చూడు చంద్రముఖి లా మారుతున్న గంగను చూడు…..పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగను చూడు అని సినిమాలో అంటే చూసేసి చంద్రముఖి సినిమాని సూపర్ హిట్ చేసేశాము. అలాగే చూడండి కవితమ్మ లా మారుతున్న బతుకమ్మని చూడు… పూర్తిగా కవితమ్మ లా మారిన బతుకమ్మ ని చూడు అనుకొని ఇప్పుడు ఈ బంగారు బతుకమ్మ అనే కమర్షియల్ సినిమా ని హిట్ చెయ్యక తప్పని పరిస్థితి వచ్చింది.
జాన్ పెర్కిన్స్ తన కన్ఫెషన్ ఆఫ్ ఎ ఎకానామిక్ హిట్ మ్యాన్ లో చెప్పినట్లు ఒక సంస్కృతి ని ధ్వంసం చెయ్యాలంటే ముందుగా ఆ సంస్కృతి మంచిది కాదు అని చెప్పాలి. తద్వారా ఆ ప్రాంత సంస్కృతిని దెబ్బతీసి తమ సంస్కృతిని అక్కడ స్థాపిస్తే చాలు. ఆ జాతి లేదా దేశం మొత్తం పాదాక్రాంతమవుతుంది, ఎందుకో కానీ, ఈ ఫార్ములా ప్రపంచం మొత్తం హిట్ అయ్యింది కానీ భారతదేశం దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అయ్యింది. కానీ ఆ సంస్కృతి మీద దాడి మాత్రం మరో విధంగా జరుగుతూనే ఉంది, దానికి మరో మార్గం ఆ సంస్కృతిని సామాన్య ప్రజలకు దూరం చెయ్యటం. ఇది మాత్రం క్రమక్రమంగా భారతదేశంలో సక్సెస్ అవుతూనే ఉంది. అందులో భాగమే ఇప్పుడు బతుకమ్మ ను కమర్షియలైజ్ చెయ్యటం. ఇప్పటికే వినాయక చవితి ఉత్సవాలను కమర్షియలైజ్ చేసి, భక్తిని విగ్రహాల సైజుల్లో, లడ్డుల బరువుల్లో కొలిచి, ఎవడు ఎంత గొప్ప భక్తుడో అని తేల్చుకొనే అడ్డాగా తేల్చేశాక, అత్యంత గొప్ప భక్తుడు ఎవడంటే అత్యంత ఎక్కువ ఖర్చు పెట్టేవాడే అని అందరూ నిర్ణయించేశారు. ఇప్పుడు ఇదే పరిస్థితి బతుకమ్మకు వచ్చింది
తెలంగాణా ఉద్యమ సమయంలో తెలంగాణా సంస్కృతి పునరుజ్జీవం అనే పేరుతో సామాన్య ప్రజలు అత్యంత సహజంగా చేసుకొనే ఒక పండగను పట్టణ నడివీదుల్లోకి లాక్కొచ్చి , అత్మీయ దేవతను ఆడంబరాల బొమ్మగా మార్చి వైభవోపేతం అనే ట్యాగ్ లైన్ తగిలించి కలర్ ఫుల్ లైట్లతో అలంకరించేశాక, బతుకమ్మ లో జీవం పోయి, కేవలం బొమ్మ లా మిగిలిపోయింది, తెలంగాణా ఉద్యమానికి దన్నుగా బతుకమ్మ లాంటి సామాన్యుల సామూహిక ఉత్సవాన్ని వాడుకోవటం, తద్వారా ఒక ఉద్యమ స్పూర్తి తీసుకురావటంలో ఆక్షేపణ ఏమీ లేదు, బాల గంగాధర్ తిలక్ కూడా వినాయక ఉత్సవాలను స్వాతంత్ర కాంక్ష రగిలించటానికి ఒక సాధనంగా వాడుకొనే సామూహిక నిమజ్జనం అనే కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చాడు, అది స్వాతంత్ర పిపాసను రగిలిస్తే . ఇది ప్రత్యేక తెలంగాణా పిపాసను రగిలించాయి, ఇవి రెండూ ఖచ్చితంగా గొప్ప పరిణామాలే. సామాన్యుల కు దగ్గర కావాలంటే వారి సంస్కృతిని ప్రతిబింబించే ఉత్సవాల ద్వారానే దగ్గర కాగలం అని చెప్పే పరిణామాలే, దగ్గర కావటం వరకు చాలా మంచిది, కానీ ఆ దగ్గరవటం క్రమక్రమంగా ఆ సంస్కృతిని తన గుప్పిట్లోకి తీసుకుంటే….. అప్పుడు అది సామాన్య ప్రజలకు దూరం అవుతుంది, కూలీ వర్గాల నుండి పాలక వర్గాల చేతుల్లోకి వెళ్తుంది.
పండగలు అన్నీ సామూహిక ఉత్సవాలే అయినా , కొన్ని పండగలు మాత్రం వ్యక్తి గతం కన్నా జరుపుకొనే దానికన్నా సామూహికంగా జరుపుకొనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా ఇలాంటి పండగలు కూలీ వర్గాలు జరుపుకొనే పండగలయిఉంటాయి,భూస్వామ్య వర్గాలు ఇలాంటి సామూహిక పండగలకు కొంచెం దూరం పాటించటం కద్దు. బతుకమ్మ పండగ కూడా ఇలాంటి పండగే. కల్లా కపటం తెలియని అచ్చమైన పల్లెపండగ, సామాన్య ప్రజలు మాత్రమే జరుపుకొనే పండగ. హిందూ మతంలో సాధారణంగా కనిపించే విగ్రహారాధన అనే భావన కూడా లేకపోవటం ఈ పండగ ప్రత్యేకత, ఇది పామరుల పండగ తప్ప, పండితుల పండగ కాదు అని చెప్పటానికి ఇది కూడా ఒక నిదర్శనం, కేవలం ప్రకృతిలో లభించే సహజమైన పూలతో పల్లెటూరి ప్తజలు ప్రేమగా పేర్చుకొని తమ తోబుట్టువులా భావించి మహిళలు సాయం సంధ్యవేళ పాడుకొనే పాటంత సహజమైన పండగ.
అసలు బతుకమ్మ పండగ ఎందుకు జరుపుకుంటారు అనే దానికి చాలా కథనాలున్నాయి, అప్పట్లో భూస్వామ్యుల అకృత్యాలు భరించలేక మరణించిన ఆడపడుచులను తలచుకొని బాధపడుతూ, బతుకమ్మా..బతుకమ్మా అని వారినుద్దేశించి , చనిపోయిన వారి గుర్తుగా పువ్వులు పేర్చి (భారతీయ మహిళల్లో పువ్వులు సౌభాగ్యానికి చిహ్నం) వారిని పూజించటం అనే ఒక సాంప్రదాయం గా ప్రారంభం అయ్యింది అనేది ఒక కథనం, ఇలాంటి కథలు ఆంధ్రా ప్రాంతంలో ఉండటం కూడా గమనార్హం, ప్రసిద్ది పొందిన తిరుపతమ్మ కథ కూడా ఇలాంటిదే , బతుకమ్మ చుట్టూ చేరి పాడే పాటల్లో అంతర్లీనంగా ఒక విషాద వీచిక వినిపించటం కూడా ఈ కథనానికి బలం చేకూరుస్తున్నాయి. అంతే కాదు, చాలా పాటల్లో ` బావిలో పడ్డ ` లేదా ఆ అర్థం వచ్చేలా పదాలు ఉండటం కూడా గమనించాలి, బహుశా ఇదే కారణంతో భూస్యామ్య వర్గాలు ఈ పండగకు బడుగు ప్రజలు ఇచ్చినంత గొప్ప ప్రాధాన్యత ఇవ్వలేదు.
మరో కథనం ప్రకారం బతుకమ్మను గౌరమ్మ తల్లి గా భావించి పూజించటం కూడా , ఈ పండగ వచ్చే సమయానికి వర్షాకాలం దాదాపుగా పూర్తవుతుంది. శీతాకాలం వస్తుంది , వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పడతాయి, ఆ సందర్బంగా గౌరీ దేవి ( గౌరి దేవి శక్తి కి ప్రతిరూపం, గ్రామదేవతలన్నీ గౌరి దేవి రూపాలే ) కి తమ కృతజ్ఞత తెలియచేసుకోనే పండగ అనే ఒక వాదన కూడా ఉంది, ఇది కూడా సామాన్య ప్రజలు చేసుకొనేదే. గ్రామదేవతలకు కూడా ఒక నిర్దిష్టమైన రూపం అంటూ ఉండకపోవటం , బతుకమ్మ కి కూడా ఒక నిర్దిష్టమైన రూపం లేకపోవటం కూడా గమనార్హం.,
ఇలా చాలా కథలు ప్రచారంలో ఉన్నా, ఇది బడుగు ప్రజల, శ్రామిక ప్రజల పండగ అనటంలో మాత్రం సందేహం లేదు. ఈ పండగలో ఎక్కడా భూస్వామ్య వర్గాలకు స్థానం లేదు. బతుకమ్మ కోసం పాడే జానపదుల పాటల్లో కానీ, ఎక్కడా ఈ వర్గాల ప్రస్తావన లేదు, ఎక్కడా మంత్రతంత్రాలు లాంటి భూస్వామ్య వర్గ పండగ లక్షణాలు లేవు . ఇలా ఏ లక్షణం చూసుకున్నా, ఇది సామాన్య ప్రజల పండగే అనేది సుస్పష్టం
కొన్ని శతాబ్దాలుగా బడుగు ప్రజలకోసం, వారి ఆనందోత్సాహాలలో భాగమైన ఈ బతుకమ్మ ఇప్పుడు క్రమక్రమంగా కమర్షియలైజ్ అయిపోతుంది, ఆదునికతను సంతరించుకొని, ఆడంబరాలను అద్దుకొని అందరి పండగ కాస్త, కొందరి పండగ గా మారిపోతుంది. తంగేడు పూలు , బంతి, చామంతుల తో అందంగా రంగు రంగులతో కనపడే బతుకమ్మ, ఇప్పుడు బంగారు బతుకమ్మ అయిపోయింది. ఇప్పుడు బతుకమ్మ ఒక ఈవెంట్, ఇప్పుడు బతుకమ్మ ఒక డాన్సింగ్ ఈవెంట్, ఒక సింగింగ్ ఈవెంట్ అన్నీ కలిసిన ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్. మన పండగను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలంటే పండగను అత్యంత సహజంగా తీసుకెళ్లాలి కానీ, ఇక్కడ మన పండగ కొత్త రెక్కలు తొడుక్కుంది, కొత్త కొత్త పువ్వులొచ్చి చేరాయి, అక్కడక్కడా బంగారు పువ్వులొచ్చి చేరాయి, ఇప్పుడు ఈ పండగ చెయ్యటానికి ఈవెంట్ మానేజర్స్ వచ్చారు, తెలంగాణా జాగృతి పేరుతో రంగంలోకి దిగిన ఒక ఈవెంట్ మానెజ్ మెంట్ సంస్థకు ఈ పండగ మీద పేటెంట్ హక్కులు ఇచ్చేశారు, ఇప్పుడు ఈ మేనేజర్స్ ఏ వీదిలో పండగెప్పుడు జరగాలో డిసైడ్ చేస్తారు. ఏ వీదిలో ఎంత మంది ఆడియన్స్ ఉండాలో డిసైడ్ చేస్తారు, బతుకమ్మ సైజ్ డిసైడ్ చేస్తారు, ఆ డాన్స్ లో ఏ స్టెప్స్ వెయ్యాలో, ఏ పాట పాడాలో,….. ఒక్కటేమిటి అన్నీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇక దాని మీద ప్రసార హక్కులూ వాళ్లవే. ప్రసారం కలర్ ఫుల్ గా ఉండటం కోసం పట్టు చీరలకు తప్ప నూలు చీరలకు చోటుండదు. కెమెరా యాంగిల్స్ ని బట్టి లిప్ స్టిక్ వేసుకున్న నవ్వులు అందంగా ఫోజులు ఇస్తాయి. సహజమైన చలోక్తులు ఉండవు. సత్తుపిండి ని అమ్మే స్వీట్ షాపులొస్తాయి. అందమైన పాకెట్లలో ఒకరికొకరు అందించుకుంటారు. ఎవరి పాకెట్ సైజ్ పెద్దదో వాడికి ఎక్కువ ప్రేమ ఉన్నట్లనిపిస్తుంది. ఇవన్నీ మనకు తెలియకుండానే జరుగుతుంటాయి . తెలంగాణా దాటిన బతుకమ్మ దేశవిదేశాలకు వీసా పుచ్చుకొని తిరిగేస్తూ తన యాస , బాస, మర్చిపోతుంది.
ఇప్పటి వరకు ఎవరి వీధిలో , ఎవరి గుమ్మం ముందు వాళ్ళు చేసుకున్న అందమైన బతుకమ్మ లో ఒక అమాయకత్వం ఉంటుంది, ఒక స్వచ్చత ఉంటుంది. కానీ ఇకముందు బతుకమ్మలో ఆ స్వచ్చత కనిపించదు. ఆ ఆమాయకత్వం కనిపించదు . కనిపించేది, వినిపించేది అంతా ఆర్భాటమే. పల్లెటూరిలో ఎక్కడైనా దొరికే పువ్వులతో పైసా ఖర్చు లేకుండా జరుపుకొనే బతుకమ్మ ఇప్పుడు కోటీశ్వరురాలు. అక్షరాల15 కోట్లున్న భూస్వామి పుత్రిక అవును ఇప్పుడు ఈ ఈవెంట్ ఖర్చు 15 కోట్లు.
బతుకమ్మ నిండా వెయ్యేళ్ళు బతకాలి, ఆ బతుకు నిండా ఆ స్వచ్చమైన పువ్వులాంటి నవ్వుండాలి తప్ప, ప్లాస్టిక్ నవ్వుల, బంగారు పువ్వుల బతుకు కాదు. బతుకమ్మను ప్రశాంతంగా బతకనివ్వండి.
ఈ సంవత్సరం బతుకమ్మ చీరల పేరుతో జరిగిన ప్రహసనం చాలు, బతుకమ్మ బతుకు ఎటు పోతుందో తెలియటానికి..
(పోయినేడాది పోస్ట్, మరో సారి స్వల్ప మార్పులతో )
మోహన్ రావిపాటి..
+918074232502