Breaking News

తప్పకుండా ప్రతి ఒక్కరు వీలుంటే

 

రేపు ఇందిర ఏకాదశి..తప్పకుండా ప్రతి ఒక్కరు వీలుంటే ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణుడు ని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి..సకల కష్టాలు తొలిగిపోతాయి.

 

ఇందిరఏకాదశి

శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో విర్ణించబడింది.

ఒకసారి ధర్మరాజు దేవదేవునితో “ఓ కృష్ణా! మధుసూదనా! భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి పాలనకు ఉన్నట్టి నియమనిబంధనలు ఏమిటి? ఆ వ్రతపాలన వలన కలిగే లాభమేమిటి?” అని ప్రశ్నించాడు.

ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. “ఈ ఏకాదశి పేరు ఇందిర ఏకాదశి. దీనిని పాటించడము ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు. అంతే కాకుండ అతని సమస్త పాపాలు నశిస్తాయి.”

“రాజా! సత్యయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు. తన శత్రువులను అణచడంలో నేర్పరియైన ఆ రాజు మహీష్మతీ పురాన్ని చక్కగా పాలించేవాడు. పుత్రపౌత్రులతో గూడి అతడు ఎంతో సుఖంగా జీవించాడు. అతడు సర్వదా విష్ణుభక్తిరతుడై ఉండేవారు. ఆధ్యాత్మికజ్ఞానంలో నిరంతరము లగ్నమై యుండెడి భక్తుడైన కారణంగా ఆ రాజు ముక్తినొసగెడి గోవిందుని నామస్మరణలోనే తన కాలాన్ని గడిపేవాడు.”

“ఒకనాడు ఆ రాజు తన రాజ్యసింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు. నారదమునిని చూడగానే ఆ రాజు లేచి నిలబడి, చేతులు జోడ్చి వినమ్రంగా వందనము కావించాడు. తరువాత షోడశోపచార పూజ కావించి మునిని సుఖాసీనము కావింపజేసాడు. అపుడు నారదుడు ఇంద్రసేనునితో “రాజా! నీ రాజ్యంలో

సుఖసమృద్ధులతో ఉన్నారా? నీ మనస్సు ధర్మపాలనలో లగ్నమై ఉన్నదా? నీవు విష్ణుభక్తిలో నెలకొని ఉన్నావా?” అని ప్రశ్నించాడు.” దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో “ఓ మునివర్యా! మీ దయ వలన అంతా బాగానే ఉన్నది. మంగళమయంగానే ఉన్నది. నేడు మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది, నాకు యజ్ఞఫలం లభించింది. ఏ దేవర్షీ! మీ రాకకు కారణమేమిటో చెప్పవలసినది” అని అన్నాడు. రాజు మాటలను వినిన తరువాత నారదుడు అతనితో ఇలా అన్నాడు ఓ రాజశార్దూలమా! నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెబుతాను విను, ఓ రాజేంద్రా! నన్ను ఒకసారి బ్రహ్మలోకం నుండి యమరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్పించాడు. నేను కూడ అతనిని స్తుతించాను. అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూసాను. వ్రతోల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది. రాజా! అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలపమని అర్థించాడు. అతడు నాతో ఇలా తెలపమని అర్థించాడు. అతడు నాతో ఇలా అన్నాడు- “మహిష్మతీ పురాధీశుడైన ఇంద్రసేనుడు నా పుత్రుడు. పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వలన నేనిపుడు యమసదనంలో ఉన్నాను. కనుక నా పుత్రుడు ఇందిర ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి. అపుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలను.” “కనుక ఓ రాజా! నీ తండ్రిని ఆధ్యాత్మికలోకానికి పంపడానికై నీవు ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేపట్టు” అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని చెప్పాడు.

అపుడు ఇంద్రసేనుడు ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుపమని నారదుని అర్థించాడు.

వ్రతవిధానాన్ని శ్రీనారదుడు ఇలా వివరించాడు “ఏకాదశి ముందు రోజు మనుజుడు తెల్లవారుఝామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు అతడు ఒక్క పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి. మర్నాడు ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారు ఝామునే మేల్కొని దంతధావనము, హస్తముఖప్రక్షాళనము చేసికొని చక్కగా స్నానం చేయాలి. తరువాత ఎటువంటి భౌతికభోగంలో పాల్గొననని ప్రతనియమం చేపట్టి రోజంతా ఉపవసించాలి. ఓ పద్మనేత్రుడా! నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను” అని పలికి భగవంతుని స్తుతించాలి.

“తరువాత మధ్యాహ్నవేళ సాలగ్రామశిల ఎదురుగా విధిపూర్వకముగా పితృతర్పణాలు చేయాలి. తదనంతరము బ్రహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి. పితృతర్పణ కార్యంలో పదార్థాలను గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన పుష్ప ధూపదీప నైవేద్యాలతో హృషీకేశుని అర్చించాలి. శ్రీ కృష్ణుని నామరూపగుణ లీలాదుల శ్రవణకీర్తనలతో,

స్మరణముతో అతడు ఆ రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు అతడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తదనంతరము అతడు సోదరులు, పుత్రపౌత్రులు, బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రతపారణము చేస్తూ భోజనం చేయాలి. రాజా! ఈ విధంగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణులోకానికి వెళతాడు.” నారదుడు ఈ విధంగా ఉపదేశించి అంతర్హితుడయ్యాడు. తరువాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానము, బంధువులు, మిత్రులతో గూడి నిష్టగా ఇందిర ఏకాదశిని పాటించాడు. ఆ వ్రతమహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. ఇంద్రసేనుని తండ్రి గరుడవాహనారూధుడై విష్ణుపదాన్ని చేరుకున్నాడు. తరువాత రాజర్షియైన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనము చేసి, చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవద్ధామానికి వెళ్ళిపోయాడు.

 

ఇందిర ఏకాదశి మహిమే ఇటువంటిది. ఈ ఇందిర ఏకాదశి మహిమను చదివేవాడు, వినేవాడు సమస్త పాపముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటాడు.

 

హరినామ స్మరణం ..

సమస్త పాప హరణం..

 

ఇందిరా ఏకాదశీ వ్రతము నియమాలు:-దయచేసి గమనించండి.

 

ఉపవాసము ప్రారంభము :-

 

2-10-2021 శనివారం మొదలుపెట్టవలెను.

 

ద్వాదశ పారణము :-

 

3-10-2021 ఆదివారం ఉదయం 5.53 నుండి 9.52 మధ్యలో ఉపవాసము విడువవలెను.

 

ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అత్యంత విశేష ఫలితం ప్రసాదిస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *