Breaking News

“కోడిగుడ్డు”మీద “ఈకలు”

“కోడిగుడ్డు”మీద “ఈకలు”
………………………………
ప్రపంచలోని చండప్రచండ, అతి భయంకర మేధావులంతా నిన్నఅర్థరాత్రి 12గంటల ముప్పైమూడు నిమిషాల నుంచి ఒంటిగంటా పన్నెండు నిమిషాల మధ్య విజయవాడలోని ఎనికేపాడు స్మశానవాటికలో సమావేశమయ్యారు. ఎర్నాకులం, తూతుక్కూడి, ఉగాండా, జెకోస్లేవియా, అల్జీరియా, జకార్తా, నైజీరియా, జైసల్మేర్, ఖరగ్ పూర్, కాట్మండూ నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు..
అప్పటి దాకా బాగా కాలిపోయి ఆరిపోయిన శవం తాలూకా చితిమంటల పక్కనే తాటాకులు, దానిపైన దురదగుంటాకులు పర్చుకుని కూర్చున్నారు. శవాలను కాల్చిన బొగ్గుల మీద వేడి చేసిన ‘టీ’ తాగుతూ, ఆ బొగ్గుల మీదే ‘బూడిద’గుమ్మడికాయ వడియాలను వేయించుకు తింటూ సమావేశం ప్రారంభించారు. 
ఇందులో పలు కీలకాంశాలపై చర్చించారు..అందులో ప్రధానంగా చేసిన డిమాండ్లు

1.ఖైదీ సినిమాలో చిరంజీవి పోలీస్ స్టేషన్ లో ఫర్నిచర్ ధ్వంసం చేసి పోలీసులపై దాడి చేసి పారిపోయినా ఇప్పటివరకూ ఎందుకు కేసు నమోదు చేయలేదు..????

2.మళ్లీ అదే చిరంజీవి ఖైదీనంబర్ 150పేరుతో వచ్చి వందమందికి పైగా చంపి శవాల గుట్టమీద కూర్చుని ఉన్న దృశ్యాలు వీవి వినాయక్ కెమేరాలో స్పష్టంగా రికార్డయినప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు..?

3. ఏ పాపం చేయని నహపాలుడు అతని సైన్యాన్ని, డెమోస్త్రీస్ అతని సైన్యాన్ని అన్యాయంగా చంపిన శాతకర్నిపై ఎందుకు కేసు పెట్టలేదు. సేనాపతిని అతికిరాతకంగా చంపి నీళ్లల్లోంచి పొడవాటి బల్లెంతో పైకి లేపుతుంటే… అంతసేపు యుద్ధం జరుగుతుంటే పోలీసులు ఎందుకు వెళ్లలేదు..డయల్ 100నంబర్ కు 100మందికి పైగా కాల్ చేసి సమాచారం ఇచ్చినా ఎందుకు స్పందించలేదు..?
4.బాహుబలిని చంపిన కట్టప్పని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు..అలాగే భల్లాలదేవ ని మంటల్లో వేసి తగులబెట్టిన చిన్న బాహుబలిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?
4.సింహద్రి సినిమాలో కేరళలో పట్టపగలు అందరూ చూస్తుండగా జూనియర్ ఎన్టీఆర్…రౌడీషీటర్ రాహుల్ దేవ్ ను శూలానికి గుచ్చి చంపినా ఇంతవరూ అరెస్ట్ చేయలేదు?

5.ఆహుతి సినిమాలోజీవితను రాజశేఖర్ రేప్ చేసినా ఇప్పటివరకూ పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు..?

6.పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో బాలకృష్ణ తొడకొట్టి పల్నాడు ఎక్స్ ప్రెస్ ను పట్టాలపై నిలిపివేసి వెనక్కు పంపినందుకు రైల్వే పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు..????

7.శివ సినిమాలో అత్యంత దారుణంగా భవానీని చంపిన నాగార్జునను ఎందుకు జైలుకు పంపలేదు????

8.పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ తో సహా అనేకమందిని పిట్టల్నికాల్చినట్టు కాల్చేసిన మహేష్ బాబును ఎందుకు పోలీసులు ఉపేక్షిస్తున్నారు. ఆయన పోలీస్ అయినంత మాత్రాన అంతమందిని చంపే హక్కు ఎవరిచ్చారు..???

9.అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ కు గంటసేపు తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ ను అద్దెకిచ్చింది ఎవరు? ఆయన నెగ్గడానికి తగ్గడానికి రైల్వేస్టేషన్ ను వాడుకుంటుంటే రైల్వే అధికారులు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు..???

ఇంతమంది ఇన్ని దారుణాలు చేస్తుంటే పోలీసులు, ప్రభుత్వాలు ఏంచేస్తున్నట్టు..రక్తం లేక జనాలు రోజూ చనిపోతుంటే వీళ్లంతా రక్తపాతం సృష్టించి రక్తాన్ని ఏరులై పారిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇందుగాను “రక్తపాతనియంత్రణా” చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. పోలీసులు, ప్రభుత్వాల నిర్లక్ష్యవైఖరికి
నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలు ఎగురవేయాలని, నిరాహార దీక్షలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విజయవాడ- బందరురోడ్డులోని సబ్ కలెక్టరేట్ ఎదురుగా మంగళవారం అర్థరాత్రి ధర్నాచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమాశం జరుగుతుండగానే మేధావులందరికీ మంచినీళ్లు అందించడానికి వచ్చిన కుర్రాడుకి ఒళ్లుమండి మేధావుల సంఘం నేతజుట్టు పట్టుకుని నాలుగుసార్లు నేలకేసి బాదాడు.. దరిద్రులారా అదంతా సినిమారా…పనికొచ్చే విషయాలపై చర్చించండిరా పిచ్చినాకొడకల్లారా.. కోడిగుడ్డుమీద ఈకలు పీకుతారెందుకురా.. ఏమిరా మీ వల్ల సమాజానికి ఉపయోగం అంటూ అంటూ వెళ్లిపోయాడు..

తెలుగు, ఇంగ్లిష్, మళయళం, జర్మన్, చైనీస్, ఫ్రెంచ్ భాషల్లో ఎవరికి కావల్సిన భాషలో వాళ్లు ఆ తిట్లను తర్జుమా చేసుకుని అర్థం చేసుకున్నారు. మంచినీళ్లు తెచ్చేవాడే అయినా సరే మంచివిషయం చెప్పాడని అదంతా సినిమా మాత్రమేనని అక్కడ నిజంగా హత్యలు జరగలేదని తేలింది కాబట్టి ధర్నాలు,ఆందోళనలు విరమిస్తున్నట్టుగా ప్రకటించాడు..ప్రపంచ తెలివిగల వారి సంఘం అధ్యక్షుడు ఎర్రగడ్డ పిచ్చేశ్వరరావు…

(డిక్లరేషన్- ఇందుమూలముగా యావన్మందికి తెలియబర్చునదేమనగా.. ఇది కేవలం సరదాకి మాత్రమేననియున్ను, ఎవరి ఉద్దేశించి కాదని, ఇందులో ఏ పాత్ర ఎవరిదీ కాదని, ఎవరూ కోడిగుడ్డు మీద ఈకలు పీకొద్దని విజ్ఞప్తి… అశోక్ వేములపల్లి (పాతదే కొత్తగా పెట్టా అంతే)

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *