తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. గోమాతలను దానం ఇచ్చేందుకు భక్తులు ముందుకొస్తున్నారు. కాశీ విశ్వేశ్వర ఆలయానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీదగా కపిల గోవును గాయత్రీ సొసైటీ అందజేసింది. గోపూజ నిర్వహించి ఆలయానికి గోమాతను టీటీడీ ఛైర్మన్ అప్పగించారు. గోపూజలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గోవును పూజిస్తే ముక్కోటి దేవతలు, తల్లిదండ్రులను పూజించినట్టేనని ఆయన తెలిపారు. గోమాత విశిష్టతను తెలియచేసేందుకు గుడికో గోమాత కార్యక్రమం చేపట్టామని వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో ‘గుడికో గో మాత’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఆలయ నిర్వాహకులు ముందుకొస్తే ఆవును,దూడను టీటీడీ అందచేస్తుందన్నారు. టీటీడీ ఖర్చులతోనే ఆలయాలకు గోవులను చేరుస్తామని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని పేర్కొన్నారు.