Breaking News

రాములోరి పెళ్ళి

రాములోరి పెళ్ళి
==========

“ఏరా ! ఎంకటేశూ యాడ దాక వచ్చాయి పనులు ! ఇంకా సున్నం ఏసే కాడే ఉంటే ఎట్రా !! పెళ్ళేమన్నా ఇంకా పద్దినాలు ఉందారా ! రేప్పొద్దునేరా !! ఇట్టా జెత్తే ఎట్రా !! ” వత్తానే ఇరుచుకపడతన్నాడు ఆంజనేయులు మామ.

” అయిపోద్ది లే మామా !! ఇదిగో ఈ మూలన కొద్దిగేత్తే సరిపోద్ది ! మిగతాదంతా అయిపోయింది, నువ్వు కంగారు బడమాక ! రేత్రంతా మన కుర్రాళ్ళీడే ఉంటారు !! తోరాణాలు తేటానికి, భారతమ్మ తోటకు యలమంద ని పంపిచ్చా !! మన తోటలోయే కొబ్బరి మట్టలు తీసకొచ్చా !! రేత్రికి ఇయ్యి కడితే మొత్తం పనులు అయినట్టే !! పంతులు గారు గూడా ఇప్పుడు దాకా ఈడే ఉండాడు, కూతురు అల్లుడు వత్తే ఇప్పుడే పోయాడు ! నువ్వు సూత్తా ఉండు, పెళ్ళి ధూం ధాం గా జరుగుద్ది ”

” ఏం జరగటం రా !! పోయినేడు సన్నాయి మేళం అని పొన్నూరునుండి పిలిపిత్తే ఆడొచ్చి పిపి అని రెండు ఊదులు ఊది పోయాడు. పదేలు పోయినయి గానీ ఏవన్నా చెవులకింపా !!! ఒక ఇవరం తవరం లేదు ..ఈ ఏడు మళ్ళీ యాడ్నుంచే పట్టకొత్తన్నావు, ఈళ్ళన్నా ఏమన్నా ఊదుతారా !! ”

” లేదు మామ !! ఈళ్ళు మొన్న సంక్రాంతికి నందిపాడులో ప్రోగ్రామ్ చేశారు, అసలు ఎవ్వురూ కిక్కురుమనలేదనుకో,. అన్నట్టు మామ, ఈ ఏడు తప్పెటగుళ్ళు కూడా తెప్పిత్తన్నా , ఈళ్ళు చిందేత్తే ఉంటది సూడు .. నా సామిరంగా ”

” కానీయ్.. కానీయ్ …పెళ్ళికొచ్చినోళ్ళదగ్గర మాట రాగూడదురోయ్ ” అని చెప్తా ఇంటికి పోయాడు ఆంజనేయులు మామ.

ఇదేందో కూతురు పెళ్ళో, కొడుకు పెళ్ళో అనుకుంటన్నవారా !!, కానే కాదు, అంతకంటే ఎక్కువైన రాములోరి పెళ్ళి. పతూళ్ళో, పతేడూ జరిగే పెళ్ళి. అస్సలు గుడి గూడా లేనూరు అయినా యాడన్నా ఉంటదేమో గాని రాములోరి పెళ్ళి జరగని ఊరు మాత్రం ఉండదు. గుడి లేకపోతే ఊరి రచ్చబండ మీదైనా పెళ్ళి జేత్తారు, ఇగ్రహాలు లేకపోతే ఒక పటమెట్టైనా పెళ్ళి జేత్తారు, అది రాముడంటే , రాములోరి పెళ్ళంటే ఊరంతా పెళ్ళే. ఊరంతా పెద్దలే, మతం లేదు, కులం లేదు, డబ్బుతో పనే లేదు, రాములోరికి అందరూ ఒకటే, ఊరంతా ఒకటే

మైక్ సెట్ సుభానీ ఆ రోజు కోసం ఎంత ఉషారు గా సూత్తాడు, నాలుగు రోజల ముందే గుడంతా సీరియల్ సెట్టేసి గుడి మొత్తానికి ఎంత ఎలుగు దీసకొత్తాడు. కరెంట్ జానీ, ఆ రోజు పొరపాటున కరెంట్ ట్రిప్ అయి పోయిద్దేమోనని, ఎంత జాగ్రత్తగా సూత్తాడు. పంచాయితీ నీళ్ళిచ్చే ఆదాం , ఎంత జాగ్రత్తగా పీపాలన్ని నింపి పెడతాడు, అన్నట్టు అసలు ఆ పీపాలు, షామియానాలు రెంట్ కిచ్చే బషిరుద్దీన్ టెంట్ ని ఎంత జాగ్రత్తగా ఏత్తాడు. అసలు ఇచిత్రం ఆ షాపుందే మనూరు మసీదులో కదూ !!

అసలు రాములోరు మనూళ్ళేనే కనపడతాడు. కోనేరు, ఆ కోనేట్లో కలువపూలు ఆ రెండింటిని, కలిపి సూడు, నీలిరంగు నీళ్ళల్లో ఎర్రటి కలువపూలు, అచ్చం రాములోరి వళ్ళో ఆ సీతమ్మ తల్లిలా. అట్టా సూడగానే ఇట్టా దణ్ణమెట్టాయలనిపించదూ !! అదేరా రాములోరంటే !! రాములోరంటే మనూర్రా !! సీతమ్మ అంటే మనూళ్ళో ఉన్న సంతోషం రా !! ఆ ఇద్దరూ ఎల్లకాలం కలిసుండాలనే మనం ఏటేటా కళ్యాణం జేసేది . రాములోరి పెళ్ళి జెయ్యాలంటే తెలుగోడే జెయ్యాలిరా !! సీతమ్మతల్లి కి ఆళ్ళ నాయన జనకమహారాజు, మామ దశరధ మారాజు లతో పాటు తెలుగోడు కూడా మంగళసూత్రం పెట్టాడు, అందుకే రాములోరు , సీతమ్మ తల్లి కి కట్టే తాళికి మూడు సూత్రాలుంటాయి, ఆయమ్మ మనకి కూతురు, కోడలు, తల్లి, అన్నీ, అందుకే ఆ తల్లి కి కూడా మనమంటే అంత గుబులు.

అన్నట్టు ఈ పెళ్ళీకి జేసే వడపప్పు, పానకం రుచి చూడాలేగాని.. అబ్బబ్బా, ఏం రుచి రా !! మన పెద్ద శెట్టి ఇచ్చిన బెల్లందో, చిన్నశెట్టి ఇచ్చిన మిరియాలు, యాలుక్కాయలదో, కొత్తగా కొట్టెట్టిన శెట్టి ఇచ్చిన పెసరపప్పు దో కాదు, ఆళ్లందరూ దేవుడి కోసం మనసారా ఇచ్చిన ఆళ్ళ తుప్తి లోదిరా అయ్యా !! ఇక ఇవాళ ఊరంతా బంతి భోజనాలే ! ఎన్ని బస్తాలైనా పర్లేదు , ఊరందరికీ , ఊర్లో కొచ్చినోళ్ళకి ఎవరికైనా పప్పన్నం పెట్టి పంపాల్సిందే అని ఐదు బస్తాల బియ్యం మరేయించి పంపిన అంజనేయులు మామ, వారం నుండి ఒక్క కాయ కూడా కొయ్యకుండా అట్నే చెట్టునుంచి, ఇయ్యాళ మొత్తం కోయించి భారతమ్మ పంపిన వంకాయలు, బస్తా కందిపప్పు పంపిచ్చిన సుబ్బరావు బాబాయ్. గోంగూర పంపిన వెంకటేశ్వర్లు తాత, ఉర్లగడ్డలు పంపిన సురేషన్న. ఓపిగ్గా ఇస్తరాకులు కుట్టి పంపించిన పెద్దామ కల్పవల్లి. ఒక్కళ్లేందిరా నాయనా, ఊళ్ళోంతా ఇంట్లో పెళ్ళికి పంపినట్టే కదూ !! చివరాఖరికి పాలకేంద్రమోళ్ళు గూడా నిన్న పాలన్నీ చేమిరేసి పెరుగు పంపారంటే రాములోరంటే మనూరోళ్ళకి ఎంత బెమో చూడు.

ఏమైనా రాములోరి పెళ్ళి సూత్తా ఉంటే మనసంతా ఎటో పోద్దిరా !! మనం మన అమ్మానాయనల పెళ్ళి చూడలేదు గాని రా, ఈ పెళ్ళి సూత్తుంటే నాకైతే అచ్చం అమ్మానాన్న పెళ్ళి సూత్తన్నంటే అనిపిత్తదరా !! ఎమ్మట్నే కళ్ళెంబడి నీళ్ళొత్తాయి, ఏడుపు గాదురా అదేదో .. అంతే.. మనసంతా పశాంతంగా, నిమ్మళంగా అవుద్ది. ఆళ్ళిద్దరి పెళ్ళి తలంబ్రాలు పంతులు గారు పొట్లం కట్టిచ్చాక, తీసుకెళ్ళి ఇంట్లో దేవుడి గూట్లో పెట్టి , రాములోరి పొటో కి ఒక్కమాలి దణ్ణమెట్టుకుంటే చాలురా, ఎట్టాంటి కట్టానైనా ఇట్టే తీర్చేత్తాడు. రాములోరి మన దేవుడురా, మనూరి దేవుడు, మనీధి దేవుడు, మనూరిని సల్లంగా సూసే మారాజు. అందుకే అయన పెళ్ళి సూట్టం అంటే జనమజనమల పుణ్యంరా. అట్టా కళ్లారా సూడాలా, తనివితీరిపోవాలా !!

అన్నట్రోయ్ !! రేత్రికి హరికథుంది “సీతారామకళ్యాణం” మర్చిపోకుండా రారోయ్

మోహన్.రావిపాటి
9000864857

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *