Breaking News

‘అమరావతి’ స్వ‌రూపం ఇలా..

ap-capital

హైదరాబాద్‌, : నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’ సమగ్రాభివృద్ధి ముసాయిదాను ఏపీ సర్కారు సిద్ధం చేసింది. ‘ప్రజా రాజధాని’ పేరిట ముసాయిదా రూపంలో రాష్ట్ర మంత్రుల ముందు ఆవిష్కరించింది. నోడ్‌లుగా, కారిడార్‌లుగా అభివృద్ధిని వికేంద్రీకరించాలని నిర్ణయించింది. భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా ప్రణాళికను రచించింది. ఆ ముసాయిదాలోని వివరాలు ఇవి… రాజధాని నగర అభివృద్ధి ప్రాంతం (సీఆర్‌డీఏ)లోని విజయవాడ నగరం జనాభా ప్రస్తుతం పది లక్షలు. ఆ తర్వాత గుంటూరు నగరంలో ఐదు లక్షల మంది నివసిస్తున్నారు. తొమ్మిది మధ్యతరహా పట్టణాల్లో 50,000 నుంచి 4 లక్షల మంది వరకూ నివసిస్తున్నారు. 291 చిన్న పట్టణాల్లో 50 వేల మంది వరకూ జీవిస్తున్నారని… మొత్తంగా సీఆర్‌డీఏ పరిధిలో ప్రస్తుతం 58 లక్షల జనాభా ఉన్నట్లు తేల్చారు. ఈ జనాభా 2035 నాటికి 1.1 కోట్లకు, 2050 నాటికి 2 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. విజయవాడ, గన్నవరం, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు, తెనాలి, నూజివీడు, గుడివాడ, పొన్నూరు, సత్తెనపల్లి, నందిగామ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతాయని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

8 ప్రణాళిక ప్రాంతాలు
భవిష్యత్‌లో పెరగనున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని వేగవంతమైన అభివృద్ధి ప్రణాళికలపై ప్రభుత్వం దృష్టిసారించింది. రాజధాని నగరాన్ని 8 ప్రణాళికా ప్రాంతాలుగా విభజించింది. ప్రధాన రాజధానిని ‘మధ్య ప్రాంతం’గా పేర్కొన్నారు. మిగిలిన వాటిని… తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, నైరుతి, ఆగ్నేయ, ఈశాన్య ప్రాంతాలుగా విభజించింది.

ప్రతి ప్రాంతమూ ఒక్కో విధమైన అభివృద్ధి కార్యక్రమంతో, విభిన్నంగా విలసిల్లేలా ప్రణాళిక రూపొందించింది. విజయవాడ, తాడేపల్లి, నూజివీడు, గుడివాడ, గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి, నందిగామలను ‘నోడ్‌’లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రాజధాని నగరానికి ప్రస్తుతం రెండు ప్రధాన రహదారులు ఉన్నాయి. కోల్‌కతా నుంచి చెన్నై వెళ్లే 5వ నంబర్‌ జాతీయ రహదారి, హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నం పోర్టుకు వెళ్లే 9వ నంబర్‌ జాతీయ రహదారి! భవిష్యత్తులో పెరగనున్న వాహనాల తాకిడి, అవసరాలకు అనుగుణంగా ఈ రహదారులను విస్తరించాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. ప్రస్తుతం గన్నవరంలో దేశీయ విమానాశ్రయం ఉంది. రాజధానికోసం అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని… ఇప్పటికే 5000 ఎకరాలను అదనంగా సేకరించింది. మంగళగిరి సమీపంలో ఈ విమానాశ్రయం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. మచిలీపట్నం ఓడరేవు భవిష్యత్తులో లాజిస్టిక్‌ హబ్‌గా ఉంటుందని ఏపీ సర్కార్‌ పేర్కొంటోంది.

రైల్వేలకూ అభివృద్ధి ప్రణాళికలు
రాజధాని నగరంతోపాటు కొత్తరవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను రాజధాని నగరానికి చేరేలా లైన్లను ఆధునికీకరించాల్సిన అవసరముందని సర్కారు గుర్తించింది. ‘‘కృష్ణా నది మధ్యలో నందిగామ- సత్తెనపల్లి మధ్య అదనపు క్రాసింగ్‌, గుడివాడ-తెనాలి లైన్‌ను రవాణాకు ఉపయోగించాలి. దీనివల్ల రైల్‌ ట్రాఫిక్‌ను నియంత్రించ వచ్చు. రాజధాని నగరానికి చేరుకునేలా ప్రత్యేకంగా రైల్వే రీజనల్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సత్తెనపల్లి – నందిగామ- నూజివీడు-గుడివాడ-తెనాలి రైల్వే లైన్‌ను వృద్ధి చేయాలి. ఇందుకు కేంద్ర సహకారం తీసుకోవాలి’’ అని ముసాయిదాలో పేర్కొన్నారు. విశాఖ నుంచి విజయవాడ మీదుగా చెన్నై, విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు హైస్పీడ్‌ రైళ్లు నడవనున్నాయి. ప్రస్తుత రైల్‌ నెట్‌వర్క్‌కు అదనంగా కొత్త నెట్‌వర్క్‌ రూపకల్పన జరుగుతోంది. రాజధాని నగరాన్ని కలుపుతూ బెంగళూరుకు కూడా హైస్పీడ్‌ రైలు నడపాలన్న ప్రతిపాదన కూడా ఉంది. విమానాశ్రయం నుంచి హైస్పీడ్‌ రైలు నడపాలన్న మరో ప్రతిపాదన కూడా ఉంది. రవాణా కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్‌ ఫ్రెట్‌ కారిడార్‌ను నిర్మించాలన్న యోచన ఉంది. కోస్తా తీరం వెంబడి ‘డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌’ను ఏర్పాటు చేయాలన్న యోచన ఉంది. విశాఖ- గుడివాడ- తెనాలి-గుంటూరు, చెన్నై మధ్య, ఢిల్లీ నుంచి విజయవాడ వరకూ డెడికేటెట్‌ ఫ్రైట్‌ కారిడార్‌ ఉండాలన్న ప్రతిపాదనలూ ఉన్నాయి.

జల రవాణా
రోడ్లు, వాయు, రైలు రవాణా వ్యవస్థలతో పాటు .. అతి చౌకగా .. కాలుష్యం లేని మరో వ్యవస్థ జల రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ సర్కార్‌ భావించింది. బకింగ్‌ హమ్‌ కాలువను అంతర్గత జలరవాణాకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. కృష్ణా నదికి దక్షిణ, ఉత్తర దిశలుగా ఈ రవాణా వ్యవస్థ వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. బ్యారేజీ దిగువ ప్రాంతాలకూ ఈ జలరవాణాను వినియోగించుకోవాలని భావిస్తోంది. విజయవాడ-తెనాలి జల రవాణాకు అనువైనవిగా ఏపీ సర్కార్‌ భావిస్తోంది.

అభివృద్ధి కారిడార్‌లు
నందిగామ కారిడార్‌: ఫార్మా, బయోటెక్‌, ప్లాస్టిక్స్‌, ప్యాకింగ్‌ రంగాలు.
గుడివాడ కారిడార్‌: గ్రీన్‌ ఇండసీ్ట్రస్‌, అక్వా కల్చర్‌
గన్నవరం కారిడార్‌: ఐటీ, ఐటీ అనుబంధ, ఎలకా్ట్రనిక్స్‌,
హార్డ్‌వేర్‌, ఆటోమోటివ్‌, ఏరోస్పేస్‌
గుంటూరు కారిడార్‌: ఆహార తయారీ పరిశ్రమలు, కోల్డ్‌ చెయిన్‌,
టెక్స్‌టైల్‌, నాన్‌ మెటాలిక్‌ ఉత్పత్తులు.
తెనాలి కారిడార్‌: లాజిస్టిక్స్‌, టూరిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌
సత్తెనపల్లి కారిడార్‌: టూరిజం, నాలెడ్జ్‌ సెంటర్‌.
నూజివీడు కారిడార్‌: ఆగ్రో పరిశ్రమలు.
దారి… రహదారి…
రాజధానికి వచ్చే రహదారిలో ఎలాంటి ‘జాం’లు, ఇక్కట్లు లేకుండా ఏర్పాట్లు.
రాజధాని నగరం కేంద్ర ప్రాంతం నుంచి సమీపంలోని పట్టణాలన్నింటికీ కనెక్టివిటీ బాగుండేలా.. విశాలంగా, నాలుగు లైన్ల రహదారులు, అవసరమైనచోట ఫ్లైఓవర్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు.
రాజధాని నగరం చుట్టూ బీచ్‌ రోడ్‌.
నందిగామ, సత్తెనపల్లి, గుడివాడలను కలుపుతూ వలయాకారంలో ఎక్స్‌ప్రెస్‌ హైవే.
రాజధాని నగరానికి బైపాస్‌ రహదారి.
గుంటూరు, విజయవాడ, తాడేపల్లి, గుడివాడలకు ఒక బైపాస్‌ రహదారి.
సీఆర్‌డీఏ పరిధిలో సమీకృత రవాణా హబ్‌ల అభివృద్ధి.
ప్రస్తుతం ఉన్న రహదారులు, అంతర్గత రహదారుల అభివాద్ధి… ఔటర్‌ రీజనల్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే.
గుంటూరు – తెనాలి- గన్నవరం పట్టణాలను కలుపుతూ ఎక్స్‌ప్రెస్‌ హైవే.
మంగళగిరి నుంచి విజయవాడ బైపాస్‌ రహదారులను నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *