Breaking News

కార్తీక పూర్ణిమ విశేషాలు

 

కార్తీక పౌర్ణమిని ‘’త్రిపుర పౌర్ణమి’’ అని ,’’దేవ దీపావళి ‘’అనీ పిలుస్తారు .తారకాసురిడి ముగ్గురుకోడుకులు త్రిపురాసురులని పిలువ బడతారు .పరమ శివుడు కార్తీక పున్నమి నాడు త్రిపురాసుర వధ చేశాడు .కనుక త్రిపుర పౌర్ణమి అనే పేరొచ్చింది .త్రిపురాసురులు లోక కంటకులై ఆకాశం లో త్రిపురాలను నిర్మిచారు .వారినీ,వారి పురాలను ఒకే ఒక్క బాణం తో శివుడు ధ్వంసం చేసి దేవతలకు సంప్రీతి కలిగించాడు .అందుకు దేవతలు తమ ఆనందాన్ని తెలియ జేయటానికి ఆకాశం లో దీపావళి పండుగ చేసుకొన్నారు .అందుకే దివ్య దీపావళి అనే పేరొచ్చింది .

 

కార్తీక పౌర్ణమి నాడే శ్రీ మహా విష్ణువు దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం దాల్చాడు .ఈ రోజే తులసికి మారురూపమైన బృందా దేవి జన్మించింది .కార్తికేయుని జన్మ తిదికూడా ఈ పౌర్ణమి యే.శ్రీకృష్ణుని ప్రియురాలు రాదా దేవి కి పరమ ప్రీతికరమైన రోజు కార్తీక పున్నమి .ఈ రోజుననే రాదా మాధవులు’’ రాస లీల’’నిర్వహించిన రోజు .ఇదే అయితే గొప్పేముంది -కృష్ణుడు రాధను అర్చించిన రోజుగా ఈ పౌర్ణమి చరిత్ర ప్రసిద్ధిపొందింది . కార్తీక పౌర్ణమి నాడు పితృ దేవతలను స్మరిం చటం అనాదిగా మనకు వస్తున్న ఆచారం కూడా .పూర్వకాలం లో శత్రువులను జయించ టానికి కార్తీక పూర్ణమి నాడు ‘’శాఖా మేధం ‘’అనే దాన్ని చేసే వారట .

 

పొర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటున్దికనుక ఈ మాసం కార్తీక మాసం అని పిలువ బడుతుంది అన్న విషయం అందరికి తెలిసిందే .కనుక ఈ రోజును ‘’మహా కార్తీకం ‘’అని అంటారు .ఈ పౌర్ణమినాడు భరణి నక్షత్రం ఉంటె ఇంకా విశేష ఫలం అని ,రోహిణి నక్షత్రం ఉంటె అనేక రెట్లు ఉత్తమ ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెప్పింది .కార్తీక పున్నమి నాడు చేసే దాన ధర్మాల ఫలితం పది యజ్ఞాలు చేసిన ఫలితం కన్నా అధికం .

 

కార్తీక పౌర్ణమి కి ముందు వచ్చే ఏకాదశిని ‘’ప్రబోదిని ఏకాదశి ‘’అంటారు .దీనితో చాతుర్మాస్య దీక్ష పూర్తీ అవుతుంది .నాలుగు నెలల నిద్ర తరువాత విష్ణు మూర్తి నిద్ర లేస్తాడు .ఈ ఏకాదశి రోజున అనేక ఉత్సవాలు ప్రారంభమై పౌర్ణమి నాటితో ముగుస్తాయి .పండరి పురం లో, పుష్కర తీర్ధం లో ఉత్సవాలను ఘనం గా నిర్వహిస్తారు .కార్తీక పూర్ణిమ నాడు తులసీ వివాహ వేడుకలను జరిపి ముగిస్తారు .పుష్కర తీర్ధం లో ఉన్న ఏకైక బ్రహ్మ దేవుని ఆలయం లో విశేషం గా ఉత్సవ నిర్వహణ ఉంటుంది .పుష్కర ఘాట్ లో పవిత్ర స్నానాలు చేస్తే సరాసరి మోక్ష ప్రాప్తి కలుగు తుందని విశ్వాసం .ఎక్కడెక్కడో ఉన్న సాదు సంతులు ఏకాదశికి ఇక్కడికి చేరి కార్తీక పున్నమి వరకు ఉండిపోతారు .పుష్కర ఉత్సవానికి రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు చేసి బ్రహ్మ దేవుని దర్శించి పునీతులై ముక్తి పొందుతారు .దాదాపు ఇరవై వేల ఒంటెలు ఈ ఉత్సవం లో పాల్గొనటం మరో విశేషం .అలాగే ఈ పౌర్ణమి రోజున గంగా యమునా మొదలైన పవిత్ర నదులలో స్నానాలు చేసి దైవ దర్శనం చేయటం అలవాటుగా ఉంది .

 

దేవతలకు ప్రత్యేకం గా ‘’అన్న కూటం ‘’అనే పదార్ధాన్ని తయారు చేసి నైవేద్యం పెట్టి ప్రసాదం గా అందజేస్తారు .అశ్విని నక్షత్రం నాడు పౌర్ణమి నాడు హింస చేయం అని ప్రతిజ్ఞలు తీసుకొంటారు .ఎక్కడా ఈ రోజుల్లో పశువద జరగదు .బంగారాన్ని దానం చేస్తారు .శివుడికి శివరాత్రి తర్వాత అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి .రాత్రికి దీపాలతో ఆలయాలు వింత శోభను సంత రించు కొంటాయి .మూడు వందల అరవై ,ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు .దీప తోరణం అని దీన్ని పిలుస్తారు .దీన్ని దర్శించటానికి భక్తులు విరగ బడి వస్తారు. చూసి పుల కింఛి పోతారు .ధ్వజ స్థంభాలకు ఆకాశదీపాల శోభ చెప్పనే అక్కరలేదు .నదులలో కాలువలలో అరటి దొప్ప లో అవునేటి దీపాలు వెలిగించి వదులుతారు .కన్నుల పండువుగా కనిపిస్తుంది .’’హర హర శంభో ‘’నినాదాలతో శివాలయాలు అపర కైలసాలుగా దర్శన మిస్తాయి .తమిళనాడు లోని అరుణాచలం కొండపై కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం వారం రోజులు వెలుగుతూనే ఉంటుంది .దీన్ని దర్శించటానికి లక్షలాది భక్తులు అక్కడికి చేరుకొంటారు .

 

హిందువులకే కాక జైనులకూ కార్తీక పున్నమి విశేషమైనదే .శత్రుం జయ కొండల పైన ఉన్న ’’పాలితాన ‘’ అనే జైన క్షేత్రానికి విశేషం గా ఈ రోజు జైనులు చేరుకొంటారు .దీనికి’’ శత్రుం జయ తీర్ధ యాత్ర ‘’ అని పేరు .216కిలో మీటర్ల దూరం కాలి నడకన నడిచి ఈ యాత్ర పూర్తీ చేసి జైనుల మొదటి తీర్ధంకరుడైన ‘’ఆది నాద ‘’ను దర్శించి తరిస్తారు . .జీవితం లో ఒక్క సారైనా శత్రుమ్జయ యాత్ర చేసి తీరుతారు .

 

శిక్కులకూ కార్తీక పౌర్ణమి విశేషమైనదే .ఈ నాడే గురునానక్ జయంతి కూడా .1469కార్తీక పౌర్ణమి నాడు సిక్కుల మతగురువు గురునానక్ జన్మించాడు .సిక్కులతో పాటు ‘’నానక్ పద హిందువులు ‘’కూడా ఈ ఉత్సవం లో పాల్గొంటారు .ఇన్ని విశేషాలు కార్తీక పౌర్ణమి లో ఉన్నాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *