Breaking News

నిక్కర్ కి ‘ముప్పావలా’… ప్యాంట్ కి ‘రూపాయి”పావలా’

నిక్కర్ కి ‘ముప్పావలా’… ప్యాంట్ కి ‘రూపాయి”పావలా’
మన చిన్నప్పుడు జరిగిన కొన్ని ఘటనలు బాగుంటాయి..ఎన్నేళ్లు గడిచినా మర్చిపోలేనంతగా గుర్తుండిపోతాయి.. కొన్ని ఘటనలు బాధగా ఉంటాయి..మర్చిపోదామన్నా మరుపురాని విధంగా వెంటాడుతుంటాయి..అలాంటిదే ఇది..

24ఏళ్ల క్రితం సందర్భం ఇది.. మా ఊరు ‘చినఎరుకపాడు’ నుంచి గుడివాడకు రావాలంటే అప్పట్లో ‘కొడాలి అండ్ సన్స్’ పేరుతో ఐదోనంబర్ సిటీ బస్సులు నడిచేవి..ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తండ్రి కొడాలి అర్ఝునరావు ఈ బస్సులను నడిపేవారు..ఈ బస్సులతో పాటు విఘ్నేశ్వర, ఎస్ఎస్ఆర్పీ బస్సులు నడిచేవి.. మా రూట్లో ఆర్టీసీ బస్సులు ఒకటో అరా ఎప్పుడో వచ్చేవి.. మా ఊరు నుంచి గుడివాడకు మూడుకిలోమీటర్లు.. ఇందుగాను బస్సు చార్జీ పెద్దవాళ్లకు ‘రూపాయిపావలా’..పిల్లలకు ‘ముప్పావలా’.. గంగాధరపురం ప్రభుత్వ పాఠశాలలో ఏడోతరగతి పూర్తయిన తర్వాత గుడివాడ ఎస్ జీఆర్కే ఆర్కే హైస్కూుల్(టౌన్ హైస్కూల్-ఎయిడెడ్ ) లో రికమండేషన్ చేయించుకుని మరీ ఎనిమిదో తరగతి చేరాను..మామూలుగా అయితే గంగాధరపురానికి నడిచుకుంటూ వెళ్లేవాళ్లం.. కానీ గుడివాడ వెళ్లాలి కాబట్టి బస్సు తప్పనిసరిగా ఎక్కాల్సి వచ్చేది..

ఏడో తరగతి వరకూ మేము నిక్కర్ల మీదే తిరిగే వాళ్లం..ఇప్పుడు హైస్కూల్ కు వచ్చాం కదా ‘ప్యాంట్’ లలోకి మారాం.. అంటే పెద్దోళ్లమయ్యామన్నమాట.. ‘ప్యాంట్’ వేసుకుని అందరిముందూ తెగ ‘ఫోజు’లు కొట్టేవోడ్ని. మా స్కూల్ యూనిఫార్మ్ బ్లూ ‘ప్యాంట్, వైట్ కలర్ షర్ట్ అన్నమాట.అందుకే బ్లూ కలర్ ప్యాంట్ అందులోనూ అప్పటి ‘బ్యాగీ’ స్టైల్లో గుడివాడ ప్రభుత్వాసుపత్రి రోడ్డులో ఉన్న రాము టైలర్స్ దగ్గర జతకు యాభైరూపాయలిచ్చి కుట్టించాను. ఇంటా బయటా ఎక్కడ చూసినా ప్యాంట్ తో తిరుగుతూ అందరూ నన్ను గమనించి అబ్బో ‘సూపర్’ అనుకోవాలనేది నా ఫీలింగ్.. అందుకే అడిగినా అడగకపోయినా అందరికీ ప్యాంట్ చూపించి ఎలా ఉందనేవాడ్ని.. కొంతమంది తిట్టేవాళ్లు..మరికొంతమంది పొగిడేవాళ్లు..అప్పట్లో అదొకఆనందం..అదొక అమాయకత్వం..అదొక కల్మషం లేని చిన్నతనం..

అయితే నా ‘ప్యాంట్’ ఆనందానికి కొడాలి అండ్ సన్స్ బస్సు అడ్డుతగిలింది. ఎందుకంటే ప్యాంట్ వేసుకుని బస్సు ఎక్కితే పెద్దోళ్ల చార్జ్ రూపాయి ‘పావలా’ వసూలు చేసేవాడు కండక్టర్.. హాఫ్ టికెట్ కావాలంటే నిక్కర్ వేసుకోమని సలహా ఇచ్చాడు ఆ కండక్టర్.. అందుకే నా ఉత్సాహాన్ని ‘ఉఫ్’ మని ఊదేసి.. ప్యాంట్ ని మడిచి ఇంట్లో పెట్టి మళ్లీ పాత నిక్కర్ వేసుకుని స్కూల్ కి వెళ్లేవాడిని.. పొద్దున్నే స్కూుల్ కి వెళ్తే ట్యూషన్ పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చేది రాత్రి తొమ్మిది తర్వాతే..అందువల్ల ఇంటికి వచ్చిన తర్వాత ప్యాంటేసుకుని పాటలు పాడుకోవడం కుదిరేది కాదు..

అలా నిక్కర్ తో నీరసంగా రోజులు చప్పగా సాగిపోతున్న రోజుల్లో ఒక రోజు నేను వెళ్తున్న ‘కొడాలి అండ్ సన్స్’ బస్సులో ‘రాజేంద్రప్రసాద్’ సినిమా ఏప్రిల్ ఒకటి విడుదల లో ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అంటూ పాడైపోయిన టేప్ రికార్డర్లో పెద్ద సౌండ్ తో పాట వస్తోంది. ఆ పాట విన్న నాకు ఒక గొప్ప ‘ఐడియా’ వచ్చేసింది. ఆ ఐడియానా నాలో మళ్లీ ప్యాంట్ ఆశలు చిగురించింది. మళ్లీ నేను ఫోజులు కొట్టడానికి అవకాశం కల్పించింది. 
ఆ ఐడియా ప్రకారం మరుసటిరోజు మడిచి పెట్టెలో పెట్టిన నా కొత్త ప్యాంట్ ని మళ్లీ తీసి నా ‘స్కూుల్’ బ్యాగ్ లో పెట్టాను.. స్కూల్ బ్యాగ్ లో ‘ప్యాంట్’ ఎందుకురా అని మా అమ్మ అడిగితే సాయంత్రం చెబుతాను అన్నా.. యధాప్రకారం స్కూల్ కి నిక్కర్ వేసుకుని బస్సు ఎక్కాను.. రోజుమాదిరిగానే నాకు కండక్టర్ ‘ముప్పావలా’ టికెట్ కొట్టాడు.. రాజుగారి హోటల్ సెంటర్లో దిగిన తర్వాత రావిటెక్స్ టైల్స్ పక్క సందులోంచి రోజూ మా స్కూల్ కి వెళ్లేవాడిని..అదే సందులో ఒక బట్టల కొట్టు ఉండేది.. అలాగే కొంచెం ముందుకు వెళ్తే వరుసగా పుస్తకాల బైండింగ్ షాపులు ఉండేవి.. ఆరోజు కూడా బస్సు దిగి ‘రావిటెక్స్ టైల్స్’ సందులోకి వెళ్లిన తర్వాత అక్కడ గోడపక్కకు వెళ్లి స్కూల్ బ్యాగ్ ఉన్న ప్యాంట్ తీసి నిక్కర్ పైనే వేసుకుని స్కూల్ కి వెళ్లా…అలాగే సాయంత్రం తిరిగి వచ్చేప్పుడు స్కూల్ నుంచి మళ్లీ అదే గోడదగ్గరకు వచ్చి నిక్కర్ పైన వేసుకున్న ప్యాంట్ తీసి బ్యాగ్ లో పెట్టుకుని నిక్కర్ తో బస్సు ఎక్కేవాడని..

అలా నా రాజేంద్రప్రసాద్ పాట నా ప్యాంట్ ఆశల్ని కాపాడింది.. రోజుకు రూపాయి ఆదా చేసింది. హాఫ్ టికెట్ కు హాఫ్ టికెట్..ప్యాంట్ కి ప్యాంట్.. అయితే ఇక్కడ ఆ పాటకి ప్యాంట్ ఆలోచనకు సంబంధం ఏంటో నాకే అర్థం కాలా..ఆ పాట వింటుంటే ఈ ఐడియా ఎలా వచ్చిందో ఇప్పటికీ తెలీదు.. ఇక్కడ బస్సు టికెట్ లో అర్థరూపాయి ఆదా చేయాలనే పిసినారి తనం కాదు.. మిగుల్చుకోవాలనే గొప్ప తెలివితేటలు అంతకన్నా కాదు.. అదో చెప్పుకోలేని తనం..

ఇప్పుడా ఐదో నంబర్ బస్సు లేదు.. రాజుగారి హోటల్ లేదు..నేను ప్యాంటు మార్చుకున్న ఆ గోడ లేదు.. కానీ జ్ఞాపకాలు మాత్రం పదిలంగానే వున్నాయి.. ఎందుకో తెలీదు ఆ ‘ముప్పావలా’ టికెట్ గుర్తొచ్చిపుడల్లా బాధగానే ఉంటుంది.. నన్ను వెక్కిరిస్తూనే ఉంటుంది.. మర్చిపోవడానికి ఒకరోజు కాదు రెండురోజులు కాదు మూడేళ్లపాటు అదే బస్సుల్లో వెళ్లాను..అందుకే మళ్లీ మళ్లీ వద్దనుకున్నా ఆ “కొడాలి అండ్ సన్స్” గుర్తొచ్చి బాధపెడుతూనే ఉంటుంది… ఇప్పుడు ముఖం మీద కనిపించే నవ్వు వెనుక ఇలాంటి ముప్పావల కథలు ఎన్నో వున్నాయి..అశోక్ వేములపల్లి

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *