Breaking News

35+ అంకుల్స్ బ్యాచ్…

35+ అంకుల్స్ బ్యాచ్…
ఈ 35ఏళ్ల వయసుంది చూశారూ..అదికచ్చితంగా మగాళ్లకు చాలా క్లిష్టమైన వయసు…అప్పటికి ఇంకా మనం నిత్యయవ్వనులం అనే ఫీలింగ్ లో, ఇంకా అమ్మాయిలకు లైన్ వేసే వయసే అనే “ఫిలాసఫీలో” బతికేస్తుంటాం కదా.. కుర్ర వయసు దాటి నడివయసుకు వచ్చామని మన మస్తిష్కం ఇంకా ప్రిపేర్ అయిఉండక పోవడం, ఉడుకురక్తం, ఉక్కు నరాలు అనే ఫీలింగ్ నుంచి బయట పడకపోవడం వల్ల ఉత్సాహం ఉరకలేసే వయసులోనే ఉన్నట్టుగా బతికేస్తుంటాం..కానీ ఈ “బర్త్ డే “అనేది ఒకటుంది కదా అది నువ్వు పెద్దోడివి అయిపోయావ్ అని గుర్తు చేసి దేవుడి మీద విపరీతమైన కోపాన్నికలుగ చేస్తుంది..

60ఏళ్లు వచ్చినా ఇంకా ఆ రజినీకాంత్ లు, చిరంజీవిలు 45ఏళ్లు దాటినా ఇంకా మహేష్ బాబులు, జూ ఎన్టీఆర్ లు, ప్రభాస్ లు ఇంకా అమ్మాయిల ఊహల్లో కలల రాకుమారులుగానే మిగిలిపోతారు.. వాళ్లనేమో ఈ ఫ్యాన్స్ అనబడే “శతృమూకలేమో” అన్నయ్యా అని పిలుస్తుంటారు ఇప్పుడే 35దాటిన మమ్మల్ని మాత్రం అంకుల్ అని పిలుస్తారు… అంకుల్ అన్న మాట వినపడగానే ఆ..మనల్ని కాదులే…అలా మనల్నిపిలవకూడదులే అని అనుకుంటాం…కానీ భయంకరమైన పేలుడుపదార్ధం శబ్దంకంటే భయంకరంగా వినిపించే ఆ అంకుల్ అనే మాట మననిఉద్దేశించే అని తెలిశాక.. గుండె కవాటాల్లో ఒకటి బ్లాక్ అయిపోయినట్టు, చిన్న మెదడులో ‘చిన్నగులకరాయి ‘అటూ ఇటూ కదిలినట్టు అనిపిస్తుంది..

సరే ఎవర్ని ఏం పిలవాలో తెలిని “యూజ్ లెస్ ఫెలోస్” అని తాత్కాలికంగా వారినితిట్టుకుంటూ మానసికంగా అప్పటికి ఏదో ఒకటి చెప్పుకుని బతికేస్తాం బాగానే ఉంది కానీ..
అత్త వయసుండే ఆంటీ కూడా ఎక్కడో షాపింగ్ మాల్ లో ఎదురయి ‘అంకుల్ ‘అన్నప్పుడు మాత్రం తిరిగే రంగుల రాట్నంలోంచి దూకేసినట్టు, అగ్నిగుండంలో పడిపోతే ఎవరో లాగుతున్నట్టు, ఊబిలో పడి పీకలవరకూ లోపలికి కూరుకుపోయినట్టుగా అనిపిస్తుంది. భారత శిక్షాసృతి నుంచి నాకు ఒక్కడికే కాస్తంత రిలీఫ్ ఇస్తే ఆ అంకుల్ అని పిలిచినోళ్లని ఏదోచేయాలిపిస్తుంది.

ఇదంతా ఒకటయితే బంధువుల ఫంక్షన్ కి వెళ్లినపుడు ఇంకోరకమైన సమస్య… “పెద్దనాన్నా”… అని తమ్ముడి పిల్లలు పిలిచినప్పుడు ఆనందపడాలో బాధపడాలో అర్థంకాదు..”నాన్న “అని నా పిల్లలు పిలిచినంతవరకూ ఓకే కానీ మరీపెదనాన్న అంటే పెన్షన్ తీసుకునే వయసుకు దగ్గరపడ్డామా అని కాసేపు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అందుకే ఆ పిల్లలకు కాస్తంత దూరంగా తిరుగుతాం.. ఇక కొంతమంది అయితే ఆ అంకుల్ కి విష్ చేశావా అనిపెళ్లీడుకొచ్చిన కూతుర్ని ఎవరో ఆంటీ మన ముందే అంటుంటే మరుగుతున్న సాంబార్ లో తలపెట్టాలనిపిస్తుంది.

అప్పటి వరకూ పెళ్లయిందా అని అడిగినోళ్లు..ఇప్పుడు కొత్తగాపిల్లల్ని ఏస్కూల్లో చేర్చావు అని అడుగుతుంటే కుర్రకారు బ్యాచ్ అంతా మనదగ్గరలోకి రాకుండా కేవలం అంకుల్స్ బ్యాచ్ మాత్రమే రావయ్యా ఇక్కడకూర్చో అని వాళ్లబ్యాచ్ లో కలిపేసుకుంటుంటే ఆ బాధ ఏ మానసిక వైద్యుడూతీర్చలేడు..

ఇక 35 ప్రస్ లో వచ్చే మరో దారుణమైన సమస్య జుట్టు ఊడడం.. వయసు పెరుగుతోందని గుర్తుగా నెత్తిమీద వెనుకో ముందో ఒక్కోవెంట్రుకా ఊడిపోతూ ..ముఖంమూడంగులాల పొడవు పెరుగుతుంటే ఉండే బాధ ఆ పాకిస్తానోడికి కూడా వద్దు.. ఉగాండా వెళ్లి అక్కడోళ్లకు ఊడిగం చేయొచ్చుగానీ బట్టతలతో మాత్రం బతకలేం… జుట్టు ఊడకుండా రాసే అయిల్స్ ఎక్కువగా కొనేది, స్కిన్ డాక్టర్ల దగ్గరక్యూలో నిల్చునేది, మొలకెత్తిన గింజలుతినేది ఈవయసులోనే.. అరవై, డెబ్బై ఏళ్ల వయసు వచ్చినా.. ఇంకా తలనిండా జుట్టుతోపక్కకి,వెనక్కి దువ్వుకుని కనిపించేవారిని చూస్తే విపరీతమైన విరక్తి..

రాలే బొచ్చు రాలక మానదు.. రాలని బొచ్చు ఎప్పటికీ రాలదు…కావాలంటే ఉంచుకునేది వద్దనుకుంటే తీసుకునేది బొచ్చొక్కటేగా అనిఎవరైనా రజినీకాంత్ డైలాగులు చెబుతుంటే… బంగాళాఖాతంలో కాసేపు వారందరినీ ముంచిలేపాలనిపిస్తుంది.

35ప్లస్ లో బాడీకాస్త ఫిట్ గా ఉండి కండలు తిరిగి ఉంటే కాస్త ఏజ్ ని కవర్ చేసుకోవచ్చు గానీ పాపం మాలో కొంతమందికి ఆ వయసుకే బట్టతల వచ్చేసి పొట్టపెరిగిపోయి… జీన్స్ నుంచి కాటన్ ప్యాంట్ కి, రీబోక్ షూ నుంచి లెదర్ చెప్పులకి మారిపోయినప్పుడు ఎందుకో ప్రళయం వచ్చినట్టు, ప్రపంచం మొత్తం అంతమైనపోయినట్టు ఫీలింగ్….

ఇక ఉద్యోగాలుచేసే చోట 35ప్లస్ లో ఒకవిచిత్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ వయసులో సీనియర్లు అయిపోయి రిటైర్మెంట్ కు దగ్గర పడినట్టుగా చూస్తారు.. అప్పటికి బాగా యాక్టివ్ గా ఉంటే పర్లేదు చీఫ్ పొజిషన్ లో ఉండొచ్చు.. కానీ అలా అవలేకపోతే మాత్రం అప్పుడే కొత్తగా ఆఫీస్ కి వచ్చే యంగ్ బ్యాచ్ లు ఉంటాయే వారితో కలవలేక వారు కలుపుకోలేక జీవితంలో ఏమీ సాధించలేకపోయామే అనే బాధతోవిలవిల్లాడాల్సిందే.. అభినందన్ లాంటి వారిని చూసినప్పుడు రక్తం పొంగిపోయి ఉత్సాహంతో ఏ ఆర్మీకో, నేవీకో, ఎయిర్ ఫోర్స్ కో వెళ్లిపోదామని డిసైడ్ అవుతాం..కానీ నోటిఫికేషన్ లో అది కేవలం 25ఏళ్లవయసులోపు మాత్రమే అని ఉన్నప్పుడు సర్టిఫికెట్ లో డేటాఫ్ బర్త్ మార్చే వాళ్లుంటే బాగుండు అనిపిస్తుంది.

విరాట్ కోహ్లీ లాంటి వాళ్లని చూస్తే మాకు విపరీతమైన జెలసీ.. అందరూవారిని అప్రిసియేట్ చేస్తుంటే మేము ఓర్వలేం..ఎందుకంటే వాళ్లు చిన్నవయసులోనే ప్రపంచం గుర్తించేస్థాయికి ఎదిగిపోతే మేము 35ప్లస్ కు వచ్చాం కానీ ఏమీ పీకలేకపోయాం అని తెగ బాధపడిపోతాం…45ఏళ్లుదాటినోడు కూడాతలకి ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుని ముఖానికి రంగేసుకుని సినిమాలో కాలేజీకుర్రోడి రోల్ చేస్తుంటే మేము మాత్రం 35ప్లస్ కే అంకుల్స్ బ్యాచ్ లో చేరి పిల్లలతో సినిమాదియేటర్ లో వెనుక వరసలో కూర్చుని పాచిపోయిన పాప్ కార్న్ తింటూ ఆ హీరోలో మమ్మల్ని ఊహించుకుంటూ బతికేస్తుంటాం..

35ఏళ్లువచ్చేప్పటికి పెళ్లి చేసుకుని ఉద్యోగంలోనే లేక వ్యాపారంలోనోకాస్తో కూస్తో సెటిల్ అయినోళ్ల పరిస్థితి కొంత వరకూ బెటరే కానీ 35ఏళ్లు దాటినా పెళ్లికానిప్రసాద్ లపరిస్థితి మరింత ఘోరం…వాళ్ల బాధలు వర్ణనాతీతం…

అందుకే 35ప్లస్ ని కూడా ఇంకా కుర్రకారుగానే బావించే విధంగా ప్రభుత్వంచట్టం తీసుకురావాలి.. అంకుల్ అనే పదాన్ని దేశవ్యాప్తంగా నిషేధించాలి.. 35దాటిన వారికి ప్రత్యేక హక్కులను కల్పించాలి… బట్టతలమీద జుట్టు మొలిపించుకోవడానికి చేసే ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రభుత్వమే ఉచితంగా చేయించాలి.. అంకుల్ అనిపిలిస్తే అట్రాసిటీ కేసు పెట్టాలి…

మిత్రుడు అశోక్ వేములపల్లి వాల్ నుండి సేకరణ ………..

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *