశాల నుంచి ఈ జిగురు అరేబియాకు, అక్కడి నుంచి అరబ్ వర్తకుల ఓడలలో యూరప్ కు రవాణా అయ్యేదనీ తెలుస్తున్నది. అందుకే యూరోపియన్లు ఈ జిగురును గమ్ అరబిక్ అన్నారు.
ట్రాగాకాంత్ జిగురు
పాపిలియనేసీ (Papilionaceae) కుటుంబానికి చెందిన యాస్ట్రగాలస్ గమ్మిఫర్ (Astragalus gummifer) అనే శాస్త్రీయనామం కలిగిన ముళ్ల పొద మొక్కల నుంచి సేకరించే జిగురును గమ్ ట్రాగాకాంత్ (Gum Tragacanth) అంటారు. ఈ మొక్కలు పశ్చిమాసియా ఎడారి ప్రాంతాలలో విస్తారంగా పెరుగుతాయి. మన భారతదేశంలోని పశ్చిమ ప్రాంతాలలో పెరిగే ఇదే కుటుంబానికి చెందిన వేరొక మొక్క యాస్ట్రగాలస్ ప్రాక్సిలస్ ( Astragalus proxilus) నుంచి కూడా ఈ జిగురును సేకరిస్తారు. క్రీ. పూ. మూడవ శతాబ్దం నుంచి ఈ జిగురు కూడా వాణిజ్యపరంగా ప్రసిద్ధి పొందింది. అరబిక్ గమ్ ను ఉపయోగించే అన్ని రంగాలలోనూ ఈ ట్రాగాకాంత్ గమ్ ని ఉపయోగిస్తారు. ఈ జిగురుకు ట్రాగాకాంత్ జిగురు అని పేరు రావటానికి ఒక కారణం ఉంది. గ్రీకు భాషలో ట్రాగోస్ ( Tragos ) అంటే మేక అనీ ఎకాంత( akantha) అంటే కొమ్ము అనీ అర్థాలు. ఈ మొక్క కాండం మీద పెట్టిన గాట్ల నుంచి స్రవించే జిగురు గట్టిపడి చూసేందుకు మేక కొమ్ములా ? అన్నట్లు ఉండే కారణంగా ఆ జిగురుకు ట్రాగాకాంత్ జిగురు అనే పేరు వచ్చింది.
కరాయా జిగురు
ఇటీవలి కాలంలో కరాయా జిగురుకు వాణిజ్యపరంగా ఎంతో పేరొచ్చింది. ట్రాగాకాంత్ జిగురుకు దీనిని ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. అమెరికా వంటి దేశాలు ఏటా వేల టన్నుల కరాయా జిగురును భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటాయి. మధ్య భారత దేశంలో ఎక్కువగా కనిపించే కవిలి లేక తపసి వృక్షం యొక్క తెల్లని కాండం మీద గాట్లు పెడితే వాటి నుంచి ఈ తెల్లటి జిగురు స్రవిస్తుంది. స్టెర్క్యూలియేసీ ( Sterculiaceae ) కుటుంబానికి చెందిన ఈ తపసి వృక్షం శాస్త్రీయ నామం స్టెర్క్యూలియా యూరెన్స్ ( Sterculia urens). హిందీలో ఈ వృక్షాన్ని గులార్ అంటారు. దీని జిగురును గమ్ కరాయా అనీ కడాయా అనీ కటీరా అనీ అంటారు. పై రెండు రకాల గమ్స్ కి ఉండే ఉపయోగితా విలువలన్నీ కరాయా గమ్ ( Gum Karaya) లోనూ ఉన్నాయి. మెత్తటి శుభ్రమైన ఈ జిగురును చాకొలెట్లు, చూయింగ్ గమ్స్ తయారీలో వినియోగిస్తారు. దీనికి ఔషధపరమైన విలువలూ ఉన్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర సుగంధ సోడా అమ్మే బండ్లలో కటీరా గమ్ ను ‘కఠోరా’ అనే పేరుతో శీతల పానీయాలలో కలుపుతారు. మనం కటీరా కలిపిన పానీయం తాగగానే మనకు కళ్ళు చల్లబడి ఒక చల్లటి అనుభూతి కలుగుతుంది.
కాంబ్రెటేసీ( Combretaceae ) కుటుంబానికి చెందిన ఘట్టి లేక సిరిమాను లేక చిరుమాను ( Anogeissus latifolia ) అనే పెద్ద వృక్షం కాండం నుంచి స్రవించే జిగురును గమ్ ఘట్టి (Gum Ghatti ) అంటారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
కీ. శే. డా. వై. యస్. రాజశేఖరరెడ్డి ప్రయాణించిన హెలికాఫ్టర్ కర్నూలు జిల్లా పావురాల గుట్ట దగ్గర ఒక పెద్ద సిరిమాను వృక్షాన్ని గుద్దుకునే పేలిపోయింది. పొడవుగా సాఫుగా పెరిగే ఈ సిరిమాను వృక్షాన్ని జాతరలలో సిడిమాను ( సిరిమాను ) గా ఉపయోగిస్తారు. ఇంకా బెంగాల్ కినో (Bengal Kino) పేరిట లభించే మోదుగ ( Butea monosperma) కాండం నుంచి స్రవించే జిగురు కూడా వాణిజ్యపరంగా ప్రయోజనకరమైనదే.
ఇదండీ వృక్షాలనుంచి మనకు లభించే కొన్ని ముఖ్యమైన జిగురుల కథ – కమామిషూ !!
— మీ.. రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *