Breaking News

కనకదుర్గమ్మ దేవాలయం – దేవి నవరాత్రులు

కనకదుర్గమ్మ దేవాలయం – విజయవాడ , ఆంధ్రప్రదేశ్

కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది.ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.

చరిత్ర :

కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపస్సు చేసి , ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.

స్థల పురాణం :

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.

🌼🌿నవరాత్రి ఉత్సవాలు :🌼🌿

ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసర నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసర నవరోత్సవల లో ప్రతి రోజు ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు.

29.9.2019 స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవి

:30 .9.2019 శ్రీ బాల త్రిపురసుందరి దేవి .

1.10.2019 :శ్రీ గాయత్రి దేవి.

2.10.2019 : శ్రీ అన్నపూర్ణా దేవి.

3.10.2019: శ్రీ లలితా త్రిపురసుందరి దేవి.

4.10.2019 : శ్రీ మహాలక్ష్మిదేవి.

5.10.2019 : శ్రీ సరస్వతీదేవి. (మూలానక్షత్రం)

6.10.2019: శ్రీ దుర్గాదేవి.(దుర్గాష్టమి)

7.10.2019 : శ్రీ మహిషాసురమర్దినిదేవి. (మహర్నవమి )

8.10.2019 :శ్రీ రాజరాజేశ్వరిదేవి.(విజయదశమి)

5.10.2019న జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవారి జన్మనక్షత్రంగా అనగా ములానక్షత్రం గా భావిస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీ రాముల వారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు.

🌼🌿దుర్గా దేవి మహిమ :🌼🌿

దుర్గమమైనది దుర్గ. పరమార్ధదృష్టితో చూస్తే ఏది దుర్లభమో, ఏది దుర్గమమో,

ఆ పరతత్త్వమే దుర్గ. దుర్గా అంటే పరతత్త్వస్వరూపం, పరబ్రహ్మస్వరూపం. అంతేకాని త్రిశూలం పట్టుకుని రాక్షసులను సంహరించే ఒకానొక స్త్రీమూర్తి మాత్రమే కాదు.

దుర్గతులను తొలగించునది దుర్గ :

దుర్గతులు చాలా ఉంటాయి. దుః శబ్దంతో వచ్చేవి దుఃఖం, దుష్టత్వం, దుర్మార్గం, దురాచారం, దురితం మొదలైనవి. సాధించడానికి మహాకష్టమైన దానికి దుస్సాధ్యం అని పేరు. ఇందులో ఏం వచ్చినా భయం వేస్తుంది. వీటన్నింటిని తొలగించే తల్లి కనుక దుర్గా.

దుర్గానామానికి ఉన్న శక్తిని చెప్తూ సప్తశతిలో “దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్తా” అంటారు.

రాక్షస శక్తులు, విఘ్నాలు, సంసారబంధాలు, చెడ్డ పనుల వల్ల కలిగే ఫలితాలు, శోకము, దుఃఖము, నరకము, యమదండన, జన్మ పరంపర, భయాలు, రోగాలు మొత్తం పదకొండు దుర్గతులు.
వీటన్నింటిని తొలగించేది దుర్గ.

ఆ తల్లిని ఆశ్రయిస్తే ఇచ్చే ఫలం సంసార సముద్రం నుంచి దాటవేస్తుంది. అంత గొప్పగా ఎవరు దాటించలేరు.

“సుతర సితరసే నమః” ఈవిడ దాటిస్తే సంపూర్ణంగా దాటిస్తుంది.

“నమః ప్రతరణాయచ ఉత్తారణాయచ” – ఆ దాటించడం ఒక ఉత్తమ స్థితి నుంచి మరొక ఉత్తమస్థితికి తీసుకువెళ్ళడం ప్రతరణ.

ఉత్తరణం అంటే మళ్ళీ వెనక్కి రావల్సిన అవసరం లేకుండా మోక్షాన్ని ఇవ్వడం.

🌼🌿 శ్రీ మాత్రే నమః 🙏🌼🌿

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *