Breaking News

మా మిద్దె మీది కరివేప

మా మిద్దె మీది కరివేప
మిద్దె మీది సాగు లో భాగంగా మా ఇంటి టాప్ ఫ్లోర్ టెరస్ మీద ఒక కుండీలో కరివేప మొక్కను పెట్టాం. ఈ ఎండాకాలపు తాపానికి మిద్దెమీది మిగిలిన మొక్కలన్నీ వాడి వరుగైపోతుంటే ఆ ఒక్క కరివేప మొక్క మాత్రం మాకే కాదు ; అడపా దడపా ఇరుగు- పొరుగు వారికి కూడా వారి వంటింటి అవసరాలకు సరిపడా కరివేపాకులను ఇస్తున్నది.
మనల్ని ఎవరైనా తమ అవసరానికి వాడుకుని ఆ తరువాత ఖాతరు చేయకపోవడాన్ని కూరలో కరివేపాకులా తీసివేయటం అంటారు. తాలింపులో కూరలకు కరివేపాకులు చక్కని పరిమళం తెచ్చినప్పటికీ వాటిని ఎవ్వరూ తినరు. అన్నంలో కూర కలుపుకుని తినేటప్పుడు కరివేపాకుల్ని ఏరి పక్కన పడేస్తారు. అయితే కరివేప యొక్క విలువ తెలిసినవారెవరూ కరివేప ఆకులను ఏరి పారెయ్యరు. కొందరు కరివేపాకులలో కొద్దిగా సగ్గుబియ్యం చేర్చి నేతిలో వేయించి అచ్చంగా కరివేప కారప్పొడి తయారు చేసుకుంటారు. శనగపొడి, కందిపొడి తయారీలో వేయించిన కరివేపాకులు వేసుకుంటారు ఇంకొందరు. బెల్లంవేసి అచ్చంగా వేయించిన కరివేపాకుతో రోటి పచ్చడి చేసుకుంటారు మరికొందరు. కరివేప ఆకులు దట్టించి చేసే చికెన్ ఫ్రై, కరివేప పేస్ట్ తో చేసే మటన్ కర్రీ
అద్భుతంగా ఉంటాయి. ప్రత్యేకించి పులిహోర, పెరుగన్నం, ఆవడ, పకోడీలు, ఉప్మా, మిక్స్చర్ వంటి వంటకాలకూ, వంకాయ ఇగురు బజ్జీ, రోటి పచ్చళ్ళు వంటివాటికి ఘుమఘుమలాడే కరివేప ఆకులు ఇంపునూ, పరిమళాన్నీ తెస్తాయి.
సంస్కృతంలో కరివేపను కైడర్య అనీ కృష్ణ నింబ అనీ అంటారు. తమిళ భాషలో కరు వేప్పు, కరివేంబు అనీ అంటారు. మలయాళంలో కరివేప్పు అనీ, కన్నడంలో
కరిబేవు అనీ అంటారు. కరివేప అనే తెలుగు పేరుతో సహా దీని పేర్లన్నీ దీని నల్లని లేక ముదురు ఆకుపచ్చ ఆకులనుబట్టి వచ్చాయి. దీని ఆకులు వేపాకులంత చేదుగా ఉండవనే కావచ్చు హిందీలో దీనిని మీఠా నీమ్
( తియ్యటి వేప) అంటారు. ఆంగ్లంలో కరివేపాకుల్ని
కర్రీ లీవ్స్ ( Curry Leaves) అంటారు. నిమ్మ, నారింజ, బత్తాయి, దబ్బ వంటి చెట్ల లాగే కరివేప చెట్టు రూటేసీ
( Rutaceae) కుటుంబానికి చెందినదే. దీని శాస్త్రీయ నామం మర్రయా కీనిగీ ( Murraya koenigi). విఖ్యాత వృక్షశాస్త్రజ్ఞుడు జొహాన్ యాండ్రియాస్ మర్రే ( Johann Andreas Murray 1740- 1791) పేరిట దీనిని మర్రయా ( Murraya) అంటున్నారు. సుగంధ భరితమైన పూలు పూసే పూలవెలగ లేక చైనీస్ బాక్స్ ( Chinese Box) అనే పేరుగల పూలమొక్క ఇదే ప్రజాతికి చెందినదే.
దాని శాస్త్రీయ నామం మర్రయా పానిక్యులేటా ( Murraya paniculata).
కరివేప ఆకులలో కాల్షియం, ఫాస్ఫరస్, పీచు పదార్ధం, విటమిన్- ఎ, విటమిన్- సి పుష్కలంగా ఉన్నందున అవి ఆహారపరంగా విలువైనవి. కరివేప ఆకులను డిస్టిలేషన్ చేసి కర్రీ లీఫ్ ఆయిల్ అనే నూనె తయారుచేస్తారు. ఈ నూనెను సబ్బుల తయారీలో వినియోగిస్తారు. కరివేప చెట్టు వేళ్ళు, కాండం బెరడు, ఆకులు వైద్యపరంగా విలువైనవి. ఇవి శరీరపు కాకను
తగ్గించి చల్లబరుస్తాయి. జ్వరాలనూ, కడుపులోని క్రిములను పోగొట్టి, పొట్టలోని గాస్ ను వెడలించి, ఆకలి పుట్టిస్తాయి. నొప్పులు, వాపులు పోగొడతాయి. కుష్ఠు, ప్రూరిటస్, ల్యూకోడెర్మా వంటి మొండి చర్మవ్యాధులకు కరివేప దివ్యౌషధంగా పనిచేస్తుంది.
భోజనంలో ముందుగా కొద్ది అన్నంతో కరివేప కారం నెయ్యి వేసుకు తింటే కడుపు ఉబ్బరం, అగ్నిమాంద్యం, నోటి అరుచి తగ్గిపోయి ఆకలి పెరుగుతుంది. కరివేప పచ్చడి నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలను అరికడుతుంది. కరివేపాకు పచ్చడి వాంతులను, వాపులను పోగొడుతుంది. మూత్రపిండాల
( కిడ్నీ ల) వాపులు, నొప్పులను కరివేప వేళ్ళ రసం పోగొడుతుంది. కరివేప మాను చెక్క అరగదీసి రాస్తే ఒంటిమీది పొక్కులు తగ్గుతాయి. కరివేప పళ్ళు నల్లగా, రుచిగా ఉంటాయి. దాహాన్నీ, రక్తపైత్యాన్నీ అవి పోగొడతాయి.
ఇవండీ మనం తినకుండా తీసిపారేసే కరివేపాకులకూ, ఆ మొక్క ఇతర భాగాలకూ ఉన్న ఎన్నెన్నో ప్రయోజనాలు.
— మీ..రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *