Breaking News

వృక్ష ప్రపంచం — రావి చెట్టు

 

 

13055291_1008303345907063_2375411305807663274_n 13076585_1008303072573757_3274242108505566437_n 13091963_1008303235907074_545922882682976549_n 13100738_1008302935907104_1083094459617295252_n 13103539_1008302782573786_6634577589238304290_n

రావి చెట్టు భారతదేశపు సర్వసాధారణ వృక్షం. దీనిని హిందీ మరియు ఆంగ్ల భాషలలో ‘పీపల్’ అంటారు. హిందీలో దీన్ని ‘పిప్లీ’ అని కూడా అంటారు. మన గ్రామీణులు వీధి మొగసాలలలో రావి మొక్కల్ని నాటి, శ్రద్ధగా పెంచుతారు. హిందువులూ, బౌద్ధులూ దీనిని పూజనీయమైన వృక్షంగా భావిస్తారు. మన జానపద సాహిత్యం రావి చెట్టును స్త్రీ గానూ, మర్రి చెట్టుకు భార్యగానూ భావిస్తుంది. ఈ వృక్షం అత్తి లేక అంజీరు(అంజూర – Fig or Ficus) జాతికి చెందినందున దీనిని Holy Fig అనీ Sacred Fig అనీ అంటారు. అంజీరు, మేడి, మర్రి, జువ్వి మొదలైన చెట్ల లాగే రావి చెట్టు కూడా మోరేసీ (Moraceae) కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం Ficus religiosa. ఇది Fig జాతికి చెందినందున దీని శాస్త్రీయనామంలో Ficus అనీ, దేవస్థానాల వంటి మతపరంగా పవిత్రమైన ప్రదేశాలలో పెంచబడుతుంది కనుక religiosa అనీ ఏర్పడ్డది. రావిని సంస్కృతంలో ‘అశ్వత్థమ్’ అంటారు. ‘భగవద్గీత’ అశ్వత్థాన్ని అవ్యయ వృక్షమని పేర్కొంది. అవ్యయ వృక్షం అంటే ఎప్పటికీ నశించనిదని భావం. మర్రి చెట్టు లాగే ఇది కూడా మహా వృక్షంలా పెరుగుతుంది. మొలకెత్తడానికి వీలుగా ఇతర చెట్ల మీద ఏ కాస్త మట్టి పేరుకున్నా మర్రి లాగే పక్షుల రెట్టల ద్వారా వ్యాపించే దీని విత్తనాలు కూడా అక్కడ పడి మొలిచి, పెరుగుతాయి. ఇలా ఇతర వృక్షాల మీద పెరిగే మొక్కల్ని ఎపిఫైట్స్(Epiphytes) అంటారు. ఇలా పడి మొలిచిన రావి, మర్రి మొక్కలు చకచకా వేళ్ళూనుకుని, తమ తాళ్ళ వంటి వేళ్ళతో బలంగా పెరిగి, తాము పెరుగుతున్న ఆ వృక్షాలనే ఆక్రమించేస్తాయి. తాటి చెట్టు తొర్రలో పేరుకున్న మట్టిలో పిట్టల రెట్టల కారణంగా మొలుచుకొచ్చిన మర్రి చెట్టు ఆ తాటి చెట్టును పూర్తిగా ఆక్రమించి వేయడం మనం సర్వసాధారణంగా చూసే దృశ్యమే. భవనాల గోడల పగుళ్ళలో రావి, మర్రి మొక్కలు మొలిచి, గోడల్ని పగలగొట్టుకుని పెరుగుతూ ఉండడం కూడా మనం తరచు చూస్తుంటాం. మర్రి చెట్టుకు వచ్చినట్లు రావిచెట్టు కొమ్మలకు ఊడలు(Aerial Roots) రావు. అయితే ఒక్కోసారి సన్నని జడల వంటి వేళ్ళు రావి చెట్టు కాండానికి అంటుకునే కిందికి పెరుగుతూ ఉంటాయి. రావి ఆకులు లేతగా ఉన్నప్పుడు నున్నగా మెరుస్తూ, ఎర్రగా ఉంటాయి. ముదిరే కొద్దీ అవి ఆకుపచ్చగా మారి, ఈనెలు ప్రస్ఫుటంగా పెరిగి గరుకుగా తయారవుతాయి. రావి ఆకు హృదయాకారంలో ఉంటుంది. అయితే ఆకు శీర్షం (leaf apex) తోకలా పొడవుగా సాగి ఉంటుంది. సాగిన శీర్షం ఎంత పొడవు ఉంటుందో, దాదాపుగా ఆకు కాడ కూడా అంతే ఉంటుంది. ఆకులు కిందికి వేళ్ళాడుతూ కొద్దిపాటి గాలికి కూడా అటూ ఇటూ కదులుతూ సన్నని శబ్దం చేస్తాయి. ఆకులకుండే ఈ ప్రత్యేకమైన కదలికల కారణంగానే రావి చెట్టుకి సంస్కృతంలో ‘చలపత్ర వృక్షమ్’ అనే పేరుకూడా ఏర్పడింది. ఆకులు – ముఖ్యంగా ఎండిన చొక్కాకులు – చటచటమంటూ చేసే ఈ మర్మర ధ్వని (rustling) రావి చెట్టుకు మాత్రమే ప్రత్యేకం. రోజంతా కాయకష్టం చేసిన కర్షకులు సాయం సమయాల్లో రావి చెట్ల కింద పడుకుని ఈ మర్మర ధ్వని జోలపాడగా, ఆదమరచి నిదురించడం మన పల్లె సీమలలో సాధారణ దృశ్యం.

రావి కాయలు కొమ్మకూ, ఆకు కాడకూ మధ్య జతలు జతలుగా వస్తాయి. కాయలు అడ్డంగా అరంగుళం వ్యాసం కలిగి, లేతగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా మెత్తగా ఉండి, పండే కొద్దీ ఎర్రగా రక్తవర్ణానికి మారతాయి. ఆడ పూలు, మగ పూలు వేర్వేరుగా ఉంటాయి. మగ పూలకు మూడు వివర్ణమైన రేకులు (petals) ఉంటే, ఆడ పూలకు ఐదుంటాయి. మేడి, మర్రి పళ్ళలో లాగే ఎర్రటి రావి పండు విచ్చదీసి చూస్తే లోపల అసంఖ్యాకంగా ఉండే గింజల వంటివే అసలైన పళ్ళు. అయితే వీటిని విత్తులని వ్యవహరిస్తారు. తిన్నప్పుడు పళ్ళ సందుల్లో ఇరుక్కునే ఈ ‘విత్తుల’ ను Pips అంటారు. ఎర్రగా ఆకర్షణీయంగా, రుచిగా ఉండే రావి పళ్ళు పక్షుల్ని బాగా ఆకర్షిస్తాయి. అవి ఈ పళ్ళు తిన్నప్పుడు విత్తులు (పిప్స్) జీర్ణం కాక యథాతథంగా విసర్జించబడతాయి. అలా పక్షుల రెట్టల ద్వారా విత్తన వ్యాప్తి జరిగి, తగినంత తేమ లభించినప్పుడు అవి మొలకెత్తడం వల్ల రావిచెట్టు పునరుత్పత్తి చేసుకుంటుంది. రావి కొమ్మలు పాతిపెట్టినా బతుకుతాయి.

అవ్యయ వృక్షం
రావి చెట్టు అవ్యయ వృక్షమని ముందే చెప్పుకున్నాం. ఇక్కడ ‘అవ్యయ వృక్షం’ అంటే అసలు నశించని వృక్షమని కాక, మిగిలిన సామాన్య వృక్షాలతో పోల్చుకుంటే చాలా దీర్ఘకాలం జీవించే వృక్షమనే మనం అర్థం చేసుకోవాలి. క్రీ. పూ. ఆరవ శతాబ్దికి చెందిన గౌతమ బుద్ధుడు బుద్ధ గయలోని ఓ రావిచెట్టు కింద తపస్సు చేసి బోధ (జ్ఞానోదయం) పొందాడంటారు. అందుకే ఆ రావిచెట్టును అందరూ బోధి వృక్షం అంటారు. అదే బోధి వృక్షం నేటికీ గయలో అలాగే నిలిచి ఉందని కొందరి విశ్వాసం. అయితే మూల బోధి వృక్షపు శాఖను క్రీ. పూ. 288 లో ఇక్కడ తిరిగి నాటారని పలువురు నమ్ముతున్నారు. సమ్రాట్ అశోకుడి పాలనాకాలం (క్రీ.పూ. 268 – 232) లో ఆయన భార్య ‘తిష్య రక్ష’ (తిస్స రక్ఖ) ఈ వృక్షం మీద అశోకుడు చూపిస్తున్న శ్రద్ధా భక్తులకు అసూయచెంది, దీని కాండంలోకి విషపు ముళ్ళు నాటించి చంపించే ప్రయత్నం చేసిందట. పుష్యమిత్ర శుంగుడు క్రీ.పూ. రెండవ శతాబ్దిలోనూ, శశాంకుడు క్రీ. శ. 600 లోనూ ఈ వృక్షాన్ని ధ్వంసం చేసినా, ఇది కాలపరీక్షకు తట్టుకుని నిలబడడం విశేషం. ధ్వంసమైన ప్రతి సందర్భంలోనూ దాని ఒక కొమ్మను తిరిగి అక్కడే నాటుతున్న కారణంగా అది ఇన్ని శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నదని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. బౌద్ధ ధర్మ ప్రచారకులుగా మారిన అశోకుని కుమారుడు మహేంద్ర, కుమార్తె సంఘమిత్ర ధర్మ ప్రచారం కోసం సింహళం వెళ్ళినప్పుడు బుద్ధ గయలోని ఈ బోధి వృక్షం శాఖను అప్పటి సింహళ రాజధాని అనూరాధపురలో నాటారట. అదే బోధి వృక్షం అక్కడ నేటికీ అలాగే నిలిచి ఉందట. తాము పెంచుతున్న రావి చెట్టు సజీవంగా ఉన్నంతకాలమే తమ పాలన సాగుతుందనే విశ్వాసమొకటి సింహళ రాజవంశాలకు ఉన్న కారణంగా వారు ఆ వృక్షాన్ని శ్రద్ధగా కాపాడుకొనేవారట.
( ఈ విశ్వాసం కారణంగానే మూల ద్రావిడ భాషలో రావిచెట్టును ప్రభుత్వానికి సంకేత పదమైన ‘అరసు’లేక ‘అరస మరమ్’ అంటారు). గౌతమ బుద్ధుని ప్రథమ శిష్యుడైన ఆనందుడు గయలోని మహాబోధి వృక్షపు పండును శ్రావస్తిలోని జేతవనంలో పాతిపెట్టించాడట. అక్కడ మొలిచిన రావి మొక్క ఒక మహా వృక్షమై ఆనందుని పేరిట ఆనంద బోధివృక్షమని పిలువబడుతూ నేటికీ నిలిచి ఉండడం విశేషం. రావి చెట్టును బోధి వృక్షమని వ్యవహరిస్తున్న కారణంగానే దానికి ఆంగ్లంలో బో ట్రీ (Bo Tree) అనే మరో పేరు కూడా ఏర్పడింది.

రావి ప్రయోజనాలు

కరవు రోజుల్లో రావి కాయల్నీ, లేత చిగురుటాకుల్నీ ప్రజలు తింటారు. రావి ఆకులు చాలా బలవర్ధకమైన ఆహారం. వీటిలో 14 శాతం వరకూ ప్రోటీన్లు (మాంసకృత్తులు)ఉన్నాయి. రావి ఆకుల్లో గడ్డిజాతి మేతలలో కంటే మూడురెట్లు ఎక్కువ మాంసకృత్తులు ఉన్నాయి. పశువులకు, ప్రత్యేకించి ఏనుగులకు రావి ఆకులు అతి ఇష్టమైన మేత. నైట్రోజెన్, కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండే కారణంగా గొర్రెలూ, మేకలూ, పశువులకు రావి ఆకులు అత్యంత శ్రేష్ఠమైన మేతగా ఇటీవలి శాస్త్ర పరిశోధనలు నిర్ధారించాయి. రావిచెట్టు కాండం నుంచి స్రవించే జిగురును రబ్బర్ టైర్లకు పంక్చర్లు వేసేందుకు ఉపయోగిస్తారు. గట్టిపడిన ఈ జిగురును సీలింగ్ వాక్స్(Sealing Wax) గానూ ఉపయోగిస్తారు. ఈ స్రావం బాగా జిగురుగా ఉండే కారణంగా, చెట్ల కొమ్మలకు రాసి పిట్టల్ని పట్టుకునే బర్డ్ లైమ్ (bird lime) గా కూడా ఈ జిగురును ఉపయోగిస్తారు. రావి కలప అంతగా శ్రేష్ఠమైనది కాదు. దానిని ప్యాకింగు బాక్సులు, అగ్గి పెట్టెల తయారీలో ఉపయోగిస్తారు. బండి చక్రాల, కొయ్య గిన్నెల, స్పూన్ల తయారీలోనూ రావి కలపను వినియోగిస్తారు. మోదుగు, తుమ్మ, రేగు వంటి చెట్ల మీద పెరిగినట్లే రావి చెట్ల మీద కూడా షెల్లాక్ కీటకం (Tachardia lacca) పెరుగుతుంది. ఈ కీటకం ఉత్పత్తిచేసే రెసిన్ నే షెల్లాక్ (shellac) అంటారు. షెల్లాక్ విద్యుత్ పరిశ్రమలలో ఇన్సులేటర్ గానూ, సీలింగు మైనం, డ్రాయింగు ఇంకులు, వాటర్ కలర్స్ మొదలైనవాటి తయారీలోనూ వాడతారు.

వైద్యంలో రావి
రావిచెట్టు కాండం పై బెరడు కషాయం కడుపులోని అల్సర్లు, చర్మరోగాలకు మంచి మందు. ఈ కషాయం పొట్టలోని క్రిముల్ని కూడా నశింపజేస్తుంది. గనేరియా (gonorrhoea) నివారణకూ ఇది పనిచేస్తుంది. లేత రావి ఆకుల పసరు చర్మరోగాలకు పైపూతగా వాడతారు. లేత ఆకుల్ని మెత్తగా నూరి, గోధుమ పిండి లేక సిందూరంతో కలిపి రాస్తే వాపులూ, చర్మం పగుళ్ళూ నయమౌతాయి. లేత ఆకుల్ని కొన్ని ఇతర ద్రవ్యాలతో కలిపి నూరి, లోనికిస్తే గర్భస్రావం అవుతుంది. రావి విత్తులు విరేచనకారిగా పనిచేస్తాయి. బహిష్టు సమయంలో మూడు రోజులు రావి విత్తుల పొడిని స్త్రీలు లోనికి తీసుకుంటే అది గర్భధారణను నిరోధిస్తుంది. లేత రావి ఆకులు నమిలితే నోటిలోని పుళ్ళు నయమౌతాయి.రావి చెట్టు వేళ్ళకు కూడా ఎన్నో వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి. లేత రావి కాయలు పంచదారతో కలిపి తీసుకుంటే పురుషుల సామర్థ్యం రెట్టింపు అవుతుందని కొన్ని ఆటవిక జాతుల్లో విశ్వాసం.

రావి చెట్టు మన తెలుగు ప్రాంతంలో అతి సర్వ సామాన్య వృక్షమనే విషయం రావి మీదుగా ఏర్పడిన రావిపూడి, రావిపాడు, రావినూతుల (రావినూతల), రావిర్యాల (రావిరాల), రావూరు, చినరావూరు, పెదరావూరు, సంత రావూరు, దైవాల రావూరు, కొప్పురావూరు, రావి కమతం, రావి వలస, రావి చెర్ల మొదలైన అసంఖ్యాకమైన గ్రామనామాలనుబట్టి తేలికగానే గ్రహించగలం. అన్నట్లు నూట ఏడు ఏళ్ళ క్రితం 1909 లో ఏర్పడిన తెనాలి మునిసిపాలిటీలో అప్పట్నుంచే ఒక వార్డుగా కలిసిపోయిన మా చినరావూరు (రావి+ ఊరు= రావూరు) గ్రామనామం కూడా రావి చెట్టు మీదుగా ఏర్పడ్డదే. చినరావూరు నడిబొడ్డున నేటికీ ఒక పెద్ద రావి చెట్టు ఠీవిగా నిలిచి ఉంటుంది. దాని వయస్సు కొన్ని వందల ఏళ్ళు ఉంటుందంటారు. ఆ మహా వృక్షం ఒకసారి పిడుగు పాటుకు, మరోసారి తప్పతాగిన కొందరు దుండగులు దాని తొర్రలో పెట్రోలు పోసి నిప్పు పెట్టిన సందర్భంగానూ, కొంత ధ్వంసమైనా తిరిగి కోలుకుంది. ఇదండీ రావి చెట్టు కథ.. కమామిషూ ..

— మీ… రవీంద్రనాథ్.98491 31029.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *