Breaking News

వృక్ష ప్రపంచం : బ్రహ్మ చింత … అదో వింత !!!

 

13240612_1020712654666132_7902528254379492129_n 13240672_1020712014666196_8284704125927910532_n 13241161_1020712787999452_8414364715060695573_n 13245250_1020711164666281_7148654158218559269_n 1936256_1020709041333160_5111272093086120540_n 13165998_1020709327999798_3930127406567191760_n 13174088_1020709154666482_6706375277519299726_n 13178571_1020709464666451_5256362921847833155_n 13179322_1020710591333005_1904254230496299208_n 13221693_1020710227999708_168454669868494249_n 13232964_1020709617999769_1395932580149108741_n 13233097_1020711034666294_6479032022976542576_n 13237580_1020710077999723_2563120739029688065_n 13238860_1020712247999506_4000190706653207332_n 13239984_1020710751332989_8763560811688792700_n 13240574_1020710391333025_6187087062265355583_n

వృక్ష ప్రపంచం : బ్రహ్మ చింత … అదో వింత !!!

బ్రహ్మచింత .. ఈ పేరే వింతగా ఉంది కదూ ! ఈ వృక్షం ఆకారం మరీ వింతగా ఉంటుంది.ఇదో అరుదైన వింత ఆకారం కల మధ్య తరహా ఆకురాల్చే వృక్షం. సాధారణంగా అన్ని చెట్లూ ఎత్తు పెరుగుతూ, కాండం చుట్టుకొలత విషయంలో కింది నుంచి పైకి దాదాపుగా ఒకే మోస్తరుగా ఉంటాయి. ఈ వృక్షం అలాకాదు. పైకి పెరిగే ఎత్తుకంటే మొదలు చుట్టుకొలతే చాలా ఎక్కువగా ఉంటుంది. చెట్టు ముదిరే కొద్దీ వృక్షం మొదలు చుట్టుకొలత (girth) విపరీతంగా పెరుగుతూ పోతూ ఉంటుంది. 70 అడుగుల ఎత్తు వరకూ పెరిగే ఈ వృక్షం మొదలు చుట్టుకొలత 90 అడుగుల పైమాటే. ఆఫ్రికాలోని ఉష్ణ మండలాలు, ఆస్ట్రేలియాలలో ఎక్కువగా కనిపించే ఈ జాతి వృక్షాలలో రెండు ఉపజాతులు భారతదేశంలో కూడా ప్రవేశపెట్టబడ్డాయి. బ్రిటీష్ వారి పాలనాకాలంలో మనదేశంలో ప్రవేశపెట్టబడిన ఈ వృక్షాలు మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువేనని చెప్పుకోవాలి. ఒకప్పుడు విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి మీద చిల్లకల్లు – జగ్గయ్యపేట మధ్య రహదారి వెంట ఉన్న పలు బ్రహ్మచింత వృక్షాలు రహదారి విస్తరణ సందర్భంగా చాలావరకు తొలగింపబడ్డాయి. బాపట్ల నుంచి సూర్యలంక వెళ్ళేదారిలో ఒక ప్రభుత్వ నర్సరీ ఆవరణలో ఉన్న ఒక బ్రహ్మ చింత వృక్షాన్ని నేను ఫోటోలు తీశాను. విజయవాడ పోలీసు కమీషనర్ కార్యాలయం ఆవరణలో ఒక వృక్షం, గుంటూరు- చిలకలూరిపేట రహదారిలో ఉన్న డా. నన్నపనేని మంగాదేవి గారి ‘చేతన’ ఆవరణలో మరో వృక్షం నేను చూశాను. దీని ఆకులను కూరగా, పులుసుగా, పప్పుతో కలిపి వండుకుంటారు. పుల్లగా ఉండే ఈ ఆకుల కారణంగా ఈ చెట్టుకు ‘బ్రహ్మ ఆమ్లిక’, ‘బ్రహ్మ చింత’, ‘సీమ చింత’ అనే పేర్లు వచ్చాయి. కొందరు దీనినే ‘బ్రహ్మమాలిక’ అని కూడా అంటున్నారు. తన మొదలులోని తొర్రలో ఈ వృక్షం తన వేసవి అవసరాలకోసం వాన నీళ్ళను నిల్వ చేసుకుంటుంది. వేసవిలో ఏనుగులు ఈ వృక్షంలో నిల్వ ఉన్న నీటికి తాగుతాయి. అలా ఈ వృక్షానికీ ఏనుగులకూ అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఈ వృక్షాన్ని హిందీలో ‘హాథీ కథియాన్’ అనీ, ‘హాథియాన్’ అనీ, తెలుగులో ‘ఏనుగు చింత’ అనీ, తమిళంలో ‘ఆనై పులియా మరమ్’(ఏనుగు చింత చెట్టు) అనీ అనడం. దీన్ని హిందీలో ‘గోరఖ్ ఆమ్లీ’ అనికూడా అంటారు. ఇథియోపియన్లు తమ స్థానిక భాషలో ఈ వృక్షాన్ని ‘ బావోబాబ్’ (Baobab) అంటారు. కొందరు దీనినే ‘బేవోబాబ్’ అనీ పలుకుతారు. దీని కాయలలోని గుజ్జును కోతులు ఇష్టంగా తింటాయి. ఆ కారణంగా దీనిని ఆంగ్లంలో ‘మంకీ బ్రెడ్ ట్రీ’ (Monkey Bread Tree) అంటారు. పుల్లగా ఉండే ఈ కాయల గుజ్జును బట్టి ఈ వృక్షాన్ని ఆంగ్లంలో ‘క్రీమ్ ఆఫ్ టార్టార్ ట్రీ’ ( Cream- of- Tartar tree) అంటారు. బొంబకేసీ (Bombacaceae) కుటుంబానికి చెందిన ఈ వృక్షం శాస్త్రీయ నామం ఎడాన్సనియా డిజిటేటా (Adansonia digitata). ఆఫ్రికా ఖండంలో విస్తారంగా పర్యటించి, సెనెగల్ దేశంలోని వృక్ష సంపదపై విశేష పరిశోధనలు చేసిన ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త మిచెల్ ఎడాన్సన్ (Michel Adanson – 1727- 1806) పేరు ఈ వింత వృక్షానికి పెట్టారు. లేత మొక్కలుగా ఉన్నప్పుడు బ్రహ్మ చింత ఆకులు మూడుగా చీలి ఉంటే, చెట్టు ముదిరే కొద్దీ ఐదుగానూ, మరికొన్ని వృక్షాలలో ఏడు పత్రకాలు (leaflets) గానూ చీలి ఉంటాయి. వీటి ఆకులు చూసేందుకు అరచేయిలాగానూ, ఐదుగా చీలిన ఈ పత్రకాలు చేతి వేళ్ళలానూ ఉండే కారణంగా వీటిని digitate leaves అంటారు. దాన్నిబట్టి ఈ వృక్షం శాస్త్రీయనామంలో ‘డిజిటేటా’ అని వచ్చింది. దీని కాండం బూడిద రంగులో మెత్తగా ఉంటుంది. అప్పుడప్పుడూ దీని కాండం కొంచెం ఎరుపు దాళు కూడా కలిగి ఉంటుంది. పొడవాటి పుష్పవిన్యాసపు కాడ (peduncle) మీద పూలు ఒంటరిగా ఉంటాయి. అవి 15 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన దీని కాయలు బయటి వైపు పసుపుపచ్చ నూగు కలిగుంటాయి. లోపల తెల్లటి, పసుపుపచ్చటి లేక లేత ఎరుపు రంగు పుల్లటి గుజ్జు కలిగి ఉంటాయి. ఈ గుజ్జులో మెరిసే నల్లటి గింజలుంటాయి.

ఇది చాలా వేగంగా పెరిగే వృక్షం. ఆఫ్రికాలోని తన సహజసిద్ధమైన పరిసరాలలో ఈ వృక్షాలు ఆరు వేల సంవత్సరాల వరకూ కూడా జీవిస్తాయి. ప్రపంచంలోని అతి సుదీర్ఘకాలం జీవించే వృక్షాలలో బ్రహ్మచింత ఒకటి. విత్తులు నాటితే మొలిచే మొక్కల్ని రెండేళ్ళపాటు పెరగనిచ్చి బాగా వర్షపాతం ఉండే ఆగస్టు- సెప్టెంబర్ నెలలలో మాత్రమే తిరిగి వేరుగా నాటుకోవాలి. చెట్టు వయస్సు ముదురుతున్న కొద్దీ కాండం బాగా విశాలంగా పెరిగి, దాని లోపల తొర్ర ఏర్పడి, క్రమంగా అదొక నీటి రిజర్వాయర్ గా తయారవుతుంది. కొన్ని బ్రహ్మచింత వృక్షాల తొర్రల్లో 4,500 లీటర్ల వరకూ నీరు నిల్వ ఉంటుందని తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఈ నీటి కోసమే వేసవిలో ఏనుగులు ఈ వృక్షాల దగ్గర మూగుతాయి. నీళ్ళు లేనప్పుడు ఈ తొర్రలలో ఆటవికులు నివాసం ఉంటారు.

ఈ వృక్షం యొక్క పుల్లని ఆకుల్ని ఆఫ్రికన్లు ఆకు కూరగా వాడుకుంటారు. ఎండబెట్టి వరుగుగానూ, పొడిగా చేసి కూడా కూరల్లో వాడుకుంటారు. అక్కడి ఆటవికులు తమ ఆహారం కోసం ఎప్పటికప్పుడు వీటి లేత ఆకుల్ని కోసేసే కారణంగా ఈ చెట్లు పుష్పించడం చాలా అరుదు. ఈ ఆకులు గుర్రాలకు పచ్చి మేతగా వేస్తారు. అమిత శక్తినిచ్చే ఈ ఆకులు శరీరంలో కొవ్వుని కూడా కరిగిస్తాయని ప్రతీతి. ఆకుల్లో మాంసకృత్తులు, పిండి పదార్థాలు, విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉన్న కారణంగా ఇవి ఆకుకూరగా వండుకోడానికి శ్రేష్ఠం. ఆఫ్రికన్లు తేళ్ళు, జెర్రులు, తేనెటీగలు, కందిరీగలు కుట్టినప్పుడు, కండరాలు వాచినప్పుడు, ఈ వృక్షం ఆకులను వెచ్చజేసి ఆ గాయాలమీద కడతారు. జ్వర నివారిణి (Febrifuge) గానూ, స్రావాలను నిరోధించేది (Astringent) గానూ, చెమట పట్టించేది (Sudorific) గానూ, బలవర్ధక ఔషధం (Tonic) గానూ ఈ ఆకుల రసానికి పేరుంది. చెవి పోటుకూ, కళ్ళు వాచి నొప్పి పెడుతున్నప్పుడు ఈ ఆకుల పసరు పిండి పోస్తే ప్రయోజనం ఉంటుంది. శ్వాస సంబంధమైన, జీర్ణకోశ సంబంధమైన అవ్యవస్థలకు ఈ వృక్షం ఆకులు, పూల కషాయం బాగా పనిచేస్తుంది. ఈ వృక్షం కాయల్లోని గుజ్జు పిండిలా, పొడిగా ఉండి, నిమ్మరుచి కలిగుంటుంది. గింజలు ఈ పిండిలో దాగుంటాయి. ఈ గుజ్జులో కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సి, విటమిన్ బి1, మాంస కృత్తులు ఉన్నకారణంగా ఇది బలవర్ధకం. ఈ గుజ్జును ఆఫ్రికన్లు గంజిలా కాచుకుని తాగుతారు. ఈ గుజ్జును నీటిలో కలిపి, తాగిస్తే బ్రాంఖైటిస్, ఎలర్జీ వల్ల వచ్చే దురదలు నయమవుతాయి. ఈ పుల్లటి గుజ్జును ఆఫ్రికన్లు పాలు తోడుబెట్టడా(Curdling)నికి ఉపయోగిస్తారు. ఈ గుజ్జునీ, విత్తనాలనీ పశువుల దాణాగానూ ఉపయోగిస్తారు. ఈ గింజల్లో ఉండే పప్పు బాదం పప్పులాగానే రుచిగా ఉంటుంది. పచ్చి గింజలలోని పప్పును పొడిచేసి, పిల్లలకు కోరింత దగ్గు వచ్చినప్పుడు లోనికి ఇస్తే బాగా పనిచేస్తుంది. పప్పును వేయించి, పొడి చేసి నూనెలో కలిపి రాస్తే పంటి నొప్పి, చిగుళ్ళ వాపు తగ్గుతాయి. నల్లగా మెరిసే ఈ విత్తులతో ఆఫ్రికన్ ఆటవికులు నెక్లేస్ లు తయారు చేసుకుని ధరిస్తారు. ఈ గింజల నుంచి బంగారు పసుపు వన్నెలో చిక్కగా ఉండే నూనెను తీస్తారు. గింజల పొడినీ, గింజలు కాల్చిన బూడిదనూ పంటలకు ఎరువుగా ఉపయోగిస్తారు. సబ్బుల తయారీలో ఈ బూడిదను ఉపయోగిస్తారు. ఈ వృక్షం కాండాన్ని కత్తితో కోస్తే తెల్లటి జిగురు స్రవిస్తుంది. దానికి వాసన, రుచి ఉండవు. గాలి తగిలేకొద్దీ అది ఎరుపు, గోధుమ వన్నెల మిశ్రమ వర్ణానికి మారుతుంది. ఈ జిగురు మానని మొండి పుళ్ళకు రాస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. కాండం లోపలి పట్ట (inner bark) నుంచి ‘ఎడాన్సనియా ఫైబర్’ గా పేరొందిన ఒక రకం నార తీస్తారు. ఇందుకోసం లోపలి పట్టను ఎంతగా ఒలిచినా, ఈ వృక్షం కొద్ది కాలంలోనే తిరిగి కొత్త పట్టను అభివృద్ధి చేసుకుంటుంది. తాళ్ళు పేనడానికి, గోతాలు, సంచులు తయారు చేయడానికి, గుర్రాల జీనులు, ఏనుగు అంబారీ(హౌడా)లు తయారు చేయడంలోనూ ఈ దృఢమైన నారను ఉపయోగిస్తారు. ఆఫ్రికాలో ఈ నారను బుట్టలు, చాపలు, ఉచ్చుల తయారీలోనూ, సంగీత వాద్యాల తంత్రులు (strings) గానూ వాడతారు. ఈ నారతో వస్త్రాలు నేస్తారు. ఈ వృక్షం లోపలి పట్ట నుంచి తయారు చేసిన గుజ్జును కాగితం పరిశ్రమలో మందపాటి ప్యాకింగు పేపర్ తయారీలో ఉపయోగిస్తారు. మెత్తగా, చాలా తేలికగా, లేత పసుపు వన్నెలో ఉండే ఈ వృక్షపు కలప బల్లకట్టులు, నావల తయారీకి, పళ్ళాలు, ట్రేల తయారీకీ వినియోగిస్తారు. దానిని కాల్చి కర్రబొగ్గు గానూ ఉపయోగిస్తారు. రూఫ్ సీలింగులు, ఫైబర్ బోర్డుల తయారీలోనూ వినియోగిస్తారు. ఈ కర్ర గుజ్జును కాగితం తయారీ పరిశ్రమలో ఉపయోగిస్తారు. దీని లేత వేళ్ళు ఆహారంగా ఉపయోగిస్తారు.

ఎడాన్సనియా గ్రెగొరీ (Adansonia gregorii) అనే సాంకేతిక నామం కలిగిన ఇదే జాతి కి చెందిన మరో ఉపజాతి వృక్షం ‘Bottle Tree’ పేరిట ప్రసిద్ధం. ఒకప్పుడు దీన్ని ఆస్ట్రేలియా నుంచి తెచ్చి కోల్ కాతా నగరంలోని బొటానిక్ గార్డెన్స్ లో వేయడం జరిగింది.

ఆ మధ్య ముఖపుస్తకంలో మిత్రులు శ్రీ VMRG సురేష్ గారు గోల్కొండ కొత్త కోటలోని సుమారు 800 ఏళ్ళ వయసున్న బ్రహ్మ చింత వృక్షాన్ని ఫోటోలతో సహా పరిచయం చేశారు. అది ఆఫ్రికాలోని మెడగాస్కర్ నుంచి కొందరు మౌల్వీలు తెచ్చి నాటారట. శిధిలమైన గోల్కొండ కోటకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ మహావృక్షం ఉంది. దాన్ని స్థానికులు ‘హాథియాన్’ అంటారు. అచ్చం ఎత్తిన తొండంలాగే ఉండే దాని కొమ్మలు దాని పేరును సార్థకం చేస్తున్నాయి. గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ తానీషా ఈ వృక్షాన్ని పవిత్రమైనదిగా భావించి పూజించేవారట. హాథియాన్ ఎత్తు 80 అడుగులు కాగా, దాని మొదలు వ్యాసం 25 మీటర్లు ఉండడం విశేషం. ఈ మహా వృక్షానికి రెండు పెద్ద గదులవంటి తొర్రలున్నాయి. హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్ కి సమీపంలో ఉన్న ఈ మహా వృక్షం ప్రస్తుతం పురావస్తు శాఖ సంరక్షణలో ఉంది. దీనిని చూడాలనుకునేవారు ఆ శాఖనుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. గోల్కొండ కోటకువెళ్ళే వారంతా తప్పక చూడదగిన వింత వృక్షమిది.

ఇవండీ వింతైన ‘బ్రహ్మ చింత’ వృక్షం గురించి నాకు తెలిసిన ముచ్చట్లు. మీ మీ ప్రాంతాలలో కూడా ఈ వింత వృక్షాలు ఉన్నట్లైతే వాటి వివరాలు మిత్రులందరితో పంచుకోండి. వీలున్న వాళ్ళు తమకు అందుబాటులో ఉన్న ఈ వింత వృక్షాలను తప్పక చూసి, స్పందిస్తారు కదూ !

— మీ.. రవీంద్రనాథ్, 98491 31029.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *