మండపేట టు ఖైరతాబాద్…
తరలి వెళ్లిన గణేష్ లడ్డు..
ఆంక్షల మధ్య 100 కేజీ ల లడ్డు నివేదన…
అత్యంత భారీ వినాయక విగ్రహం గా ప్రపంచంలోనే పేరొందిన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణనాథుడు ప్రసిద్ధి. మండపేట మండలం తాపేశ్వరం లో అతి పెద్ద మహాలడ్డు తయారీ సంస్థ గా గిన్నిస్ రికార్డు నెలకొల్పిన సంస్థ సురుచి ఫుడ్స్ గణతికెక్కింది. ఇక్కడ నుండి వంద కిలోల లడ్డు ప్రసాదం శుక్రవారం అక్కడికి తరలివెళ్లింది.ఈ ఏడాది కరోనా ప్రభావం వల్ల ఆంక్షలు నడుమ అన్ని జాగ్రత్తలు పాటించి దీన్ని తయారు చేసి ఖైరతాబాద్ పంపారు.
వివాదం తో నిలుపుదల…
ఖైరతాబాద్ గణనాథుడు భారీ విగ్రహం చేతిలో భారీ లడ్డు ఉంటే బాగుంటుందన్న ఆలోచన తో 2010 లో సురుచి అధినేత అక్కడి గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు తో మాట్లాడి తొలి సారి గా 500 కిలో లడ్డు అక్కడికి తీసుకుని వెళ్లి భక్తి పూర్వకంగా సమర్పించారు. ఇక ప్రతి ఏటా సైజ్ పెంచుతూ 2013 లో 4,200 కేజీల లడ్డు ను ఖైరతాబాద్ గణేష్ కు అందించారు. ఆ ఏడాది విగ్రహం సైజ్ కంటే ఈ లడ్డు పైనే పెద్ద చర్చ,ప్రచారం జరిగింది. పదకొండు రోజులు లడ్డు వినాయక విగ్రహం చేతిలో ఉంచి నిమజ్జనం నాడు భక్తులకు పంపిణీ చేసేవారు. దీంతో ఒక్కసారి గా తాపేశ్వరం లడ్డు అందరి దృష్టిని ఆకర్షించింది. అంత పెద్ద లడ్డు విగ్రహం చేతిలో 11 రోజులు పాటు ఉండటం అప్పట్లో ఓ రికార్డు. ఈ క్రమంలో ఆ ఏడాది వర్షం వల్ల ప్రసాదం పాడు కాగా దాన్ని పంపిణీ చేయకుండా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. అనంతరం 2015 లో ప్రసాదం పాడవ్వకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి కవర్లు ఉంచి పంపారు.అప్పుడు ఏకంగా ఆరు టన్నులు లడ్డు ఖైరతాబాద్ పంపారు. అదో రికార్డు. రాష్ట్రాలు వేరు పడ్డ అనంతరం స్వల్ప వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో తర్వాత ఏడాది నుండి పెద్ద లడ్డు కాకుండా 25 కిలో లడ్డు అక్కడ నివేదిస్తూ వస్తున్నారు. కాగా 2016 లో విశాఖపట్నం గణేశునికి 30 టన్నుల మహా లడ్డు నివేదించారు.గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో నమోదైంది. అదే అతి పెద్ద లడ్డు గా రికార్డు కొనసాగుతూనే ఉంది.
ప్రతి ఏడాది లాగే…
ఈ సంవత్సరం 100 కిలోల లడ్డూ ను ఖైరతాబాద్ గణేష్ కమిటీ కోరికపై పంపినట్లు సురుచి అధినేత పొలిశెట్టి మల్లిబాబు తెలిపారు.
అందంగా వినాయకుడి రూపంతో లడ్డు నుఅలంకరించామన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడికి విగ్రహం సైజు తొమ్మిది అడుగులు మాత్రమే తయారు చేశారన్నారు. గతంలో భద్రతా కారణాలవల్ల ఖైరతాబాద్ గణేశుడికి మహాలడ్డూలను నివేదించడం ఆపివేసినా ప్రతి ఏటా 25 కిలోల లడ్డూలను నైవేద్యంగా పంపుతూ వచ్చామని మల్లిబాబు చెప్పారు. జిల్లాలో ని బిక్కవోలు వినాయకుడి కి 25 కేజీల లడ్డు, అయినవిల్లి వినాయకుడి కి 50 కిలో ల లడ్డు సమర్పించినట్లు తెలిపారు.