Breaking News

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

అంతకుముందు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖశాంతులతో ఉండడానికి- చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక – యజ్ఞాంతంలో అవభృథస్నానం’ చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్ని సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం.

చక్రస్నానం (అవభృథం)లో శ్రీవారి సుదర్శనచక్రానికి (చక్రత్తాళ్వార్‌కు) పుష్కరిణిలో స్నానం నిర్వహించే ముందు శ్రీభూ సమేత మలయప్పస్వామికి ‘స్నపన తిరుమంజనం’ నిర్వహించారు. తర్వాత సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణి జలంలో ముంచి, స్నానం చేయించారు. ఆ దివ్యాయుధ స్పర్శవల్ల పవిత్రమైన పుష్కరిణి జలంలో భక్తసమూహం కూడా అదే సమయంలో స్నానం చేశారు. ఇందువల్ల ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికి దర్శించిన వారికి ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి.ర‌మ‌ణ దంప‌తులు, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ శ్రీ‌ ర‌విరంజ‌న్‌, పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ మ‌ధుసూద‌న్ యాద‌వ్‌, ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, చెన్నై స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, జెఈవోలు శ్రీమ‌తి స‌దాభార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబీసీ సిఈవో శ్రీ ష‌ణ్ముఖ్ కుమార్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *