Breaking News

కరోనా వైరస్ కి సురక్షా కవచం

కరోనా వైరస్ కి సురక్షా కవచం
pulse oximeter00 pulse oximeter01
ఈ చిట్టి పరికరం పేరు ఫింగర్ టిప్ పల్స్ ఆక్సిమీటర్ ( Fingertip Pulse Oximeter). రక్తంలో ఆక్సిజన్ ( ప్రాణవాయువు) యొక్క శాచ్యురేషన్ లెవెల్స్ తెలుసుకునేందుకు దీనిని ఉపయోగిస్తారు. ప్రతివారూ స్వయంగా తేలికగా దీనిని ఉపయోగించవచ్చు. అతి తేలికగా ఉండే కారణంగా ఎక్కడికైనా చేతికి తగిలించుకుని లేక జేబులో పెట్టుకుని దీనిని తీసుకెళ్ళవచ్చు. రెండు AAA సైజు అతిచిన్న బాటరీ సెల్ఫ్ అమరిస్తే ఇన్ఫ్రారెడ్ కిరణాల సాయంతో ఈ పరికరం పనిచేస్తుంది. ఈ పరికరం లోకి మన చేతి వేలుని గోరు పైకి ఉండేటట్లుగా జొనిపి, దాని మీద ఉన్న స్విచ్ నొక్కితే కాసేపట్లో మన రక్తంలో ఆక్సిజన్ లెవెల్ తో పాటు, పల్స్ రేట్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. మనం వేలును బయటికి తీసేసిన ఎనిమిది సెకండ్లలోపు మనం స్విచ్ నొక్కకుండానే పరికరం దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. మనం దీనిలోకి వేలు జొనిపిన సమయంలో ఆ వేలును గానీ ఇతర శరీర భాగాలనుగానీ కదపకుండా కుదిరికగా ఉంటే రిపోర్ట్ సరిగ్గా వస్తుంది.కరోనా వైరస్ కారణంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్ – 19 వ్యాధిలో వైరస్ ముందుగా ఊపిరితిత్తులపై దాడిచేసి, శ్వాసవ్యవస్థను దెబ్బ తీస్తుందని మనందరికీ తెలుసు. ఊపిరితిత్తులు పనిచేయక ఎందరో మృత్యువాత పడుతున్నారు. మన ఊపిరితిత్తుల పనితీరు మన రక్తంలో ఉన్న ప్రాణవాయువు ( ఆక్సిజన్) శాతం మీద ఆధారపడి ఉంటుంది. ప్రాణవాయువు శాతం 90 లేక అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే ఆ వ్యక్తి కి కోవిడ్ వ్యాధి సంక్రమించిందనీ లేక ఊపిరితిత్తులకు సంబంధించిన మరో వ్యాధి/ ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిందనీ గుర్తించి తగిన చికిత్స చేయించుకోవాలి. ఢిల్లీలో ప్రజలందరికీ ఈ ఆక్సిమీటర్లు ఉచితంగా/ తక్కువ ధరకు సబ్సిడీ పై పంచటం వల్ల ప్రతి ఒక్కరూ తమ రక్తంలోని ఆక్సిజన్ లెవెల్స్ ను ముందుగానే కనుగొని అవసరమైనవారు వైద్యశాలలకు వెళ్ళి సకాలంలో చికిత్స చేయించుకున్న కారణంగా అక్కడ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందట. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని ప్రకటించి పల్స్ ఆక్సిమీటర్ ను కరోనా వైరస్ కారణంగా ప్రబలుతున్న కోవిడ్-19 వ్యాధికి ఒక సురక్షా కవచమని కొనియాడారు. వ్యాధి లక్షణాలు లేనివారు, వ్యాధి తొలిదశలో ఉన్నవారు ఇంట్లోనే సురక్షితంగా ఉండి, తరచు రక్తంలోని ఆక్సిజన్ లెవెల్స్ ఈ ఆక్సిమీటర్ల ద్వారా స్వయంగా పరీక్షించుకుంటూ, లెవెల్స్ 90 శాతం కంటే తగ్గిపోయినట్లయితే తక్షణం చికిత్స చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆక్సిమీటర్లు ప్రముఖమైన మందుల షాపులన్నిట్లో లభిస్తాయి. ఇవి చాలమేరకు విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నవిగానే ఉంటాయి. అందుకని కొనే సమయంలో దిగుమతి చేసుకున్న నెల, సంవత్సరం ఒకసారి చూసి కొనుగోలు చేయటం మంచిది. నేను ఇటీవల Uphealthy Medical Devices, Chennai వారి జూన్/ 2020 లో దిగుమతి చేసుకోబడిన ఆక్సిమీటర్ ఒకటి కొనుగోలు చేశాను. దాని అట్టపెట్టెమీద గరిష్ఠ చిల్లర ధర ( MRP) అన్ని పన్నులూ కలుపుకుని Rs. 3,499/- అని ఉన్నప్పటికీ రూ. 1,600/- కే అమ్మటం కారణంగా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నదని అర్థమైంది. మిత్రులంతా ఈ తరహా ఆక్సిమీటర్లు కొని దగ్గర ఉంచుకుని ప్రతిరోజూ రక్తంలోని ఆక్సిజన్ లెవెల్స్ గమనిస్తూ, 90 శాతం కంటే తక్కువ ఉన్నట్లయితే వెంటనే తగు వైద్య చికిత్సలు చేయించటం మంచిదని గ్రహించాలి. మీలో చాలా మంది దగ్గర ఈ పాటికే ఆక్సిమీటర్లు ఉండే ఉండవచ్చు. అయినా అశ్రద్ధ కూడదు. ప్రాణం కంటే విలువైనదేదీ లేదు. సురక్షితంగా ఉండండి. ఇంట్లోనే ఉండండి.
Credit :

Ravindranath Muthevi

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *