Breaking News

ఏ దేశం వెళ్ళినా… ఏ స్థాయిలో ఉన్నా మన ఆలోచనలకు బీజం వేసేది మాతృ భాషలోనే

ఏ దేశం వెళ్ళినా… ఏ స్థాయిలో ఉన్నా మన ఆలోచనలకు

బీజం వేసేది మాతృ భాషలోనే

  • తెలుగు భాష ప్రమాదకర స్థితికి చేరుతోంది… యునెస్కోవాళ్లే హెచ్చరించారు
  • భావ దారిద్ర్యం… భావ దాస్యంతో ఆంగ్ల మాద్యమం అంటున్నారు
  • కేంద్రం ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి గొంతులో ఏదో అడ్డంపడ్డట్టు ఉంది
  • మన భాషలను… మన నదులను కాపాడుకోవాలి
  • ఆ దిశగా  పవన్ కల్యాణ్ మంచి ఆలోచనతో ‘మన నుడి – మన నది’కి శ్రీకారం చుట్టారు
  • వెబినార్ లో ప్రముఖ సంపాదకులు  ఎమ్.వి.ఆర్.శాస్త్రి 

తెలుగు భాషలో చదివితే అవకాశాలు రావు… ఆంగ్లం వస్తేనే ఉద్యోగాలు అనే భ్రమను కల్పించడం ద్వారా ఆంగ్ల మాద్యమాన్ని తీసుకువస్తున్నారు అని ప్రముఖ సంపాదకులు  ఎమ్.వి.ఆర్.శాస్త్రి  అభిప్రాయపడ్డారు. తెలుగులో చదివితే భవిష్యత్ ఉండదు అని చెప్పడం భావ్యం కాదు అన్నారు. పాలన వ్యవస్థలో, చట్ట సభల్లో, న్యాయస్థానాల్లో ఉత్తరప్రత్యుత్తరాలు…. ఉత్తర్వులు… కార్యకలాపాలు అధికార భాషలోనే సాగిస్తే తెలుగులో చదువుకున్నవారికి అవకాశాలు వస్తాయి అని తెలిపారు. ఆ దిశగా పాలకులు చర్యలు తీసుకోవాలన్నారు. అధికార భాషలోనే ప్రభుత్వ కార్యకలాపాలు నడవాలని చట్టాలు ఉన్నా అమలుకావడం లేదని… వాటిని అమలుపరచాలని యువత ఉద్యమించాలని సూచించారు. అధికార  భాషా సంఘం ఉన్నా పనీపాటా లేకుండా ఉందని తప్పుబట్టారు. జనసేన పార్టీ చేపట్టిన ‘మన నుడి – మన నది’ కార్యక్రమానికి సంబంధించిన వెబినార్ లో  ఎమ్.వి.ఆర్.శాస్త్రి  ఉపన్యసించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శి (పర్యావరణం)  బొలిశెట్టి సత్య  సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా  ఎమ్.వి.ఆర్.శాస్త్రి  మాట్లాడుతూ “మానవ నాగరికత నదుల వెంబడి మొదలైంది. ఇప్పుడు ఆ నదులు చిక్కిపోవడమో, కలుషితం కావడమో జరుగుతోంది. అదే విధంగా మనిషి మనిషిగా బతికేందుకు భాష ప్రధానం. మన దేశంలో 42 భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయి అని యునెస్కో కొన్ని దశాబ్దాల కిందటే ఓ నివేదిక ద్వారా వెల్లడించింది. ఇలా నదులు, భాషలు ప్రమాదంలో ఉంటే వాటి గురించి పట్టించుకొనే నాయకులు, పార్టీలు లేకుండాపోయాయి. వీటిని గురించి మాట్లాడి, వాటిపై చైతన్యం కలిగించి ఒక కార్యక్రమంగా చేపట్టిన నాయకుడు శ్రీ పవన్ కల్యాణ్ గారు. అదృష్టవశాత్తు బాధ్యత కలిగిన నాయకుడు ఉండటం సంతోషకరం. దేశం గురించి, దీర్ఘకాలిక అవసరాల గురించి పట్టించుకొంటున్నారు. జనసేన చేపట్టిన ‘మన నుడి – మన నది’ అనే కార్యక్రమంలో ఇంతమంది యువత హాజరు కావడం ఆనందించదగ్గ పరిణామం.

నదుల వెంటే నాగరికత ఉంది. చరిత్రలో నైలు నది నాగరికత, మెసపుటోమియా నాగరికత, సింధు నాగరికత… ఇలా చెబుతారు. వీటన్నింటికంటే పురాతనమైన నది సరస్వతి నది. ఆ నది వెంబడి సరస్వతి నది నాగరికత ఉంది. ఋగ్వేదంలో సరస్వతి నది ప్రస్తావన ప్రముఖంగా ఉంది. హిమాలయాల్లో పుట్టింది. అది కాలక్రమాన అంతరించింది. నదితోపాటే నాగరికత పోయింది. అంటే నదులతోపాటే క్రమంగా మన నాగరికత కూడా అంతరిస్తుంది. కాబట్టి నదులను కాపాడుకోవాలి. వాటర్ మ్యాన్  రాజేంద్ర సింగ్  రాజస్థాన్ లో 11 నదులను పునరుజ్జీవింప చేశారు. నది అనేది మనల్ని కన్న తల్లిలా ఆదుకొంటుంది. ఋగ్వేదంలో నదీ సూక్తం ఉంది. నదినీ, జలాలను పూజించే సంస్కృతి మనది. నదులు కలుషితం అవుతున్నాయి. గంగా నది నుంచి అన్నీ కూడా కలుషితం కావడం, క్రమంగా చిక్కిపోవడం చూస్తున్నాం. మూసీ నది అనంతగిరిలో పుట్టి కృష్ణా జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణాలో కలిసేది. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ నగర నీటి అవసరాలను తీర్చేది. 1600 హెక్టార్ల విస్తీర్ణం ఉండేది. ఇప్పుడు కుచించిపోయి, వ్యర్థాలు అందులోకి చేరుతున్నాయి. నగరం పేరు, నది పేరు, చెరువు పేరు మారినా అన్నిటి పరిస్థితి అదే. ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నివేదికలో రాష్ట్రంలో నదులు ‘సి’ కేటగిరీలో ఉన్నాయి. అంటే ఆ జలాలు నేరుగా తాగడానికి పనికి రాని స్థాయిలో ఉన్నాయి అని. నదుల కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. శ్రీ రాజేంద్ర సింగ్ లాంటి పర్యావరణవేత్తలు ఎంతో ప్రయత్నిస్తున్నారు.  పవన్ కల్యాణ్  ఎంతో బాధ్యతగా ‘మన నుడి – మన నది’ చేపట్టారు.

  • భాష లేకపోతే సంస్కృతి పోతుంది

1961నాటి లెక్కల ప్రకారం మన దేశంలో 1651 భాషలు ఉన్నాయి. యునెస్కోవాళ్లు మన దేశంలో 42 భాషలు అంతరించేపోయే స్థితిలో ఉన్నాయి అని చెప్పారు. ఇందిరా గాంధీ ప్రభుత్వం స్పందించలేదు. 8వ షెడ్యూల్ లో 22 భాషలనే గుర్తించారు. ఆ పరిధిలోకి రానివి మరో 100 భాషలు ఉన్నాయి అని తేల్చారు. భాష లేకపోతే సంస్కృతి లేదు. కొన్నేళ్ళ కిందట గణేశ్ శంకర్ దేవి అనే రాజస్థానీయుడు చేసిన ఒక సర్వే ప్రకారం మన దేశంలో 780 భాషలు ఉన్నాయి. ఇందులో 600 భాషలు కొన ప్రాణంతో ఉన్నట్లు గణేశ్ శంకర్ దేవి గుర్తించారు.

తెలుగుతో ఉపయోగం లేదు… ఇంగ్లిష్ మీడియంలో చదివితేనే ఉద్యోగాలు వస్తాయి అని ఆ మీడియం చెబుతున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో మెకాలే అనే ఆంగ్లేయుడు చెప్పిన విధానం. మాతృ భాషలో బోధిస్తేనే అర్థం అవుతుంది. మన పెద్దల నుంచి ఉన్న జ్ఞానం మనకు అందుతుంది. మెకాలే ఇందుకు భిన్నం తమ అవసరాలకు తగ్గ ఉద్యోగాలు చేసేవారికి కావల్సిన చదువు ప్రతిపాదించాడు. ఆ భావ దాస్యం కలిగి, భావ దారిద్ర్యం ఉన్న నాయకులే ఇంగ్లిష్ మీడియం అంటున్నారు. తెలుగులో చదవడం నామోషీ అనే భావన కల్పించారు. అమెరికా వెళ్ళినా, మైక్రో సాఫ్ట్ లో పెద్ద ఉద్యోగం చేసినా ఎదుటివారికి మనం ఏదైనా చెప్పాలి అంటే ముందుగా మాతృభాషలోనే ఆలోచన చేస్తాం. అప్పుడే సరిగా మన భావన చేరుతుంది. ఏ దేశం వెళ్ళినా, ఏ స్థాయిలో ఉన్నా మన ఆలోచనకు బీజం మాతృభాషలోనే పడుతుంది. జపాన్, కొరియా, చైనావాళ్ళు ఇంగ్లిష్ భాషను పక్కనపెట్టి ముందుకు వెళ్లారు.

  • కోర్టులతో మొట్టికాయలు వేయించుకున్నా

 నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో ప్రాథమిక విద్య తప్పనిసరిగా మాతృభాషలోనే సాగించాలని చెబుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఆంగ్ల మాద్యమం అంటున్నారు. కేంద్రం మాతృభాష అంటే రాష్ట్ర ప్రభుత్వానికి గొంతులో అడ్డంపడ్డట్టు అనిపిస్తోంది. ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు, సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. అయినా అదే మొండితనం చూపుతోంది. యునెస్కోవాళ్లు తెలుగు ప్రమాదకర స్థితిలో ఉంది అని చెబుతున్నారు. కోట్లమంది రెండు రాష్ట్రాల్లో ఉన్నాం ఎందుకు ఇబ్బంది అంటున్నారు. భాషతో ఏముంది అనుకోవద్దు. మాతృభాష దూరమైతే చాలా నష్టపోతాము. భాష ద్వారానే ప్రపంచాన్ని చూస్తాం. భాష చచ్చిపోతే దానితో ముడిపడ్డ జ్ఞానం చచ్చిపోతుంది. భాషపై భయభక్తులు ఉండాలి. జనసేన పార్టీ భాష, నదులపై ఎంతో శ్రద్ధ చూపిస్తోంది. యువత ఈ అంశంపై దృష్టి ఉంచాలి” అన్నారు. శ్రీ బొలిశెట్టి సత్య మాట్లాడుతూ “మన నుడి మన నది’ కార్యక్రమంపై శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ అంశంపై పార్టీ ద్వారా సెమినార్లు నిర్వహిస్తాం” అన్నారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *