Breaking News

శ్రీవారి హుండీ…దోచుకున్నోళ్లకు దోచుకున్నంత…!

శ్రీవారి హుండీ…దోచుకున్నోళ్లకు దోచుకున్నంత…!
శ్రీకృష్ణ దేవరాయలు ఏడుపర్యాయాలు తిరుమలకు వచ్చి ని దర్శించుకున్నారు. వెలకట్టలేని ఆభరణాలను కానుకగా సమర్పించారు. ఆ అభరణాలేవీ ఇప్పుడు కనపించడం లేదు. అవేకాదు….ఎందరో రాజులు సమర్పించిన విలువైన కానుకలూ దశాబ్దాలు, శతాబ్దాల క్రితమే మాయమయ్యాయి. స్వామివారికి లభించిన కానుకల వివరాలు శాసనాల్లో మాత్రమే ఉన్నాయి. ఆయా కాలాల్లో ఆలయ పరిపాలనా బాధ్యతలు చూసినవారే ఆభరణాలను కాజేసి వుంటారనడంలో సందేహం ఉండదు. కొందరు రాజులు స్వామిపై భక్తితో కానుకలు సమర్పిస్తే….
స్వామి హుండీనీ ఆదాయ వనరుగా పరిగణించి కొల్లగొట్టినవారూ ఉన్నారు.

చరిత్ర పుటలు తిరగేస్తే…రాజులు, నవాబులు, ఆంగ్లేయులు, ఈస్ట్‌ ఇండియా కంపెనీ, పాలేగాళ్లు…ఇలా అనేకులు స్వామివారి సంపదను ‘కైంకర్యం’ చేసిన ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. బ్రిటీష్‌ హయాంలో చిత్తూరు జిల్లాలోతహశీల్దారుగానూ, ఆపై దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గానూ పనిచేసిన విఎన్‌ శ్రీనివాసరావు అనే అధికారి ‘తిరుపతి వేంకటేశ్వర – బాలాజీ’ అనే పేరుతో ఓ పుస్తకం రాశారు. 1949లో ప్రచురించిన ఈ పుస్తకంలోని విశేషాలను….1998లో గోపీకృష్ణ అనే రచయిత రాసిన ‘మన ఆలయాల చరిత్ర’ అనే పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకాన్ని టిటిడినే (పబ్లికేషన్‌ నెం.75) ముద్రించింది. కీ.శ. 1800 సంవత్సరం నుంచి తిరుమల చరిత్ర మొత్తం ఆంగ్లేయుల రికార్డుల్లో ఉంది. శ్రీనివాసరావు బ్రిటీష్‌ కాలంలో రెవెన్యూ, ఎండోమెంట్‌ శాఖల్లో పని చేయడం వల్ల ఆకాలం నాటి ఆంగ్లేయుల రికార్డులను పరిశీలించే అవకాశం లభించింది. వాటి ఆధారంగానే ఆయన ‘తిరుపతి వేంకటేశ్వర – బాలాజీ’ పుస్తకాన్ని రాశారు. ఇందులోని వివరాల మేరకు….

ఇప్పుడైతే ప్రజాస్వామిక వ్యవస్థలో, చట్టబద్ధంగా ఏర్పాటయిన టిటిడి నిర్వహణలోని శ్రీవారి ఆదాయ, వ్యయాలకు సంబంధించి అనేక ఆడిట్‌లు, తనిఖీలు ఉన్నాయిగానీ….ఒకప్పుడు ఇవేవీ ఉండేవి కావు. పాలకులు ఇష్టారాజ్యంగా తిరుమల ఆదాయాన్ని తరలించుకు పోయేవారు. శ్రీవారి భక్తులను దోచుకునేవారు. ఇది ఎంతగా వుండేదంటే….తిరుమల కొండ ఎక్కినవారు దిగాలంటే….24 దుగ్గాండ్లు చెల్లించాల్సివచ్చేదట. చెల్లించేదాకా కొండ దిగనిచ్చేవారు కాదట. బ్రాహ్మణులు, పేదలకు కొంత వెసులుబాటు ఉండేదట. కీ.శ.1801లో తిరుమల ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చాక….ఆ వెసులుబాటు కూడా లేకుండా…ప్రతి ఒక్కరి నుంచి 12 అణాలు వసూలు చేశారట. అంటే ఒకరకంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులపైన పన్ను వేసేవారన్నమాట.

శ్రీవారికి వచ్చే ఆదాయంలో ఖర్చుల కోసం కేటాయించే డబ్బులూ క్రమంగా తగ్గిపోతూ వచ్చాయట. ‘శ్రీవారి ఆలయ ఖర్చులకు యాదవరాజుల కాలంలో 100 శాతం ఇచ్చేవారు. విజయనగర చక్రవర్తులు 75 శాతం చేశారు. అందులోనూ శ్రీరంగరాయల కాలంలో 50 శాతం అయింది. మహ్మదీయుల కాలంలో 6 నుండి 7 శాతానికి తగ్గించారు. ఆ తరువాత ఆలయ కౌలుదార్లుగా వచ్చినవారు ఇంకా తగ్గించి….ఆదాయాన్ని సొంతానికి మిగలబెట్టుకోవడం ప్రారంభించారు’ అని పుస్తకంలో వివరించారు. అంటే….స్వామివారి ఆదాయాన్ని ఎంతగా తరలించుకుపోయారో అర్థం చేసుకోవచ్చు.

కీ.శ.1801లో చంద్రగిరిని పాలిస్తున్న అజీమ్‌ ఉల్‌ ఉమ్రా అనే నవాబు….31.07.1801న చేసుకున్న ఓ ఒప్పందంతో తిరుమల శ్రీవారి హుండీ ఆంగ్లేయుల ఆధీనంలోకి వెళ్లింది. ఆంగ్లేయుల సేనలు చంద్రగిరికి రక్షణ కల్పించినందుకు…ఏటా 9 లక్షల నగదు చెల్లించేలా గతంలో నవాబుగా మహ్మద్‌ఆలీ అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. ఆజీమ్‌ ఉల్‌ ఉమ్రా వచ్చిన తరువాత…
.’ఆదాయంలో తనకు ఒక భాగం చెల్లించి…మిగిలినది మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి’ అనేలా ఒప్పందం చేసుకున్నాడు. అప్పటి నుంచి శ్రీవారి హుండీపైన పెత్తనం ఆంగ్లేయులకు వెళ్లింది. ఇది నచ్చని….పాలేగాళ్లు దారికాచి, తిరుమలకు వచ్చే భక్తులను దోచుకునేవారట. దీంతో ఆంగ్లీయులే రహదారుల వెంబడి సైనికులను నియమించి భక్తులకు రక్షణ కల్పించారట.

కీ.శ. 1802లో రాజురామ్‌జోసో అనే వ్యక్తి తిరుమల ఆదాయాన్ని గుత్తగా తీసుకునేందుకు 65,000 నక్షత్ర పగోడీలకు టెండరు వేశారట. ఆశ్చర్యం ఏమంటే….అప్పటిదాకా ఆదాయం చాలా తక్కువగా చూపించేవారట. అంతకు మునుపు 5 సంవత్సరాల ఆదాయం మొత్తం కలిపినా 62,881 పగోడీలుగా చూపించారట. అలాంటిది కాంట్రాక్టరు ఒక ఏడాదికే 65,000 నక్షత్ర పగోడీలు ఇవ్వడానికి సిద్ధమయ్యారంటే…అంతకుముందు శ్రీవారి ఆదాయం ఎంతగా అక్రమంగా తరలిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు తెలుగు, తమిళ, కర్నాటక ప్రాంతాల తరువాత అత్యధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నది మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వారే. ఒకప్పుడు మరాఠీ రాజులు కూడా తిరుమలపై దండెత్తి దోచుకునే ప్రయత్నం చేశారు. కీ.శ.1740లో మహారాష్ట్ర యోధుడు రాఘోజీ ఈ ప్రాంతంపై దండయాత్ర చేశాడు. దామలచెరువులో తనను ఎదుర్కొన్న నవాబు దోస్త్‌ఆలీని చంపాడు. ఆ సమయంలోనే మరాఠా పీష్వా బాజీరావు కుటుంబాన్ని తిరుమల శ్రీవారి దర్శనానికి తీసుకొచ్చాడు. దోస్త్‌అలీ మరణం తరువాత ఈ ప్రాంతానికి నవాబు అయిన సఫ్దర్‌ అలీ శ్రీవారి ఆలయం నుంచి రూ.50 ఆ మరాఠీ పిష్వాకు ఇచ్చిపంపారట. ఆ కాలం నుంచే తిరుమలకు మరాఠీయుల రాకపోకలు ప్రారంభమయ్యాయట.

బ్రిటీష్‌ పాలకులు…1843లోనే తిరుమల ఆలయ పాలనను మహంతులకు అప్పగించారు. టిటిడి ఏర్పాటయ్యేదాకా శ్రీవారి ఆలయ నిర్వహణలో మహంతులు విశేషమైన పాత్ర పోషించినప్పటికీ…. పలువురు మహంతులపై ఆవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. న్యాయస్థానాల్లో శిక్షలనూ ఎదుర్కొన్నవారు ఉన్నారు. 1864లో రెండో శ్రీధర్మదాసు మహంతుగా నియమితులయ్యారు. ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో… ఆయన ఆస్తులపై రూ.2.25 లక్షలకుపైగా కోర్టు డిక్రీ ఇచ్చింది. 1880లో మహంతుగా నియమితులైన భగవాన్‌దాసు శ్రీవారి నిధులు రూ.15 లక్షలు దుర్వినియోగం చేసినందుకు కోర్టులో 3 సంవత్సరాల శిక్షపడింది. పైకోర్టుకు అప్పీలు చేసుకోగా శిక్ష 18 మాసాలకు తగ్గింది. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం పున: ప్రతిష్టపేరుతో, గతంలో దాని కింద రాజులు ఉంచిన విలువైన బంగారు నాణేలు, వజ్రాలు కాజేశారన్న ఆరోపణలూ ఆయనపైన వచ్చాయి. ఈయన తరువాత 1890 నుంచి 1894 దాకా శ్రీస్వామి మహావీర్‌దాస్‌ మహంతుగా ఉన్నారు. 1894 నుంచి 1900 దాకా పనిచేసిన శ్రీరామకిశోర్‌దాస్‌ రూ.50 వేలు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణలో ఉండగానే ఆయన హత్యకు గురయ్యారు. ఈయన తరువాత మహంతుగా బాధ్యతలు చేపట్టిన ప్రయాగదాస్‌జీకి మాత్రం విశేషమైన పేరు ప్రఖ్యాగతలు గడించారు. తిరుమల ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. అందరు మహంతులను విమర్శించిన కట్టమంచి రామలింగారెడ్డి ప్రయాగదాస్‌జీని మాత్రం పొగిడారట.

గమనిక : ఇదంతా తిరుమల, తిరుపతిలో లభించిన శాసనాల్లో లభించిన సమాచారమే.

రచయిత…ఇది మూలం శేఖర్

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా
ప్రత్యేక కధనం

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *